అది కూడా ఆత్మహత్యే!

యుద్ధరంగంలో కర్ణుడి ధాటికి తట్టుకోలేక ధర్మరాజు పరాభవంతో శిబిరానికి వచ్చేశాడు. వైద్యుల చేత శరీరానికి గుచ్చుకున్న బాణాలు తీయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. భీముడు అర్జునుడితో ‘అన్నగారు కర్ణుడి బాణాలకు నొచ్చి తిరిగివెళ్లాడు. ఎలా ఉన్నాడో చూసి, ధైర్యం చెప్పిరా!’ అన్నాడు

Updated : 30 Jun 2022 03:34 IST

యుద్ధరంగంలో కర్ణుడి ధాటికి తట్టుకోలేక ధర్మరాజు పరాభవంతో శిబిరానికి వచ్చేశాడు. వైద్యుల చేత శరీరానికి గుచ్చుకున్న బాణాలు తీయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. భీముడు అర్జునుడితో ‘అన్నగారు కర్ణుడి బాణాలకు నొచ్చి తిరిగివెళ్లాడు. ఎలా ఉన్నాడో చూసి, ధైర్యం చెప్పిరా!’ అన్నాడు. సరేనని ధర్మరాజుకు ఏర్పాటైన శిబిరం వైపు రథం మళ్లించమన్నాడు అర్జునుడు. కృష్ణార్జునులను చూసి కర్ణవధ జరిగిందనుకుని ధర్మరాజు ఆనందంగా లేచి, వారిని అభినందించాడు. కానీ విషయం తెలిశాక నిరాశ కలిగింది. అర్జునుడి మీద అంతులేని కోపమూ వచ్చింది.
‘కర్ణుణ్ణి చంపుతానని ప్రగల్భాలు పలికి పారిపోయి వచ్చావా? నీకు గాండీవం ఎందుకు? అది కూడా కృష్ణుడికిచ్చి నువ్వు సారథ్యం చెయ్యి. ఆయనే శత్రుసంహారం చేస్తాడు’ అన్నాడు ఆవేశంగా.
ఆ మాటలు విని అర్జునుడు బుసలు కొడుతూ ‘నీ గాండీవాన్ని మరొకరికి ఇచ్చేయమన్న వాణ్ణి చంపుతాను- అని నియమం పెట్టు కున్నాను. ఈయన్ని వధించేసి నా వ్రతం నిలబెట్టుకుంటాను’ అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శాంతింపజేశాడు. అర్జునుడు తప్పు తెలుసుకుని ‘బావా! నువ్వు మాకు తండ్రివంటి వాడివి. నా ప్రతిజ్ఞ అసత్యం కాకుండా ఉండే ఉపాయం చెప్పు’ అన్నాడు.
‘పూజింపదగినవాణ్ణి ఏకవచనంతో సంబోధిస్తే అది అతణ్ణి చంపినట్లే’ అన్నాడు శ్రీకృష్ణుడు. దాంతో అర్జునుడు ‘నన్ను నిందించటానికైనా ప్రశంసించటానికైనా యుద్ధంచేసే భీముడికి అధికారం ఉందే కానీ, పారిపోయి వచ్చిన నీకేముంది?’ అంటూ అనేక విధాల ధర్మజుణ్ణి నిందించాడు. వెంటనే పశ్చాత్తాపంతో ‘అన్నగారిని తిట్టి ఇంత ఘోరమైన పాపం చేసినందుకు నన్ను నేనే చంపుకుంటాను’ అన్నాడు.
శ్రీకృష్ణుడు మళ్లీ అడ్డుపడి ‘నిన్ను నువ్వు స్తుతించుకో! అది ఆత్మహత్యతో సమానం’ అన్నాడు. సరేనని అర్జునుడు తను చేసిన ఘనకార్యాలన్నీ ఏకరవు పెట్టాడు. తర్వాత ధర్మరాజు పాదాలకు నమస్కరించి ‘నేనన్న మాటలకు మన్నించు. కర్ణుణ్ణి వధించిన తర్వాతే తిరిగొస్తాను’ అన్నాడు. ధర్మరాజు తమ్ముణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకుని ఆశీర్వదించి పంపాడు.                          

- గోనుగుంట మురళీకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని