ఆ మేఘం  అక్కడెందుకు  వర్షించిందంటే...

ఒక బాటసారి ఊరి శివారు మైదానంగుండా నడిచి వెళుతున్నాడు. ఒక్కసారిగా నింగిలోనుంచి ఏవో...

Updated : 16 Apr 2020 00:50 IST

ఇస్లాం సందేశం

క బాటసారి ఊరి శివారు మైదానంగుండా నడిచి వెళుతున్నాడు. ఒక్కసారిగా నింగిలోనుంచి ఏవో మాటలు అతని చెవుల్లో ధ్వనించాయి. ఆకాశం నుంచి ఏదో గంభీరమైన వాణి!

‘‘ఓ మేఘమా ఫలానా అతని తోటలో వర్షించి కళకళలాడేలా చేయి!’ ఈ మాటలు ముగిసిన మరుక్షణమే ఆ మేఘం అక్కడి నుంచి కదిలింది. కొద్ది దూరంలోనే ఓ పర్వతపు అంచున మేఘం తనలోని నీటిని గుమ్మరించింది. వర్షపు నీరంతా ఆ పక్కనే ఉన్న కాలువ నుంచి దగ్గరలోని తోటలోకి ప్రవహించింది.

బాటసారి కాలువ ఒడ్డున ప్రయాణించాడు. కనుచూపు మేరలో ఓ రైతు తన పండ్ల తోటవైపు వస్తున్న కాలువ నీటిని పారద్వారా మళ్లిస్తున్నట్లు గుర్తించాడు బాటసారి. వడివడిగా అతనివైపు అడుగులు వేశాడు.

దగ్గరికెళ్లి ‘‘నీ పేరేమిటి దైవదాసుడా’ అని అడిగాడు. ఆ వ్యక్తి చెప్పిన పేరూ, మేఘంలోనుంచి వచ్చిన పేరూ రెండూ ఒక్కటే అని నిర్ధరించుకున్నాడు.

‘ఇంతకీ నాపేరెందుకు అడుగుతున్నట్లు’ అని ఆ తోట యజమాని; బాటసారిని ప్రశ్నించాడు.

‘నేను ఇటుగా వస్తున్న సమయంలో దివ్యవాణి ‘మేఘాలను నీ పండ్ల తోటలో వర్షించు’ అన్న మాటలు విని ఆశ్చర్యమేసింది.

ఆ దైవమే నీ పండ్ల పొలంలో వర్షించమని మేఘానికే ఆదేశించాడంటే నీలో ఏదో గొప్ప గుణమేదో ఉందన్న కుతూహలం నాలో కలిగింది. అని వివరించాడు.

‘నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నేను నా తోట సాగు ద్వారా వచ్చిన రాబడిని మూడు సమాన భాగాలు చేస్తాను. ఒక భాగాన్ని దైవం పేరుతో తీసి; నిరుపేదలు, అభాగ్యులు, వితంతువులకు దానం చేస్తాను. రెండో భాగాన్ని నేను, నా ఇంటి వారి కోసం వెచ్చిస్తాను. ఇక చివరి భాగం తోట అవసరాల కోసం ఉంచుతాను.’ అని చెప్పాడు.

ముహమ్మద్‌ ప్రవక్త (స) చెప్పిన ఈ గాథ ఎంతో ప్రాచుర్యం పొందింది. దానధర్మాల వల్ల కలిగే శుభాలను ఇది తెలియజేస్తుంది. మనిషి తాను సంపాదించిన ధనానికంతటికీ తానుమాత్రమే యజమాని కాడని, అందులో కుటుంబ సభ్యులు, నిరుపేదలకూ హక్కు ఉందని ఖుర్‌ఆన్‌ ఆజ్ఞలు ఉద్బోధిస్తున్నాయి.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు