అమృతం లేకుండానే అమరుడు

మంచి పనులకు శక్తితో పాటు మహాత్ముల దీవెనలు తోడ్పడతాయని సుపర్ణుడనే గరుత్మంతుడి కథ తెలియజేస్తుంది. అతడు అమృతాన్ని సాధించి తల్లికి దాస్య విముక్తి కల్పించాడు.

Published : 04 May 2023 00:11 IST

మంచి పనులకు శక్తితో పాటు మహాత్ముల దీవెనలు తోడ్పడతాయని సుపర్ణుడనే గరుత్మంతుడి కథ తెలియజేస్తుంది. అతడు అమృతాన్ని సాధించి తల్లికి దాస్య విముక్తి కల్పించాడు. ఈ క్రమంలో ఒక బ్రాహ్మణుడికి, అతడి ఇష్టసఖికి ప్రాణదానం చేసి దీవెనలు పొందాడు. అలాగే తండ్రి కశ్యపుడి దీవెనతో శాపగ్రస్తులై తాబేలు, ఏనుగు రూపంలో ఉన్న బ్రాహ్మణ సోదరులను భుజించి వారికి శాప విమోచనం కలిగించాడు. అలా వారి దీవెనలనూ పొందాడు. శాపగ్రస్తులైన విప్రులను సంహరించి తినడం అనేది బ్రహ్మహత్య కిందికి రాదు కనుక గరుత్మంతుడికి శాపం కలగలేదు, దీవెనలు లభించాయి. ఇన్ని దీవెనల శక్తితో గరుడుడు అమృత భాండం సాధించినా, అందులోంచి ఒక్క చుక్కను కూడా తన అమరత్వం కోసం ముట్టుకోలేదు. అతడి చిత్తశుద్ధికి సంతోషించిన విష్ణుమూర్తి- అమృతపానం చేయకుండానే అమరుడవు అవుతావంటూ వరమిచ్చాడు. తన స్వార్థం చూసుకోకుండా పరోపకారమే పరమావధి అనుకున్న గరుడుడు అందరి దీవెనలతో అద్భుతశక్తి పొందాడు. అన్యులకు సాధ్యంకాని అమృతభాండాన్ని సాధించాడు. పర పీడనం ఎంత పాపమో పరోపకారం అంత పుణ్యప్రదమని గరుడుడి ద్వారా చెప్పించాడు వ్యాసమహర్షి. 

 పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని