మోహం.. పతనం

స్త్రీ వ్యామోహం ఎంతటివారినైనా పతనం చేస్తుందనడానికి ఈ బైబిల్‌ కథ నిదర్శనం. ఇజ్రాయెల్‌లో మానోహా దంపతులకు లేక లేక శాంసన్‌ అనే వరపుత్రుడు జన్మించాడు. శత్రువులను జయించి బలశాలిగా

Updated : 18 Nov 2021 05:17 IST

స్త్రీ వ్యామోహం ఎంతటివారినైనా పతనం చేస్తుందనడానికి ఈ బైబిల్‌ కథ నిదర్శనం. ఇజ్రాయెల్‌లో మానోహా దంపతులకు లేక లేక శాంసన్‌ అనే వరపుత్రుడు జన్మించాడు. శత్రువులను జయించి బలశాలిగా పేరొందాడు. ఇతని జుట్టు ఎన్నడూ కత్తిరించకూడదనేది దేవుడి ఆదేశం.

శత్రు కుటుంబానికి చెందిన ఓ యువతిని శాంసన్‌ ఇష్టపడగా, తండ్రి మందలించి, తమ వంశానికి చెందిన అమ్మాయిలెందరో ఉండగా ఇది తగదన్నాడు. శాంసన్‌ పట్టుబట్టడంతో ఒప్పుకున్నాడు. కానీ ఆ బంధం ఎక్కువకాలం నిలవలేదు. పంతాలూ పట్టింపులతో విచ్ఛిన్నం కాగా, శాంసన్‌ తన శత్రువులపై మరింత ద్వేషాన్ని పెంచుకున్నాడు. యుద్ధంలో, ఒంటిచేత్తో వెయ్యిమంది శత్రువులను హతమార్చాడు.

కొంతకాలానికి శాంసన్‌ గాజా నగరానికి వెళ్లి అక్కడ స్త్రీ వ్యామోహంలో చిక్కుకున్నాడు. ఆ సందర్భంలోనే శత్రువులను మరింత తిప్పలుపెట్టి, డెలీలా అనే యువతిని ప్రేమించాడు. సదా ఆమెతోనే గడుపుతూ, తన బాధ్యతలను మర్చిపోయాడు. అదే అదననుకున్న శత్రువులు ఆమెతో మంతనాలు జరిపి, ప్రలోభపెట్టి, శాంసన్‌ శక్తి రహస్యం కనుక్కోమన్నారు. ఆమె మాయమాటలు చెబుతూ, ఆ విషయం అడిగింది. మొదట అతడు అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. కానీ డెలీలా మళ్లీ మళ్లీ అడిగింది. ఓ బలహీన సమయంలో తన తలపై ఇంతవరకు కత్తి ప్రయోగించలేదని, తలవెంట్రుకలను గనుక తీసేస్తే తన బలం పోతుందన్న జన్మరహస్యాన్ని చెప్పేసాడు. డెలీలా వెంటనే శత్రువులకు కబురు చేసింది. వారు వచ్చి ఆమె ఒడిలో ఆదమరచి నిద్రపోతున్న శాంసన్‌ తల వెంట్రుకలను కత్తిరించేశారు. దాంతో శాంసన్‌ బలహీనుడైపోయాడు. శత్రువులు అతని కళ్లను పెరికేసి, బంధించారు. ఇలా స్త్రీవ్యామోహంలో పడి, శాపగ్రస్తుడిగా మారిన శాంసన్‌ శత్రువుల చేతిలో మరణించాడు.

- కొలికపూడి రూఫస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని