ఆదర్శం  ఆవిర్భవించిందిలా!

‘‘ఇతరులను చిత్తు చేసేవాడు బలమైనవాడు కాదు. కోపం వచ్చినప్పుడు తనను తాను అదుపు చేసుకున్నవాడే బలవంతుడు’’....

Updated : 29 Oct 2020 01:39 IST

ఇస్లాం సందేశం

అక్టోబర్‌ 30 మిలాదున్నబీ ప్రవక్త (స) జయంతి

‘‘ఇతరులను చిత్తు చేసేవాడు బలమైనవాడు కాదు. కోపం వచ్చినప్పుడు తనను తాను అదుపు చేసుకున్నవాడే బలవంతుడు’’

క్కా నగరంలోని ఒక కూడలి వద్ద ఒక వృద్ధురాలు తన సామాను మూటను మోయలేక కూలీవాని కోసం ఎదురుచూస్తోంది. అంతలోనే ప్రవక్త ముహమ్మద్‌ (స) ఆమెను చూసి ‘‘అమ్మా ఈ మూటను నేను మోయనా’’ అని అడిగారు. ఆ వృద్ధురాలు బోసి నవ్వులు నవ్వింది. ఆ మూటను ప్రవక్త (స) తన భుజాలపై ఎత్తుకున్నారు.  దారి పొడవునా ‘‘నాయనా ఎవరో ముహమ్మద్‌ అట... దేవుడు ఒక్కడేనని చెబుతున్నాడు. అతని మాటలు విన్న ఎవరైనా అతని వారైపోతున్నారు. నాయనా అతనితో జాగ్రత్త’’ అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది.
ఇంటిదాకా చేర్చి తిరిగి వస్తుండగా ‘‘బాబూ నీ కూలి డబ్బులు తీసుకోనాయనా’’ అని పిలిచింది.
‘‘వద్దమ్మా’’ అంటూ ప్రవక్త (స) సున్నితంగా తిరస్కరించారు.
‘‘బాబూ ఇంతకీ నీవెవరవు. నీ పేరేమిటి నాయనా.’’
‘‘మార్గ మధ్యంలో నీవు ఎవరిగురించి చెప్పావో ఆ ముహమ్మద్‌ ని నేనేనమ్మా’’ అని చెప్పిన సమాధానానికి ఆ వృద్ధురాలు ఉలిక్కిపడింది.
‘‘నీవే ఆ ముహమ్మద్‌ వి అయితే నేను నీవు బోధించే ధర్మాన్ని ఈ క్షణమే స్వీకరిస్తున్నా’’నంటూ కలిమా చదివిందావిడ.
దారిపొడవునా తనను దూషిస్తున్నా చిరునవ్వులు చిందిస్తూ ఆ ముసలావిడ మూటను మోసిన ప్రవక్త (స) ఆదర్శం ఎన్నోసార్లు కనిపిస్తుంది. మక్కాలోని శత్రువులు సైతం ఆయన్ను అమీన్‌ (నిజాయితీపరుడు) సాదిక్‌ (సత్యవంతుడు)అని పిలుచుకునేవారు. ప్రపంచ మానవాళికి ముహమ్మద్‌ ప్రవక్త (స) ఆదర్శప్రాయుడని ఖురాన్‌లో అల్లాహ్‌ కితాబిచ్చాడు.

-ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని