ధైర్యమే ఆయుధం

స్వామి వివేకానంద పరివ్రాజక సన్యాసిగా దేశమంతా పర్యటిస్తూ వారణాసి వెళ్లారు. ఆంజనేయ ఆలయం దర్శించుకొని తిరిగొస్తున్నారు. ఇంతలో కోతుల సమూహం కనిపించింది.

Updated : 07 Sep 2023 06:38 IST

స్వామి వివేకానంద పరివ్రాజక సన్యాసిగా దేశమంతా పర్యటిస్తూ వారణాసి వెళ్లారు. ఆంజనేయ ఆలయం దర్శించుకొని తిరిగొస్తున్నారు. ఇంతలో కోతుల సమూహం కనిపించింది. అన్ని కోతులు ఒకేసారి ఎదురొచ్చే సరికి ఏం చేయాలో తోచక వెనుతిరిగారు. అవి వెంబడించసాగాయి. స్వామీజీ నడక వేగాన్ని పెంచారు. మర్కటాలూ అంతే వేగంగా తరమసాగాయి. నిస్సహాయస్థితిలో స్వామీజీ అటూ ఇటూ చూస్తున్నారు. ఇంతలో దగ్గర్లో చెట్టుకింద ఓ వృద్ధసాధువు ‘అవేమీ చేయవు. భయపడకుండా ధైర్యంగా ఎదుర్కో’ అని హితవు పలికారు. దాంతో వివేకానంద పరుగు ఆపి నిర్భయంగా, స్థిమితంగా నిలబడ్డారు. తదేక దీక్షతో కోతుల వంక చూశారు. అంతే అవి తోకముడిచి పారిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత స్వామీజీ న్యూయార్క్‌లో ప్రసంగిస్తూ వారణాసి సంఘటన ప్రస్తావించారు. ‘ఆ ఉదంతం నుంచి దేన్నయినా ధైర్యంగా ఎదుర్కోవాలనే పాఠం నేర్చుకున్నాను. సమస్యలను చూసి పారిపోకుండా నిర్భయంగా నిలిస్తే ఎంతటి భయానక పరిస్థితులైనా చక్కబడతాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఆ కోతుల్లాంటివే! మనం భయపడితే, అవి భయపెడతాయి. ఎదురుతిరిగితే అవే పారిపోతాయి. పిరికివాళ్లకు పిల్లి కూడా పులిలాగే కనిపిస్తుంది. ధీశాలులు పులిని చూసినా భయపడరు. వాళ్లను ఏ అవాంతరాలూ అడ్డుకోలేవు. ధైర్యమే ఆయుధమౌతుంది’ అంటూ ఉద్ఘాటించారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని