రుషులు చూపిన మార్గం

ప్రస్థానం అంటే ప్రయాణం. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడం. అంటే దానికో గమ్యం ఉంటుంది. జీవితమూ ప్రస్థానమే. దానికో లక్ష్యం ఉంటుంది. అయితే ఈ జీవన ప్రయాణం అందరిదీ ఒకేలా ఉండదు. వైవిధ్యం ఉంటుంది.

Updated : 01 Jun 2023 00:31 IST

ప్రస్థానం అంటే ప్రయాణం. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడం. అంటే దానికో గమ్యం ఉంటుంది. జీవితమూ ప్రస్థానమే. దానికో లక్ష్యం ఉంటుంది. అయితే ఈ జీవన ప్రయాణం అందరిదీ ఒకేలా ఉండదు. వైవిధ్యం ఉంటుంది. దానికి మన నేపథ్యమే కాక ఆలోచనా తీరు, దృక్పథం, వైఖరి ముఖ్య పాత్ర వహిస్తాయి. మృగప్రాయమైన ఆదిమానవ దశ నుంచి తనకున్న అద్భుత ఆలోచనా శక్తితో భాష కనిపెట్టి భావాలను వ్యక్తం చేస్తూ నాగరీకుడయ్యాడు. పరిణామక్రమంలో ఇదో గొప్ప ప్రస్థానం. మనకున్న అనేక శక్తుల్లో పరిశీలన ఒకటి. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా చూస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నాడు. జీవులకు పుట్టుక, పెరుగుదల, మరణం తప్పవన్న కఠిన సత్యాన్ని జీర్ణించుకున్నాడు. జీవితానికో విలువను, గొప్పదనాన్ని చేకూర్చగలనన్న యోచన చేశాడు. పారమార్థిక చింతనతో జీవాత్మ, పరమాత్మల కలయిక గొప్ప మార్గమన్నాడు. ఆత్మశోధనా సాధకుడయ్యాడు. జీవన ప్రస్థానంలో ఇదో మైలురాయి.

బృహదారణ్యక ఉపనిషత్తులోని ‘అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ’ అనే శాంతి మంత్రం మహర్షుల ఆధ్యాత్మిక ఆలోచనా పయనాన్ని చెబుతుంది. ఐహిక జగత్తులో మన ప్రయాణానికి భిన్నమైంది ఉందని, దాన్ని వారు చేరుకునేందుకు తపించారని తెలుస్తుంది. మనమూ అలా చేయాలన్నది వారి ఉద్బోధ. మానవాళికి చూపిన తోవ. ఈ శ్లోక భావాన్ని మనసులో స్థిరం చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక చింతనాగ్నిని రగిల్చి దాన్ని ప్రకాశమానం చేస్తుంది. అవాస్తవికత నుంచి వాస్తవికత వైపు అంటే.. జగత్తు శాశ్వతం, అదే ఆనందం అనే భ్రమను వీడి, శాశ్వతం, సత్య సుందరం అయిన పరమాత్మను చేరుకోవాలనేది భావం. అజ్ఞానం అంటే అంధకారమే. జ్ఞానశూన్యులైతే గుడ్డివారే. ఈ అంధత్వం నుంచి బయటపడటానికి జ్ఞానం అనే వెలుగు కావాలి. జనన మరణ చక్రం నుంచి విడివడి జన్మరాహిత్యం పొందాలన్నది తాత్పర్యం. ఎంత గొప్ప భావన. దీనికన్నా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి నడిపే గొప్ప రహదారి ఏముంటుంది! ఈ చిన్న ప్రార్థనలో అనంత భావనను అద్భుతంగా పొదిగిన రుషులకు జాతి కృతజ్ఞతలు చెప్పగలిగేది వారు చూపిన మార్గంలో పయనించినప్పుడే.

బొడ్డపాటి చంద్రశేఖర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని