Exams: పరీక్షల సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

పరీక్షల సమయంలో పిల్లలు చదువులో పడి ఏదిపడితే అది తింటే అనారోగ్యానికి గురవుతుంటారు. అందువల్ల పిల్లలు తీసుకొనే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 11 Mar 2024 09:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాదంతా చదవడం ఒకెత్తయితే.. పరీక్షల సమయంలో విద్యార్థులు చదవడం ఒకెత్తు. పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే సమయంలో పుస్తకాలతో కుస్తీ పడుతూ విద్యార్థులు తిండిపై అంతగా ఆసక్తి చూపించరు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అంతగా ఆకలేస్తే ఏదోఒకటి తినేయడంతో అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకొనే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ కీలక సమయంలో ఆహారం విషయంలో అస్సలు అజాగ్రత్త పనికి రాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఒత్తిడి తగ్గించే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.. ఆ ఆహారమేంటో చూద్దాం.. 

  • చదవడం కెలరీలు ఖర్చయ్యే పనేం కాదు. కానీ, అలసటతో కూడుకున్నది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చూసుకుంటుండాలి. పరీక్షల్లోపడి రోజులపాటు కూర్చొనే ఉంటే బరువులో తేడాలొస్తాయి. అందువల్ల మితంగా, అన్ని పోషకాలూ అందేలా ఆహారాన్ని తీసుకోవాలి.
  • మెదడు, న్యూరో ట్రాన్స్‌మిటర్లకు ఈ సమయంలో మేలైన మాంసకృతులు కావాలి. పప్పుధాన్యాలు, సోయా గింజలు, పెరుగు, పాలు, నూనె గింజల్లో ఇవి లభిస్తాయి. పెసరట్టు, మినపట్టు, కుడుము, గుప్పెడు ఉడకబెట్టిన వేరుశనగలు, గుగ్గిళ్లు, అలసందలు ఇవ్వొచ్చు. 
  • మాంసాహారులు తక్కువ నూనెతో చేసిన గుడ్డు, ఆమ్లెట్‌, చికెన్‌, చేపలు రోజూ తినొచ్చు. అన్నాన్ని తగ్గించాలి. లేదంటే నిద్ర వచ్చేస్తుంది.
  • తక్కువ మోతాదులో ఆహారం తీసుకునేలా చూడాలి. అన్నాన్ని ఒకపూటకు పరిమితం చేసుకొని.. మిగతా వేళల్లో పొట్టుతో ఉన్న జొన్న, సజ్జ, గోధుమ రొట్టెలు లేదా దంపుడు బియ్యం వంటివి తీసుకుంటే బి కాంప్లెక్స్‌ కొరత ఉండదు. ఆకు, కాయగూరలకు ప్రత్యామ్నాయం లేదు. 
  • సరైన పోషకాలు అందట్లేదనిపిస్తే రోజుకో మల్టీ విటమిన్‌ టాబ్లెట్‌, ఫిష్‌ ఆయిల్‌ క్యాప్సూల్స్‌ 5ఎంజీ వరకు రెండు నెలల పాటు తీసుకోవచ్చు. అవిసెలు, వాల్‌నట్స్‌నీ తినాలి.
  • ఒత్తిడిని తట్టుకొనేందుకు విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండే నట్స్‌, నువ్వులు, అవిసె లడ్డూ, మరమరాలు, జొన్న పేలాలు, వేయించిన పుట్నాలు, బఠానీలు సాయపడతాయి. 
  • హాస్టళ్లలో ఉండే విద్యార్థులైతే కీరా, క్యారెట్‌, టమాటాతోపాటు.. గోంగూర, కరివేపాకు, మునగాకు, పుదీనా పొడులు తింటే మేలు. రోజూ 300 ఎం.ఎల్‌. పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటే గ్లూకోమిక్స్‌, కాల్షియం తగినంత లభిస్తుంది. 
  • తాగునీరు పక్కనే ఉంచుకోవాలి. వేడి వల్ల శరీరం లవణాలు కోల్పోయి నీరసం, తలనొప్పి వస్తాయి. ఎలక్ట్రాల్‌/ నిమ్మకాయ నీటిని రోజులో రెండు సార్లు తాగాలి. చక్కెర వేసిన జ్యూస్‌లు వద్దు. నేరుగా పండ్లు తినాలి.
  • ఎక్కువ నూనెలు ఉండే పులిహోర, బిర్యానీ, పూరీ, వడ వంటివొద్దు. బదులుగా పెరుగన్నం, కూరగాయ కర్రీ, ఆకుకూర పప్పు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సాయంత్రం బ్రెడ్‌, గ్లాసు పాలు, అరటిపండు, జామ్‌/ తేనెతో చపాతీ, చట్నీ, పొడులతో ఇడ్లీ ఇవ్వొచ్చు. 
  • పరీక్షలు ఉన్నన్ని రోజులు కాసిని ఉసిరి క్యాండీలనో, ఉప్పులో వేసిన ముక్కలనో దగ్గర పెట్టుకోండి. పిల్లలకు అప్పుడప్పుడు ఇవ్వండి. ఇవి మెదడుకి ఆక్సిజన్‌ పుష్కలంగా అందేట్టు చేసి పిల్లల్ని చురుగ్గా ఉంచుతాయి. హుషారుగా పరీక్షలు రాసేందుకు సహకరిస్తాయి. పరీక్ష సమయంలో చక్కెర ఉన్న చాక్లెట్‌లు, తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్‌ బిళ్లలు దగ్గర పెట్టుకోవాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని