Ramadan: రంజాన్‌ పాఠాలు

‘నీలో గనుక మంచి భావాలను నిలుపుకోకపోతే ఇక అంతా చెడు చేరిపోతుంది’ అంటారు ఇమామ్‌ షాఫయీ మహనీయులు.

Published : 30 Mar 2023 00:15 IST

‘నీలో గనుక మంచి భావాలను నిలుపుకోకపోతే ఇక అంతా చెడు చేరిపోతుంది’ అంటారు ఇమామ్‌ షాఫయీ మహనీయులు. చెడును వదిలేసినప్పుడే సద్భావాలు వృద్ధి చెందుతాయి. మనసులో ఎప్పుడూ మంచిచెడుల ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఏది గెలిస్తే ఆ తరహా పనులకు పూనుకుంటారు. అందుకే ఎప్పటికప్పుడు చెడు తలపులను ఓడిస్తూ మంచి భావాలను హృదయంలో నిక్షిప్తం చేసుకోవాలి. రంజాన్‌ ఉపవాసాలు మంచిని గెలిపించేందుకు అవసరమైన శక్తిని ఇచ్చేందుకే. ఉపవాసాలను అరబ్బీలో ‘సౌమ్‌’ అంటారు. అంటే ఆగిపోవడమని అర్థం. అన్ని రకాల చెడు పనుల నుంచి ఆగిపోవడమే ఉపవాసానికి పరమార్థం. సాధారణంగా ఆకలిదప్పులతో రోజంతా గడపడమే ఉపవాసమనుకుంటారు. దేహంలోని అవయవాలతోపాటు మానసిక ఉపవాసం పాటిస్తేనే అసలు ఉద్దేశం నెరవేరుతుంది. అది మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. వేళ కాని వేళ లేచి భుజించడం, తినాల్సిన సమయంలో తినకపోవడం, ఆకలిని ఓర్చుకోవడం- ఇవన్నీ ఓర్పును నేర్పుతాయి. సహనశీలులకు గొప్ప ప్రతిఫలం ఉంటుందని ఖురాన్‌ చెబుతోంది. కోరికలకు కళ్లెం వేసే శక్తి లభిస్తుంది. అల్లాహ్‌తో సాన్నిహిత్యం మరింత పెరిగి, ధార్మిక చింతన అలవడుతుంది. ఆకలిదప్పుల బాధ అనుభవంలోకి వస్తుంది. అన్నపానీయాల విలువ తెలిసొస్తుంది. తినడానికి తిండిలేని అభాగ్యుల దీనస్థితి అర్థమై, వారి పట్ల సానుభూతి కలుగుతుంది. రోజంతా పస్తులున్న తర్వాత ఉపవాసం విరమించేటప్పుడు గొప్ప అనుభూతికి లోనవుతారు. తనకు ఆహారం లభించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేసు కుంటారు. తోటివారిని ఆదుకోవాలన్న స్పృహను ఈ ఉపవాసాలు తట్టిలేపుతాయి. ఇఫ్తార్‌ విందు ఇవ్వడం ఉపవాసంతో సరిసమానమని నమ్ముతారు. రంజాన్‌ నెలలో చేసే ప్రతి మంచి పనికీ 70రెట్ల పుణ్యఫలం లభిస్తుందన్న నమ్మకంతో జకాత్‌ దానాలను చేస్తారు. ఈ దానాలకు పేద బంధువులు అర్హులని ఖురాన్‌ పేర్కొంటుంది. బంధువుల హక్కులకు రక్షణగా నిలవాలన్న స్పృహ రంజాన్‌ నేర్పిస్తుంది. ఇలా రోజా పరిమళాలు మానవత్వాన్ని వికసింపజేస్తాయి. నిష్ఠగా ఉపవాసాలు పాటించేవారిని అల్లాహ్‌ ఎంతగానో ప్రేమిస్తాడు. అలాంటి వారికోసం స్వర్గాన్ని ఏడాదిపాటు ముస్తాబు చేస్తాడు. స్వర్గ ద్వారాల్లో ప్రధాన ద్వారమైన రయ్యాన్‌ ద్వారం గుండా వారికి స్వాగతం పలుకుతారు. కడుపు మాడ్చుకుని ఆత్మకు పుష్టిగా ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడమే రంజాన్‌ ఉపవాసాల ఉద్దేశం. మనలోని దుర్గుణాలను త్యజించి, నైతిక విలువలను పెంపొందించుకోవాలి. ఉత్తమ మార్గానికి దారితీసే కీలక మలుపు ఈ పండుగ ద్వారా సాధ్య మౌతుంది. రంజాన్‌ పరిమళాలను ఈ నెలలో రాసుకుంటే ఆ ప్రభావం తక్కిన 11 నెలలూ గుబాళిస్తుంది. ప్రేమ, శాంతి, సామరస్యాలను పెంపొందించే రంజాన్‌ విలువలను ఈ నెలకే పరిమితం చేయకుండా ఏడాదంతా అలవరచుకుంటే జీవతం ప్రకాశవంతమౌతుంది.

ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు