మెమోజీలతో మెప్పించారు!

కరోనా చాలామందిని కష్టాల్లోకి నెట్టేస్తే.. ఇద్దరు కుర్రాళ్లకి మాత్రం బంపర్‌ ఆఫర్‌ తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్‌లో వాళ్లు సరదాగా చేసిన ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ కొట్టింది. ఇదెంత హిట్‌ అయిందంటే కొద్దిరోజుల్లోనే 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. 17 కోట్ల వ్యూస్‌ని ఒడిసి పట్టేశారు.

Updated : 10 Jul 2021 10:06 IST

కరోనా చాలామందిని కష్టాల్లోకి నెట్టేస్తే.. ఇద్దరు కుర్రాళ్లకి మాత్రం బంపర్‌ ఆఫర్‌ తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్‌లో వాళ్లు సరదాగా చేసిన ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ కొట్టింది. ఇదెంత హిట్‌ అయిందంటే కొద్దిరోజుల్లోనే 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. 17 కోట్ల వ్యూస్‌ని ఒడిసి పట్టేశారు. యూట్యూబ్‌ సంచలనంగా మారిన ఈ యువ ద్వయం కార్తీక్‌ చిర్రా, అందులూరి సాయికిరణ్‌లు.

మాదాపూర్‌ మహేశ్‌.. మిడిక్లాస్‌ మధు.. మేకు జుట్టు మహేశ్‌.. పేర్లలోనే కామెడీ, వెటకారం కనిపిస్తుంది కదూ! కంటెంట్‌ చూస్తే కూడా కడుపుబ్బా నవ్వాల్సిందే. అందుకే మరి క్లిక్‌లు పోటెత్తుతున్నాయి. వ్యూస్‌ వరదలా వచ్చి పడుతున్నాయి. అయితే ఈ స్థాయికి చేరడానికి వాళ్లు సినిమా కష్టాలే దాటొచ్చారు.


కొత్త ఒరవడితో..

ఒంగోలు యువకుడు కార్తీక్‌ బిట్స్‌-పిలానీలో బీటెక్‌ చదివి హైదరాబాద్‌లో ఓ యానిమేషన్‌ కాలేజీ నడుపుతున్నాడు. గతంలో ‘ఈగ’, ‘మగధీర’ సినిమాలకు పని చేశాడు. గ్రాఫిక్స్‌ కాకుండా ఇంకేదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకునే సమయంలో ఐఫోన్‌ ఎక్స్‌లో ‘మెమోజీ’, ‘యానిమోజీ’ ఫీచర్లు పరిచయం చేసింది యాపిల్‌. ఒక బృందమంతా కొన్నిరోజులు శ్రమిస్తేగానీ సాధారణంగా ఒక పదినిమిషాల యానిమేషన్‌ వీడియో తయారవదు. అదే ఐఫోన్‌లోని మెమోజీ ఫీచర్‌తో కొద్దిగంటల్లోనే అద్భుతాలు చేయొచ్చు. ఈ ఆలోచనను కార్తీక్‌ విద్యార్థులతో పంచుకోవడంతో మూడేళ్ల క్రితం ‘ఫిల్మీమోజీ’ ప్రాణం పోసుకుంది. ‘అప్పటికి సాయికిరణ్‌ ఫైనలియర్‌ స్టూడెంట్‌. ఫొటోగ్రఫీ కూడా చేస్తుండే వాడు. ముందు మెమోజీలతో, రకాల గొంతులతో పాడించేవాళ్లం. డైలాగులు చెప్పించేవాళ్లం. మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నిరుత్సాహపడ్డాం. కొద్దిరోజులు ఫిల్మీమోజీ ఆపేశాం కూడా. ఈలోపు లాక్‌డౌన్‌ మొదలైంది. ఆ సమయంలో వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ కూడా లేకపోవడంతో ఇంకోసారి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్నాం. అలా ఛానెల్‌ మళ్లీ మొదలైంది. తర్వాత సాయికిరణ్‌ సలహాతో వాటికి శరీరాన్ని తగిలించి ఇన్‌స్టాలో వీడియోలు అప్‌లోడ్‌ చేసేవాళ్లం. ఇదే ఊపుతో యూట్యూబ్‌లోకి వచ్చేశాం. గతేడాది వినాయక చవితికి చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. ఆపై వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు’ అంటూ తమ ప్రయాణం వివరించాడు కార్తీక్‌.


అనుభవాలే కథాంశాలు

ఛానెల్‌ సరికొత్తగా ఉండటంతో సబ్‌స్రైబర్లు వారంలోనే లక్ష దాటారు. ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేయకముందే రెండుసార్లు హ్యాక్‌ అయింది. యూట్యూబ్‌ బృందం సాయంతో పునరుద్ధరించగలిగారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా దాదాపు .. 200 దాకా వీడియోలు రూపొందించారు. ప్రతీదీ పదిలక్షల వ్యూస్‌కి తగ్గకుండా ఉంది. మధ్యతరగతి కుటుంబంలో కనిపించే కష్టాలు, సంతోషాలు, సరదాలు, ప్రేమ, హాస్యం.. ఇవే కథాంశాలుగా ఎంచుకోవడం మా విజయ రహస్యం అంటారు సాయి కిరణ్‌. దీంతోపాటు సీరియళ్లు, రియాలిటీ షోలకు చేస్తున్న పేరడీలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. కార్తీక్‌ ఈ ఛానెల్‌కు ప్రాణం పోస్తే.. సాయికిరణ్‌ స్క్రిప్ట్‌, డైరెక్షన్‌, వాయిస్‌ ఓవర్‌తో ఆల్‌రౌండర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సొంతూర్లలోనే ఉంటూ ఐఫోన్‌, గ్రీన్‌మ్యాట్‌ సాయంతో వీడియోలు రూపొందిస్తున్నారు. త్వరలో ఫిల్మీమోజీ నుంచి లైవ్‌ యాక్షన్‌ సిరీస్‌ కూడా అందిస్తారట. అన్నట్టు ఈ సక్సెస్‌తో విజయనగరం కుర్రాడు సాయికిరణ్‌ ఓ సినిమాకు స్క్రిప్ట్‌ రైటర్‌గా అవకాశం దక్కించుకున్నాడు.

-బి. శివప్రసాద్‌, ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని