డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉచిత కోర్సులు

లాక్‌డౌన్‌ పుణ్యమా కావాల్సినంత ఖాళీ సమయం దొరికింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా.. ఒకటా రెండా సోషల్‌ మీడియా వేదికలన్నీ ...

Published : 05 May 2020 00:38 IST

లాక్‌డౌన్‌ పుణ్యమా కావాల్సినంత ఖాళీ సమయం దొరికింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా.. ఒకటా రెండా సోషల్‌ మీడియా వేదికలన్నీ కళకళలాడిపోతున్నాయి. స్నేహితులతో కబుర్లూ, వార్తలే కాదు.. ఏ యాప్‌లో ఏం వస్తువులు, ఎంత డిస్కౌంట్‌తో దొరుకుతున్నాయో ఇక్కడే తెలిసిపోతోంది. తెలుసుకోవడం వరకూ బాగానే ఉంది. దీన్నే ఇంకాస్త భిన్నంగా, మెరుగ్గా ఇస్తే బాగుండేది లాంటి ఆలోచన వచ్చిందా? అయితే కొన్ని స్వల్పకాలిక కోర్సులు చేస్తే.. ఆ నైపుణ్యాలను, అవకాశాలనూ చేజిక్కించుకోవచ్చు!

కొంతదూరం అలా ప్రయాణం చేస్తూ రేడియో ఆన్‌ చేశామా.. వివిధ రకాల ప్రొడక్ట్‌లకు సంబంధించిన సమాచారం, సంప్రదించాల్సిన వివరాల గురించిన ప్రకటనల వివరాలొచ్చేస్తాయ్‌. ఇంట్లో బోర్‌ కొట్టి టీవీ ఆన్‌ చేసినా ఈ తరహా అడ్వర్టైజ్‌మెంట్లు దర్శనమిస్తాయి. ఫోన్‌లో ఏదో ఒక ప్రోగ్రామో, ఆన్‌లైన్‌ పుస్తకమో తెరిచినా మధ్యలో వీటి రాక తప్పట్లేదు. సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ ఇదీ, అదీ అని తేడా లేకుండా వస్తువులు, దుస్తులు, నగలు, వివిధ కోర్సులు, యాప్‌ల వివరాలు.. ఇలా ప్రతిదాని గురించిన సమాచారం తెలుస్తోంది. దీన్నే సంబంధిత సంస్థలు చేసే డిజిటల్‌ మార్కెటింగ్‌ అంటారు.

వినియోగదారుల వద్దకు నేరుగా వెళ్లి వస్తువులను కొనుగోలుకు ప్రేరేపించడమే మార్కెటింగ్‌. వస్తువులు, సేవలను ఆన్‌లైన్‌, టీవీ, మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ బిల్‌బోర్డ్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను ఉపయోగించి ప్రమోట్‌ చేయడం డిజిటల్‌ మార్కెటింగ్‌. డిజిటల్‌ మార్కెటింగ్‌ అంటే ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అనుకుంటారు. కానీ రెండింటికీ తేడా ఉంది. డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ఒక భాగం. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌ చానెల్స్‌ ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌ సాధ్యమవుతుంది. ఇంటర్నెట్‌ వేదికగా జరిగేది ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కిందకి వస్తే.. టీవీ, ఎస్‌ఎంఎస్‌, రేడియో, బిల్‌బోర్డ్‌ మార్కెటింగ్‌ను ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌గా పేర్కొంటారు.

ఇన్ని రకాల మార్కెటింగ్‌లపై ఆసక్తి ఉంటే దాన్ని కెరియర్‌గా మార్చుకోవచ్ఛు అందుకు కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వారి కోసం ఈ లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని ఆన్‌లైన్‌ వేదికలు ఉచితంగా కోర్సులను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులతోపాటు జాబ్‌ ప్రొఫెషనల్స్‌కీ ఇవి ఉపయోగం. కొన్ని గంటల నుంచి రోజుల వ్యవధిలో వీటిని పూర్తిచేయవచ్ఛు●

డిజిటల్‌ బ్రాండింగ్‌ అండ్‌ ఎంగేజ్‌మెంట్‌: ఎడ్‌ఎక్స్‌ దీన్ని అందిస్తోంది. డిజిటల్‌ మార్కెటింగ్‌లో భాగంగా బ్రాండ్లు తమ వినియోగదారులతో మాట్లాడాల్సి ఉంటుంది. వారిని ఒప్పించడం, ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం వంటివీ ఉంటాయి. అది తప్పనిసరి. కోర్సులో భాగంగా డిజిటల్‌ బ్రాండ్‌ను నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లు, సరైన, ఆకర్షించే విధంగా కంటెంట్‌ను ఉంచడం, డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి అంశాలను నేర్చుకుంటారు. కాలవ్యవధి నాలుగు వారాలు. రోజులో 3 నుంచి 4 గంటలు కేటాయించాల్సి ఉంటుంది.

www.edx.org/

స్ట్రాటజీ ఆఫ్‌ కంటెంట్‌ మార్కెటింగ్‌: కోర్స్‌ఎరా ఈ కోర్సును ప్రముఖ కంటెంట్‌ మార్కెటింగ్‌ సంస్థలు కాపీబ్లాగర్‌, యూసీ డెవిస్‌ ఎక్స్‌టెన్షన్‌ భాగస్వామ్యంతో అందిస్తోంది. కంటెంట్‌ మార్కెటర్లకు అవసరమైన కోర్‌ స్ట్రాటజీలు, ప్రాఫిటబిలిటీ అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. ముఖ్యంగా మార్కెటింగ్‌ స్ట్రాటజీల అభివృద్ధి, ఆచరణ, వాటి విశ్లేషణ, ప్రభావం, రాసేటప్పుడు ఉపయోగించాల్సిన స్ట్రాటజీలు, ప్రొఫెషనల్‌ బ్రాండ్‌ను నిర్మించుకోవడం వంటి వాటిపై దృష్టిపెడతారు. కోర్సు కాలవ్యవధి 20 గంటలు.

www.coursera.org/●

ఇంట్రడక్షన్‌ టూ డిజిటల్‌ లర్నింగ్‌: గ్రేట్‌ లర్నింగ్‌ అకాడమీ దీనిని అందిస్తోంది. డిజిటల్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీలు, వివిధ మార్కెటింగ్‌ చానెల్స్‌కు యాడ్స్‌ను రూపొందించడం వంటి అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్ఛు పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌నూ అందిస్తారు. కాలవ్యవధి రెండున్నర గంటలు. www.greatlearning.in/

డిజిటల్‌ మార్కెటింగ్‌ బేసిక్‌ కోర్స్‌: యుడెమి దీనిని అందిస్తోంది. డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రాథమికాంశాలను ఇందులో తెలుసుకుంటారు. ప్రాక్టికల్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌, ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికి సాయపడే పర్సనల్‌ బ్రాండింగ్‌ అంశాలపైనా దృష్టిసారిస్తారు. డిజిటల్‌ మార్కెటింగ్‌పై ప్రాథమిక అవగాహన కావాలనుకునేవారు దీనిని ఎంచుకోవచ్ఛు కాలవ్యవధి ఆరు గంటలు.

www.udemy.com/●

ఇంట్రడక్షన్‌ టూ ఈ-కామర్స్‌ మార్కెటింగ్‌: గ్రూప్‌ కామర్స్‌ హబ్‌స్పాట్‌ వేదికగా ఈ కోర్సును అందిస్తోంది. ఈ-కామర్స్‌ స్ట్రాటజీలను రూపొందించడం, వినియోగదారులను వెబ్‌సైట్‌కు ఆకర్షించేలా, వాళ్లను నిలిపిఉంచేలా, కొనేలా చేసేలా మార్కెటింగ్‌ మెథడాలజీ ప్లానింగ్‌ చేయడం వంటి అంశాలను కోర్సులో భాగంగా నేర్పుతారు. మొత్తంగా ఈ-కామర్స్‌ ప్రాథమిక లక్ష్యాలను దీనిలో భాగంగా నేర్చుకోగలుగుతారు. కోర్సు కాలవ్యవధి 29 నిమిషాలు.

https://academy.hubspot.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని