వదిలేస్తే శాంతి!

ప్రశాంతంగా జీవిస్తున్న ఓ పక్షికి పెద్ద మాంసం ముక్క దొరికింది. దాన్ని ముక్కున కరుచుకుని.. తినే చోటుకోసం వెతుకుతూ గగనతలాన వెళ్తోంది.

Updated : 21 Sep 2023 07:13 IST

సెప్టెంబరు 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం

సముద్రంలో తరంగాలు, నురుగులు, సుడులు ఎన్ని రకాలుగా ఉన్నా.. అవన్నీ నీటి స్వరూపాలే. వాటి సహజ స్థితి నీరే. అలాగే మన సహజ స్థితి శాంతమే. ఎదుగుతున్న క్రమంలో ప్రశాంతమైన సహజ స్థితి నుంచి పక్కకు జారిపోతుంటాం. దాంతో అశాంతి, అల్లకల్లోలం! మనసులో పుట్టిన ఆ అశాంతితో ఇంద్రియాలు, వాటివల్ల శరీరం, దాంతో మనం- ఇలా అంతటా, అందరిలో అశాంతి. మరి శాంతిగా ఉండాలంటే.. రాగం, ద్వేషం- రెంటినీ వదిలేయాలి.

ప్రశాంతంగా జీవిస్తున్న ఓ పక్షికి పెద్ద మాంసం ముక్క దొరికింది. దాన్ని ముక్కున కరుచుకుని.. తినే చోటుకోసం వెతుకుతూ గగనతలాన వెళ్తోంది. అది చూసి కొన్ని పక్షులు వెంబడించాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో చెట్టుపుట్టలు తిరిగింది. అయినా అవి తనను వదలక పోవడంతో మాంసఖండాన్ని వదిలేసింది. అందాకా వెంబడించిన పక్షులు దాన్నొదిలి, మాంసం కోసం పోట్లాడుకుంటున్నాయి. వదిలేసిన పక్షి విలాసంగా చెట్టు కొమ్మన కూర్చుని, ఆ సన్నివేశాన్ని ప్రశాంతంగా చూస్తోంది. అంటే పట్టుకోవడం కంటే వదిలేయడంలోనే శాంతి ఉంది.
మనకు ఆందోళనలో అశాంతి. ఆవేశంలోనూ అశాంతే. ఈ రెండింటికి కారణం రావాల్సినది రాలేదనో, ఉన్నదేదో పోయిందనో లేదా పోతుందనో. అలా కలిగేది ఆందోళన, అందుకు కారణమైన వారి పట్ల కలిగేది ఆవేశం. ఈ ఆందోళన, ఆవేశాల ప్రియ పుత్రికే అశాంతి. దీన్నొదిలి శాంతి వైపు పయనించాలంటే ప్రధానంగా రెండు అడ్డంకుల్ని అధిగమించా లని చెబుతుంది భారతంలోని కామగీత. అవి అహం (నేను), మమ (నాది) అనే భావన. దీన్ని బట్టి అన్నిటికీ మూలం కోరికే అని స్పష్టమవుతుంది. దాన్ని నియంత్రించగలిగితే- అంతా శాంతమే. నియంత్రణ అంటే కోరికల్ని వదిలేసుకోవడం కాదు, వాటి తీరుతెన్నులు తెలుసుకొని విచక్షణతో అదుపులో పెట్టుకోవడం. మనసు.. బుద్ధికి లోబడి విచక్షణతో ఉండటమే శాంతి. ఇది సాధన వల్ల సాధ్యమవుతుంది.. అదే నిజమైన శాంతి. అలా కాకుండా బలవంతంగా కోరికల్ని అదుపు చేస్తే వచ్చే శాంతి తాత్కాలికం.

దుఃఖాన్ని కర్తవ్యంగా..

రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయినప్పుడు, అలాగే అతడు లక్ష్మణుడిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు.. మహా అశాంతికి లోనయ్యాడు శ్రీరాముడు. కురుక్షేత్ర యుద్ధానంతరం బంధుమిత్రుల చావుకు కారణమయ్యానన్న దుఃఖంతో ధర్మరాజు, అభిమన్యుని మరణవార్త విన్న అర్జునుడు కూడా దుఃఖ సాగరంలో మునిగి అశాంతికి లోనయ్యారు. వాళ్లంతా మానవ సహజమైన ఆందోళన, ఆవేశాలకు లోనైనప్పటికీ అందులో కూరుకుపోలేదు. తమ దుఃఖాన్ని కర్తవ్యంగా మలచుకున్నారు. దాన్నే సాధన అంటారు. సాధకులు దైవ నిర్ణయం ఎలా ఉన్నా సరే.. దాన్ని ఆమోదించగలుగుతారు.
తాను అనుకున్నదే జరగాలనే పట్టుదల ఉంటే.. అనుకూలంగా ఉన్నప్పుడు అంగీకరించి, ప్రతికూలతను వ్యతిరేకిస్తారు. అంతేకానీ అందులో సత్యాన్ని గ్రహించరు. ‘సీత అందంగా ఉంటుంది, ఎత్తుకొచ్చేయ్‌’ అన్న శూర్పణఖ మాట రావణుడికి నచ్చింది. ‘రాముడు ధర్మస్వరూపుడు, మహా పరాక్రమవంతుడు. సీతను ఎత్తుకొస్తే నువ్వు సమూలంగా నాశనమైపోతావ్‌’ అన్న మారీచుని మాట అతడికి నచ్చలేదు. బుద్ధితో ఆలోచిస్తే మంచేదో చెడేదో తెలిసేది. అలా చేయనందున అశాంతే దక్కింది.
తనది కాని రాజ్యాన్ని తాను అనుభవించడమే కాక, అర్హులైన సోదరుల్ని అవమానించి అడవులపాలు చేశాడు దుర్యోధనుడు. అతణ్ణి గుడ్డిగా సమర్థించిన ధృతరాష్ట్రుడు అశాంతిని కోరి తెచ్చుకున్నాడు. విదుర, సంజయ, సనత్సుజాతుల బోధనలు, సాక్షాత్తు కృష్ణపరమాత్మ విశ్వరూప దర్శనం కూడా అతడి అశాంతిని దూరం చేయలేకపోయింది. అంటే బాహ్య విషయాలు ఎంత ఉత్తమం, ఉన్నతం అయినా బుద్ధిని మార్చుకోనంత కాలం శాంతిని సాధించలేం. రావణ దుర్యోధన ధృతరాష్ట్రులకు వారి అశాంతే వారికి శిక్ష.

బ్రహ్మదేవుడేమన్నాడంటే...

బాహ్య విషయాలు అనుకూలమైనా, ప్రతికూలమైనా మనసును తాకకుండా ఉంచగలగడం శాంతికి మూలం. ‘అంతః శీతలతాయా స్యాత్‌ తదనంత తపః ఫలమ్‌’ అంటుంది యోగవాసిష్టం. అంటే అన్నిటి కంటే ముఖ్యమైంది, అమూల్య మైంది మనశ్శాంతి. అనేక సాధనల పుణ్యఫలమది. ఎవరూ చెరపలేని శాంతిని పొందడానికి మరో మార్గం త్యాగం. ‘న కర్మణా న ప్రజయా ధనేన త్యాగైనైకేన అమృతత్వ మానశుః’ అంటుంది కైవల్యోపనిషత్తు. కర్మలు, సంతానం, ధనం ఇవ్వలేని శాంతి త్యాగంతోనే సాధ్యమన్నది బ్రహ్మదేవుడి ప్రబోధ.
శివరాత్రి నాడు ఉద్భవించిన లింగానికి ఆద్యంతాలు కనుక్కోవాలని విష్ణువు వరాహరూపంలో తవ్వుకుంటూ కిందికి వెళ్లాడు. బ్రహ్మ హంసనెక్కి పైకి వెళ్లాడు. కిందికెళ్లడం గతాన్ని, పైకెళ్లడం భవిష్యత్తును సూచిస్తుంది. ఎదుట ఉన్న వర్తమానాన్ని, ఆ ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయిన ఆ ఇద్దరికీ నిరాశా, అశాంతే ఎదురయ్యాయి.

ఇంద్రియేభ్యశ్చ పంచేభ్యః మనసశ్చైవ భారత
అతీత అనాగతేభ్యశ్చ ముక్తశ్చేత్‌ సః సుఖీభవేత్‌

అంటుంది సనత్సుజాతీయం. భూత భవిష్యత్తుల నుంచి ముక్తి పొందితే అదే శాంతి. అంటే గతాన్ని మర్చిపోవడం, ప్రస్తుతాన్ని గమనించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటం. ఈ జ్ఞానాన్ని పొందడమే శాంతి. పరిస్థితులను నియంత్రించడం కాదు, ఏ పరిస్థితినైనా తట్టుకోవడం శాంతి. సంకల్ప రాహిత్యం శాంతి. అంటే సంకల్పాలు లేకపోవడం కాదు. జిల్లెళ్లమూడి అమ్మ చెప్పినట్లు- సంకల్పాలన్నీ భగవంతుడిచ్చినవేనన్న భావనే శాంతి.
‘శాంతి కోసమే యుద్ధం’ అన్నారు దాశరథి. అంటే ప్రస్తుతం ఏదో అశాంతి ఉంది. దానికి కారకులైనవారిని సంహరిస్తే మిగిలేది శాంతి- అన్నది అంతరార్థం. ఇది శాంతి సాధనలో ఏకదేశం మాత్రమే.
పశుపక్ష్యాదుల వల్ల కలిగే ఆదిభౌతిక తాపం.. వరదలు, భూకంపాది ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆదిదైవిక తాపం.. శారీరక ఈతి బాధల వల్ల కలిగే ఆధ్యాత్మిక తాపంతో కూడిన తాపత్రయాన్ని ఉపశమింపజేసే ‘ఓం సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్‌ దుఃఖభాగ్‌ భవేత్‌ ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః’ అనే శాంతిమంత్ర భావాన్ని మనసులో స్థిరపరచుకోవడమే శాంతిని పొందగలిగే మార్గం.

 డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వర రావు, త్రిపురాంతకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని