ఇంటర్లో గణితం లేకుండా బీసీఏ?

ఇంటర్మీడియట్‌లో గణిత శాస్త్రం చదవకుండా.. బీసీఏ చేయడానికి అవకాశం ఉంటుందా?

Updated : 19 Feb 2024 01:14 IST

ఇంటర్మీడియట్‌లో గణిత శాస్త్రం చదవకుండా.. బీసీఏ చేయడానికి అవకాశం ఉంటుందా?

జె.శ్రీనివాస్‌

బీసీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్‌లో కచ్చితంగా మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలన్న నిబంధన ఉండేది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా, బీసీఏ ప్రోగ్రాం లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ, బీసీఏ చదవాలంటే ప్లస్‌ టూలో మ్యాథ్స్‌ చదవాలన్న నిబంధన అమల్లో ఉంది. చాలా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా బీసీఏ చదివే అవకాశం ఉంది. ఇటీవల చాలా ప్రైవేటు యూనివర్సిటీలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ బీసీఏ ప్రోగ్రాంలో కూడా ఇంటర్‌ ఏ సబ్జెక్టుతో చదివినా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌ లాంటి ప్రోగ్రాంలు మాత్రమే ఏఐసీటీఈ పరిధిలో ఉండేవి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీబీఏ, బీసీఏ ప్రోగ్రాంలను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనుంచి ఏఐసీటీఈ వారు నిర్థ్ధరించిన విద్యార్హతలతోనే  బీసీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది.

జాతీయ విద్యావిధానం- 2020 ప్రకారం ఏఐసీటీఈ చాలా విద్యార్హతలను సమీక్షిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. అందులో భాగంగా 29 ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్స్‌లో 10 ప్రోగ్రామ్స్‌కి ఇంటర్‌లో మ్యాథ్స్‌ కోర్సును చదివి ఉండాలన్న నిబంధనను మినహాయించారు. ఈ  మినహాయింపు ఇచ్చినవాటిలో కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్‌ ఏమీ లేవు. మీరు బీసీఏ ప్రోగ్రాంకు అర్హులా? కాదా అనే విషయం తెలియాలంటే ఈ విద్యా సంవత్సరం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేవరకు వేచి ఉండండి. చివరిగా ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌ కోర్సులు చదవాలంటే మ్యాథమెటిక్స్‌ ప్రావీణ్యం చాలా అవసరం. అవకాశం ఉంటే, గణితంలో బ్రిడ్జి కోర్సు చేసి నైపుణ్యాలు పెంచుకోండి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా, బీసీఏ ప్రోగ్రాంలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ, బీసీఏ చదవాలంటే ప్లస్‌ టూలో మ్యాథ్స్‌ చదవాలన్న నిబంధన అమల్లో ఉంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని