త్రిమూర్తులను మించినవాడు

అది ఓ గురువు అభినందన సభ. ఆయన విశిష్టతను గురించి ఒక్కో శిష్యుడు ఒక్కో రీతిలో అభివర్ణించారు. ఎప్పుడూ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యే శిష్యుడు ఆఖరుగా వేదికపైకి వచ్చాడు.

Published : 05 Oct 2023 00:30 IST

ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం

ది ఓ గురువు అభినందన సభ. ఆయన విశిష్టతను గురించి ఒక్కో శిష్యుడు ఒక్కో రీతిలో అభివర్ణించారు. ఎప్పుడూ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యే శిష్యుడు ఆఖరుగా వేదికపైకి వచ్చాడు. ‘గురువర్యులను సూర్యుడితో పోల్చి స్తుతిద్దామనుకున్నా! కానీ సూర్యుడు బయట కనిపించే చీకటినే పారదోలుతాడు. గురువు మనసులోని అజ్ఞాన తమస్సును కూడా పోగొట్టే సమర్థుడు. అంతేకాదు, సూర్యుడు రాత్రిపూట, మబ్బుపట్టిన వేళ, గ్రహణ సమయంలో కనుమరుగవుతాడు. కానీ గురువు నిత్యప్రకాశితుడు. అందుకే సూర్యుడి కంటే గొప్పవాడు. పోనీ చంద్రుడితో పోల్చా లనుకుంటే.. అతడికి వృద్ధిక్షయాలున్నాయి. కృష్ణపక్షంలో కనుమరుగవుతాడు. పైగా కళంకమూ ఉంది. గురువర్యులకు వృద్ధిక్షయాలు లేవు, పరిపూర్ణుడు, నిష్కళంకుడు, నిత్యప్రసన్నుడు. అందుకే చంద్రుడి కంటే గొప్పవాడు. సముద్రంతో పోల్చాలనుకుంటే.. కడలి అగాధంగా కనిపిస్తున్నా, దాని లోతు తెలుసుకో దగిందే! కానీ గురుదేవుల జ్ఞానం కొలవలేనంత! అంతరంగం అంతుపట్టనిది. సముద్ర గర్భంలో లౌకిక విలువ కలిగిన ముత్యాలు, రత్నాలు ఉండగా.. గురుదేవుల హృదయం రత్నాల కారుణ్యం, ముత్యాల సహనం, పగడాల వైరాగ్యంతో నిండి.. వెలకట్టలేని విధంగా ఉన్నందున సాగరం కంటే గొప్పవాడు. అగ్నితో పోలుద్దామంటే అది స్థూలమైన వాటినే దహించగలదు. కానీ గురుదేవులు మనలో పేరుకుపోయిన అజ్ఞానాన్ని, జన్మాంతరాలుగా ఉన్న కర్మరాశులను తన జ్ఞానజ్వాలతో భస్మం చేయగలరు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు శత్రువుల్ని నిలువునా దహించేయగలరు. అందువల్ల అగ్ని కంటే గురువే ఘనమైనవాడు. ఇక సృష్టి, స్థితి, లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుద్దామన్నా, ఆ మూడు కార్యాలూ నిత్యసత్యమై ఉన్న ఏకమైన పరబ్రహ్మశక్తి వల్ల జరుగుతున్నాయి. అలాంటి పరబ్రహ్మశక్తి కలిగిన, గుణాతీతుడు గురుదేవులు’ అంటూ హృదయపూర్వకంగా కీర్తించి..

న గురోరధికం తత్వం న గురోరధికం తపః
న గురోరధికం జ్ఞానం తస్మైశ్రీ గురవే నమః

అంటూ ఒక శ్లోకం కూడా చెప్పి ముగించాడు. గురుదేవుని మించిన తత్వం లేదు. గురుబోధను మించిన జ్ఞానం, గురుసేవను మించిన తపస్సు లేదు. గురువుకు నా వందనాలు- అనేది భావం.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని