ఎన్నటికీ తీరనిది కన్నతల్లి రుణం!

తన వెచ్చని కౌగిలిలో ప్రేమ, ఆప్యాయత, ధైర్యసాహసాలు రంగరించి బిడ్డకు పాలుపడుతుంది తల్లి. అమ్మతనంలోని మధురానుభూతిని ఆస్వాదిస్తుంది.

Published : 16 May 2024 00:45 IST

తన వెచ్చని కౌగిలిలో ప్రేమ, ఆప్యాయత, ధైర్యసాహసాలు రంగరించి బిడ్డకు పాలుపడుతుంది తల్లి. అమ్మతనంలోని మధురానుభూతిని ఆస్వాదిస్తుంది. లోకంలో అమ్మ ప్రేమకు సాటిలేదు. తల్లి పదిమంది బిడ్డలను ఆదరిస్తుంది కానీ.. ఆ పదిమందీ కలిసి.. ఒక్క తల్లిని పోషించడం భారంగా భావిస్తూ ఒంటరితనాన్ని బహుమానంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ రుణం తీర్చుకుంటున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనల్ని ప్రయోజకుల్ని చేసేందుకు నిరంతరం ఎంత శ్రమిస్తుందో, తపిస్తుందో గుర్తుచేసుకోవాలి. మాతృసేవతోనే స్వర్గసౌఖ్యాలు ప్రాప్తిస్తాయన్నాడు అల్లాహ్‌. అమ్మను విసుక్కోరాదని ఖురాన్‌ హెచ్చరిస్తోంది. ‘ప్రతి వ్యక్తీ తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలి. తల్లి గర్భంలో ఎలా మోసింది! ఎలా జన్మనిచ్చింది! పాలు మాన్పించేందుకు 30 మాసాలు పడుతుంది.. అదంతా ఎంతో శ్రమతో కూడింది’ అంటోంది (46:15) ఖురాన్‌.

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం) పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఒక మహిళ అక్కడికి వచ్చింది. ప్రవక్త (స) వెంటనే లేచి నిలబడి, తన భుజం మీది దుప్పటిని కింద పరిచి.. ఆమెను కూర్చోమన్నారు. ఎంతో గౌరవభావంతో మాట్లాడారు. ఆమె ప్రవక్తకు పాలుపట్టిన తల్లి. ప్రవక్త (స) మాతృమూర్తి బాల్యంలోనే కన్నుమూశారు. ఆయనను హలీమా అనే మహిళ పాలుపట్టి పెద్దచేశారు. ఆమెనెంతో గౌరవించడం ఆదర్శనీయం. ఒకసారి ఓ అనుచరుడు- ‘వృద్ధాప్య భారంతో మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్‌ యాత్ర చేశాను. ఆమె రుణాన్ని తీర్చుకున్నట్లేనా?’ అనడిగాడు. దానికి ప్రవక్త ‘నిన్ను ప్రసవిస్తున్నప్పుడు బాధ భరించలేక మీ అమ్మ పెట్టిన ఒక్క కేక రుణం కూడా తీరలేదు’ అంటూ బదులిచ్చారు.

 ‘ప్రభూ! నన్ను కన్నవారిపై దయ చూపించు- బాల్యంలో వాళ్లు నన్ను కరుణతో, వాత్సల్యంతో పోషించినట్లు’ అంటూ ప్రార్థించమంటోంది ఖురాన్‌. ఎంత పెద్ద చదువులు చదివినా తల్లిదండ్రుల దీవెన లేకపోతే అవన్నీ నిష్ఫలమే అవుతాయని తెలుసుకోవాలి.      

 తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని