Good Friday: నమ్మినవారికి నిత్య జీవం

ప్రపంచ చరిత్రలో అదొక చీకటి రోజు. సమయం మధ్యాహ్నం మూడు గంటలు. ఆ దృశ్యం చూడలేక భూమీ, ఆకాశం దద్దరిల్లాయి.

Updated : 05 Mar 2024 14:42 IST

లోక కల్యాణం కోసం సిలువలో మరణించాడు ఏసు ప్రభువు. అందుకే ఆ రోజును పవిత్ర దినంగా భావించి గుడ్‌ ఫ్రైడే అన్నారు. మూడోరోజున సమాధిని ఛేదించుకుని మృత్యుంజయుడై లేచి వచ్చాడు. అలా ప్రభువు తిరిగొచ్చిన రోజు ఈస్టర్‌ సండే.

ప్రపంచ చరిత్రలో అదొక చీకటి రోజు. సమయం మధ్యాహ్నం మూడు గంటలు. ఆ దృశ్యం చూడలేక భూమీ, ఆకాశం దద్దరిల్లాయి. కొండలు బద్దలయ్యాయి. మందిరంలో తెర రెండుగా చిరిగింది. దేవాధిదేవుడు తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తును భూలోకానికి నరావతారిగా పంపాడు. అయితే అవినీతిపరులైన మతాధికారులు, దుష్ట ప్రజలు ఏసు చెప్పిన పవిత్ర నీతిబోధలను సహించలేక ఆయనకు సిలువ వేసిన బాధాకరమైన రోజది.

యోషయా అనే భక్తుడు ఈ దుస్సంఘటన గురించి.. ‘మన దుష్ట క్రియలే క్రీస్తును గాయపరిచాయి. విచక్షణ లేకుండా విధించిన శిక్ష ఏసు ప్రభువుకు పడింది. ప్రభువుకు తగిలిన దెబ్బలతో మనకు స్వస్థత కలుగుతోంది’ (యెషయ 53:5) అంటూ ప్రవచించాడు. పవిత్ర రక్తం చిందిస్తేనే తప్ప మరే మార్గంలోనూ పాపవిముక్తి కలగదని మహానుభావులెందరో హితవు పలికారు.


విముక్తే ధ్యేయం

ఆకాశం, భూమి, సముద్రాల్లో ఉన్న సమస్తాన్నీ సృష్టించిన దేవుడు పాపాలతో నశించే మనల్ని కాపాడేందుకు ఏసుక్రీస్తును అవతరింప చేశాడు. ఏసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. పాప పంకిలం నుంచి మనిషి విముక్తి పొంది, పవిత్ర జీవితం గడిపి, స్వర్గానికి బాట వేసేందుకు నీతినియమాలతో కూడిన ప్రణాళికను రూపొందించాడు ఏసు. సాతాను ఏర్పరచిన ధనం, కీర్తి, సౌఖ్యం, అశ్లీలత, వినోదాలు- అనే పంచరంగుల ఆనందాల వలలో చిక్కుకున్నాడు మనిషి. దాన్నుంచి విముక్తి కలిగించడమే ఏసుక్రీస్తు ధ్యేయం.
ఆశతో ఎగబాకుతూ ఆయా రంగాల్లో ఎంత ఉన్నత స్థితి సాధించినా, హృదయానికి తృప్తి, మానసిక ఆనందం లభించడం లేదు. ఏసు తాను దైవకుమారుణ్ణి అని చెప్పినా యూదులు అంగీకరించలేదు. అక్రమ సంపాదనాపరులైన మతాధిపతులు క్రీస్తు సద్బోధలతో తమ అన్యాయార్జితం ఎక్కడ దూరమౌతుందోనని భయాందోళనలకు గురయ్యారు. ఎలాగైనా క్రీస్తును చంపేయాలని కుట్ర పన్నారు. అందుకే న్యాయాధికారి పిలాతుకు తప్పుడు సాక్ష్యం సమర్పించారు. క్రీస్తును అంతం చేయాలని ఇజ్రాయెల్‌ రాజు హేరోదుపై కూడా ఒత్తిడి తెచ్చారు. చేయని నేరాన్ని పరిశుద్ధుడైన ఏసుపై ఆపాదించి శిక్షకు పరాకాష్ట అయిన సిలువ వేశారు. అదే గుడ్‌ ఫ్రైడే.. శుభ శుక్రవారం.


అదే ఈస్టర్‌

సిలువ మరణం పొందిన ఏసు ప్రభువు తాను చెప్పిన ప్రకారం మూడోరోజు.. ఆదివారం నాడు సమాధిలోంచి తిరిగొచ్చాడు. అదే ఈస్టర్‌.. క్రైస్తవులకు గొప్ప పండుగ. క్రీస్తు మరణ పునరుత్థానంతో మరణం మరణించింది. చిత్తశుద్ధితో ఆ ప్రభువును నమ్మినవారికి నిత్యజీవం ప్రాప్తిస్తుంది. అందులో సందేహం లేదు.

బైబిల్‌ ప్రవచనాల్లో (లేఖనాలు) ఏసు రెండు రోజులు సమాధిలో ఉండి మూడోరోజు (బైబిల్‌ 1 కొరింధి 15-3:20) దర్శనమిచ్చాడు. అలా తిరిగి రానట్లయితే క్రైస్తవమే లేదు. విశ్వాసానికి మూలస్తంభం అదే. యోనా అనే భక్తుడు దేవుడికి అవిధేయుడై దూరంగా పారిపోయినప్పుడు దైవాజ్ఞ ప్రకారం ఓ తిమింగలం అతణ్ణి మింగేసింది. రెండు రోజులపాటు దాని కడుపులో ఉండి, మూడోరోజు బయటపడటం మరో ఉదంతం. అందుకే ఈస్టర్‌ వేడుక దినం. ఏసు జ్ఞాపకార్థమే క్రైస్తవులు ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థిస్తారు.
ఓ భక్తుడు ఏసును గురించి చెబుతూ ‘రెండు వేల సంవత్సరాల క్రితం అరుదైన రీతిలో ఒక వ్యక్తి జన్మించాడు. అతడు పేదరికంలో పుట్టి, పేదరికంలోనే పెరిగాడు. ఎక్కువ దూరం ప్రయాణించలేదు. ఒకసారి దేశ సరిహద్దులు దాటి వెళ్లి, కొద్దికాలం అక్కడ జీవించాడు. అతనికి పేరుప్రఖ్యాతులు, ఆస్తి, అంతస్థులు లేవు. కానీ ఎలాంటి ఔషధాలూ వాడకుండానే ఆ మహానుభావుడు రోగులకు స్వస్థత చేకూర్చాడు. అందుకు ఎవరి దగ్గరా ఎలాంటి ప్రతిఫలమూ ఆశించలేదు. ఆయన ఒక్క పుస్తకమూ రాయలేదు. కానీ దేశంలో ఉన్న గ్రంథాలయాలన్నీ కలిపినా.. ఆయన గురించి రాసిన పుస్తకాలను నిక్షిప్తం చేయడానికి సరిపోవు. ఆయన ఒక్క పాటా రాయలేదు. కానీ కవులందరికీ ఆయనే కేంద్రబిందువయ్యాడు. ఒక్క కళాశాలా ఆయన స్థాపించలేదు. కానీ ప్రపంచంలోని విద్యార్థులందరినీ కలిపినా ఆయనకున్నంత మంది శిష్యులు లేరు. ఎన్నడూ సైన్యాన్ని తయారుచేయలేదు. తుపాకీలు పేల్చి భయపెట్టలేదు. కానీ సర్వమానవాళీ ఆయన ఆజ్ఞలను అమలుచేస్తారు. అతడు మనోవిజ్ఞానం అభ్యసించలేదు. కానీ పగిలి ముక్కలైన హృదయాలను బాగుచేశాడు. అందుకే ఆయన ఆరాధ్యుడయ్యాడు. ప్రతి ఆదివారం నాడూ జనం అన్ని పనులూ మానుకుని గుంపులు గుంపులుగా సమూహాలుగా చర్చికి వెళ్లి ఆరాధిస్తారు. ఇక ఈస్టర్‌ సండే నాడు ఆ ప్రార్థనలు మిన్నంటుతాయి. ఏసుక్రీస్తు మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం. దీన్ని పొందడానికి ఎలాంటి ప్రయాసా అవసరం లేదు, కేవలం విశ్వసిస్తే సరిపోతుంది.

మర్రి ఎ.బాబ్జీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని