అధర్మ సత్రం

ఒక సాధువు ప్రయాణిస్తుండగా దారిలో చీకటి పడింది. వర్షమూ మొదలైంది. దగ్గర్లో భవంతి కనిపించగా తలుపు తట్టాడు. యజమాని ఏమిటన్నట్టు విసుగ్గా చూశాడు.

Published : 02 Feb 2023 00:30 IST

క సాధువు ప్రయాణిస్తుండగా దారిలో చీకటి పడింది. వర్షమూ మొదలైంది. దగ్గర్లో భవంతి కనిపించగా తలుపు తట్టాడు. యజమాని ఏమిటన్నట్టు విసుగ్గా చూశాడు. ‘నేనో బాటసారిని. చీకటి, వర్షం వల్ల ముందుకెళ్లలేను. ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా?’ అనడిగాడు దానికతడు ‘వచ్చేపోయే వాళ్లు తలదాచుకోవడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు. కుదరదు’ అన్నాడు విసురుగా. అది విన్న సాధువు ‘ఈ భవనాన్ని మీరే కట్టించారా?’ అనడిగాడు. ‘కాదు, మానాన్న’ జవాబిచ్చాడు. ‘అయితే ఈ ఇంటికి యజమాని ఆయనే నన్నమాట’ అన్నాడు సాధువు. ‘ఆయన బతికుంటే సంగతది. ఇప్పుడాయన లేరు కనుక నేనే యజమానిని’ అన్నాడు దర్పంగా.
‘అయితే ఇక ఎప్పటికీ తమరే యజమాని అన్నమాట’ అన్న సాధువు మాటలకు ‘అదెలా? నేను ఎన్నాళ్లుంటానని?! నా తర్వాత నా పిల్లలు, తర్వాత వాళ్ల పిల్లలు యజమానులౌతారు’ అన్నాడు. అలా అంటున్నపుడు అతడి గొంతు వణికింది. సాధువు నవ్వి ‘అంటే ఈ ఇంటికి శాశ్వత యజమాని అంటూ ఎవరూ లేరు. అందరూ కొంతకాలం ఉండి వెళ్లిపోయేవారే. దానర్థం సత్రమనే కదా! కాకపోతే అందులో ధర్మమే లేదు. తమరన్నట్లు ధర్మసత్రం కాని మాట నిజమే! ఇలా ధర్మం లేని దగ్గర ఉండటం కంటే భగవన్నామస్మరణ చేస్తూ చీకటిలో వెళ్లడమే శ్రేయస్కరం’ అనేసి వెళ్లిపోయాడు. ప్రతిచోటా, ప్రతి విషయంలో ధర్మం అవసరం. ధర్మమే లేకపోతే ఎంత గొప్పదైనా విలువ లేనిదే- అంటూ ఒక స్వామీజీ చెప్పిన కథ ఇది.

శారదాదిత్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని