టెన్త్‌ మార్కులు తగ్గితే సమస్యేనా?

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 88.85 శాతం మార్కులతో పూర్తిచేశాను. ఇప్పుడు బీటెక్‌ చదువుతున్నాను. కొన్ని సమస్యలతో పదోతరగతి పూర్తిచేయడానికి మూడేళ్లు పట్టింది.

Updated : 26 Feb 2024 00:55 IST

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 88.85 శాతం మార్కులతో పూర్తిచేశాను. ఇప్పుడు బీటెక్‌ చదువుతున్నాను. కొన్ని సమస్యలతో పదోతరగతి పూర్తిచేయడానికి మూడేళ్లు పట్టింది. టెన్త్‌లో నా గ్రేడ్‌ 4.8 మాత్రమే. విదేశాల్లో మాస్టర్స్‌ చేయాలంటే పదోతరగతిలో 60 శాతం మార్కులు ఉండాలని విన్నాను. దీంతో ఉద్యోగాన్వేషణలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా?  

 బి.చరణ్‌

మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమాను 88.85 శాతంతో పూర్తిచేసి బీటెక్‌ చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు బీటెక్‌ని కూడా కనీసం 70 శాతం మార్కులతో పూర్తి చేయండి. ఆ తరువాత విదేశాల్లో ఎంఎస్‌ చేయడానికి అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్‌/ ఐఈఎల్‌ టీఎస్‌ లాంటి పరీక్షల్లో కూడా మంచి స్కోరు పొందండి. అప్పుడు మీ మొత్తం విద్యార్హతల్లో ఒక్క పదో తరగతిలోనే తక్కువ స్కోరు ఉంటుంది కాబట్టి, మీ ఎంఎస్‌ అడ్మిషన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మంచి విదేశీ యూనివర్సిటీ నుంచి మంచి పర్సెంటే జ్‌తో ఎంఎస్‌ పూర్తి చేసి, ఆ కోర్సుకు సంబంధించిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పొందినట్లయితే, మీ ఉద్యోగాన్వేషణలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

గతంలో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ, వర్తమానంలో చదువుతున్న కోర్సును అశ్రద్ధ చేస్తూ, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోకండి. విదేశీ యూనివర్సిటీలు, విదేశీ ఉద్యోగ సంస్థలు ఒక అభ్యర్థికి విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించేప్పుడు మార్కుల కంటే ఎక్కువగా వ్యక్తిత్వం, ప్రేరణ, భవిష్యత్‌ ప్రణాళికలు, పోటీ పరీక్షలో వచ్చిన స్కోర్లు, రిఫరెన్స్‌ లెటర్స్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌.. ఇవన్నీ మూల్యాంకనం చేసి అడ్మిషన్‌/ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పదో తరగతిలో మీకు తక్కువ మార్కులు వచ్చాయన్నది పక్కన పెట్టి, ఇప్పుడు చదువుతున్న కోర్సుపై శ్రద్ధ పెట్టండి.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని