Ganesha: సత్య ధర్మ స్వరూపుడు వరసిద్ధి వినాయకుడు

వినాయక చవితి వస్తోందంటే ఇంటా బయటా.. అంతటా సంబరం. పిల్లలూ పెద్దలూ అందరిలో పరవశం. ఏ పండుగైనా ఆనందాలు మోసుకొస్తుంది. వీధివీధిలో గణేశుడి విగ్రహాలూ, పూజలూ, భక్తిగీతాలతో ఈ పర్వదినం మరింత సందడిగా.. ఉత్సవ వాతావరణాన్ని తెస్తుంది.

Updated : 18 Sep 2023 09:34 IST

వినాయక చవితి వస్తోందంటే ఇంటా బయటా.. అంతటా సంబరం. పిల్లలూ పెద్దలూ అందరిలో పరవశం. ఏ పండుగైనా ఆనందాలు మోసుకొస్తుంది. వీధివీధిలో గణేశుడి విగ్రహాలూ, పూజలూ, భక్తిగీతాలతో ఈ పర్వదినం మరింత సందడిగా.. ఉత్సవ వాతావరణాన్ని తెస్తుంది.

బొజ్జ గణపయ్యకు చిట్టెలుకే వాహనం. ఉండ్రాళ్లే ఇష్ట భోజనం. వాటితోనే తృప్తి చెందుతూ నమ్మిన భక్తులకు ఉన్నత స్థితినిస్తూ కాచి కాపాడుతుంటాడు ఆ స్వామి. విఘ్నాలను తొలగించే వినాయకుడు సత్య ధర్మ స్వరూపుడు. ఆ స్వామి రూపం, తత్వం అంతా ప్రత్యేకమే, అన్నీ విశిష్టమే. గణపతి రూపంలో ప్రణవనాదం- ఓంకారం ప్రత్యక్షమవుతూ, ప్రతి ధ్వనిస్తూ ఉంటుంది. అసలా స్వామి ధర్మ నిరూపణ నేపథ్యంలోనే ఆవిర్భవించాడు. స్కందాగ్రజుని తత్వమంతా సత్యపాలనకేనని పలు పురాణ కథలు పేర్కొంటున్నాయి. అలాగే వర సిద్ధి వినాయకుడు వరాలను సిద్ధింపజేస్తూ సద్బుద్ధిని ప్రేరేపించేవాడిగా వెలుగొందుతున్నాడు. భక్తల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతూ అనేక గణేశ క్షేత్రాల్లో కొలువు తీరి ఉన్నాడు.

తనయుడిగా తెలిపిన ధర్మం

వినాయక చవితిని పిల్లలచేత తప్పనిసరిగా ఎందుకు చేయించాలి అనే సందేహం కొందరికి వస్తుంటుంది. అందుకో స్పష్టమైన ఉదాహరణ ఉంది.. గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలనే విషయంలో పరమేశ్వరుడు పెట్టిన పరీక్షలో వినాయకుడే గెలిచాడు. కుమారస్వామి, విఘ్నేశ్వరుల్లో భూమండలాన్ని ముందుగా ఎవరు చుట్టి వస్తే వారికే గణాధిపత్యమన్నది శివయ్య మాట. కుమారస్వామి వద్ద వేగంగా ప్రయాణించ గలిగిన నెమలి వాహనం ఉంది. కానీ గణపయ్యకు కదిలేందుకు ఇబ్బందిగా ఉండే పెద్ద బొజ్జ.. దానికి తోడు చిట్టెలుక వాహనం. ఈ క్లిష్ట పరీక్షకు కుంగి పోలేదు ఉండ్రాళ్లయ్య. ఎంతో ధైర్యంగా, స్థైర్యంగా ఉన్నాడు. ధర్మమే అన్నీ సమకూర్చి పెడుతుందని ముందడుగు వేశాడు. తనయుడిగా తన లక్ష్యం ఒక్కటే.. అమ్మానాన్నలను పూజించాలి, గౌరవించాలి. ఆ కర్తవ్యనిర్వహణతో కూడిన ధర్మాన్నే ఆయన ఆచరించాడు. తలిదండ్రులకు ప్రదక్షిణలు చేశాడు.. భూమండలాన్ని చుట్టిన ఫలితాన్ని వెనువెంటనే పొందాడు. ప్రతి తీర్థాన్నీ, క్షేత్రాన్నీ షణ్ముఖుడి కంటె ముందు చేరాడు. గణాధిపత్యానికి అర్హత సాధించాడు. తల్లిదండ్రులను గౌరవిస్తే జీవితానికి కావలసిన అన్నీ సులభ సాధ్యాలవుతాయన్న ధర్మ సూక్ష్మాన్ని వినాయకుడు ఇక్కడ అందించాడు. అంతే కాదు గజాననుడిగా మారేందుకు ముందు అమ్మ మాటను పాటించటం ధర్మమని నిర్ణయించుకుని వాకిట్లోనే శివయ్యను ఆపాడు. నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోసింది. పార్వతి స్నానానికి వెళ్తూ. ఎవరినీ లోపలికి రానివ్వొద్దని గడపలో కాపలాగా ఉంచింది. పరమేశ్వరుడొచ్చి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అమ్మ ఇచ్చిన ఆజ్ఞను పాటించటం తన ధర్మమని శివయ్యను లోపలికి పంపలేదు. గణపయ్యకు శిరచ్ఛేదమయ్యింది. కానీ ధర్మాన్ని పాటించిన కారణంగా గజాననత్వం సిద్ధించింది. తొలి పూజలందుకునే ఇలవేల్పు అయ్యాడు. ఆ ధర్మ ప్రభువుని, విఘ్నేశ్వరుని పూజిస్తే చదువు, ఉద్యోగం ఏదైనా నిర్విఘ్నంగా సాగిపోతుంది.

సత్యం.. నిత్యం ఆయన చెంతే!

కాణిపాకం వరసిద్ధి వినాయకుడంటే సత్యానికి ప్రతి రూపుడన్నది నమ్మకం. సత్య నిరూపణ విషయంలో ప్రామాణికంగా కాణిపాకంలోని ఈ ఆలయాన్నే ఎంచు కుంటారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మతాతీతంగా భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకోవటం విశేషం.

స్థల పురాణం

చారిత్రక ఆధారాల ప్రకారం సుమారు వెయ్యేళ్ల కిత్రం కాణిపాక ఆలయాన్ని నిర్మించారు. ప్రచారంలో ఉన్న పురాణ కథలను అనుసరించి- పూర్వం విహారపురి అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు. వాళ్లు ధర్మానుసారంగా జీవిస్తూ అందరి మన్ననలూ అందుకున్నారు. కానీ పూర్వజన్మ కర్మానుసారం వాళ్లు ముగ్గురూ దివ్యాంగులుగా జన్మించారు. మాట్లాడలేని వాడు ఒకడు, వినికిడి శక్తి లేని వాడు ఒకడు, చూడలేని వాడు మరొకడు. అలా కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగుచేసుకుంటూ జీవిస్తుండేవారు ఆ సోదరులు. ఒకసారి ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని రోజులొచ్చాయి. ఆ సోదరులు మాత్రం కరవు బాధకు కుంగిపోకుండా ఆ పరిస్థితిని జయించాలని సంకల్పించుకున్నారు. తమ పొలంలో ఉన్న పెద్దబావిలో పూడిక తీసి మరింత లోతు చేయాలనుకున్నారు. అలా తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి తగిలింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాతికి తగిలి.. దాన్నుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తం సోదరులను తాకగానే వాళ్ల వైకల్యం తొలగింది. ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో వినాయక విగ్రహం కనిపించింది. స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించి కొబ్బరికాయలు సమర్పించారు. పలు కోరికలను కోరుకుని దీవించమని ప్రార్థించారు. వారందరికీ వరాలిచ్చిన ఆ స్వామి వర సిద్ధి వినాయకుడయ్యాడు. ఇక ఆ తర్వాతెన్నడూ ఆ ప్రాంతంలో కరవు రాలేదట. ఈ కథనం ఆ స్వామి స్వయంభువని పేర్కొంటోంది.

సత్య ప్రమాణాల దైవం

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కాడు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామే శిక్షిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వ్యసనాలకు బానిసలైన వారు స్వామి ఎదుట ప్రమాణం చేస్తే.. ఇక వాటికి దూరం అవుతారని కూడా భక్తులు నమ్ముతారు.

డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని