ఈ బుద్ధుడు ఎవరో తెలుసా?

బుద్ధుడు అనగానే శుద్ధోదనుడి కుమారుడైన సిద్ధార్థుడే మదిలో మెదులుతాడు. అయితే పురాణాల్లో దశావతారాల్లో ఒకటని చెప్పే బుద్ధుడి కథ ఉంది. శ్రీమహావిష్ణువు ఈ అవతారాన్ని ఎందుకు ధరించాడనే విషయానికి ఆసక్తికరమైన వివరణ ఉంది.

Updated : 28 Jan 2021 00:15 IST

బుద్ధుడు అనగానే శుద్ధోదనుడి కుమారుడైన సిద్ధార్థుడే మదిలో మెదులుతాడు. అయితే పురాణాల్లో దశావతారాల్లో ఒకటని చెప్పే బుద్ధుడి కథ ఉంది. శ్రీమహావిష్ణువు ఈ అవతారాన్ని ఎందుకు ధరించాడనే విషయానికి ఆసక్తికరమైన వివరణ ఉంది.
కుమారస్వామి చేతిలో తారకాసురుడు అంతమయ్యాక అతని కుమారులైన విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు దేవతలపై ప్రతీకారం పెంచుకున్నారు. ఘోర తపస్సు చేసి బ్రహ్మ వరం పొందారు. ఎవరూ ప్రవేశించలేని, దుర్బేధ్యమైన మూడు పట్టణాలు సొంతం చేసుకుని త్రిపురాసురులయ్యారు. బంగారు, వెండి, ఇనుము లోహాలతో నిర్మించిన ఆ పట్టణాల్లో నివసిస్తూ, కోరిన చోటికి సంచరిస్తూ లోకాలన్నింటినీ కకలావికలం చేశారు. దేవతలను చిత్రహింసలు పెట్టారు. నిరంతర యజ్ఞయాగాదులకు నిలయమైన ఆ పట్టణాల్లో ఉండగా త్రిపురాసులను సంహరించడం అసాధ్యమని భావించిన దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అప్పుడు శ్రీమహావిష్ణువు యతీశ్వరుడి అవతారంలో త్రిపురాసురుల దగ్గరకు వెళ్లాడు. . ఆ రాక్షస సోదరులు ధర్మబ్రష్టులయ్యేలా బోధలు చేశాడు. వారి దృష్టిని ఏమార్చి, పట్టణాల నుంచి బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత శివుడు త్రిపురాసురులను సంహరించాడు.
లోకాలకు అపకారం చేసే రాక్షస సంహారానికి శ్రీమన్నారాయణుడు ధర్మబౌద్ధగా వచ్చాడు కాబట్టి బుద్ధుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడంటారు. ఇదే విషయాన్ని ‘చపల చిత్తులూ, దైవం, ధర్మాలపై విశ్వాసం లేకుండా అనుచిత మార్గంలో ఉండేవాళ్లు, లోకుల ప్రాణాలు తీసేవాళ్లను దానవులంటారు. వీళ్ల కారణంగా లోకమంతా ఆధర్మమయంగా ఉంటుంది. ఆ దురాచారాలు అన్నింటినీ తుడిచిపెట్టి, బుద్ధావతారంలో విష్ణువు ఆ రాక్షుసులను తుదముట్టిస్తాడు’ అని శ్రీమద్భాగవతంలో పరీక్షిత్తుకు శుకమహర్షి వివరిస్తాడు.               

 - సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని