అమ్మ చెప్పింది..!

ఒక అడవిలో నక్క, కోతి స్నేహితులుగా మారాయి. అడవి అంతా తిరుగుతూ అల్లరి చిల్లరి పనులు చేస్తూ తమ ఇష్టానుసారంగా తిరగసాగాయి. కోతి తల్లికి తన కొడుకు నక్కతో స్నేహం చేయడం ఏమాత్రం

Updated : 14 Jun 2021 01:21 IST

ఒక అడవిలో నక్క, కోతి స్నేహితులుగా మారాయి. అడవి అంతా తిరుగుతూ అల్లరి చిల్లరి పనులు చేస్తూ తమ ఇష్టానుసారంగా తిరగసాగాయి. కోతి తల్లికి తన కొడుకు నక్కతో స్నేహం చేయడం ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే నక్క చాలా జిత్తులమారి.
చిన్న జంతువులైన కుందేళ్లు అంటే నక్కకు చాలా చిరాకు. అందుకే కనబడ్డ ప్రతి కుందేలునూ చంపి పారేయడం దానికి అలవాటు. అలాంటి నక్కతో స్నేహం చేయడం మంచిది కాదు. ఎప్పుడో ఒకప్పుడు దాని వల్ల ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి వస్తుందని కోతికి తల్లి ఎంతో నచ్చచెప్పి చూసింది.

దానికి పిల్ల కోతి.. ‘నక్క ఏమంత చెడ్డది కాదు. నేనంటే చాలా ఇష్టం. మా మధ్య వైరం పెట్టి మా స్నేహాన్ని విడదీయాలని చూడొద్దు’ అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఇక ఏమీ చేయలేక తల్లికోతి మౌనంగా ఉండిపోయింది.
రోజురోజుకూ నక్క అకృత్యాలు ఎక్కువవ్వడం వల్ల కుందేళ్లు అన్నీ కలిసి ధైర్యం చేసి అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్లి తమకు న్యాయం చెయ్యమని వేడుకున్నాయి. సింహం కుందేళ్లను చూస్తూ.. ‘మీకు జరిగిన అన్యాయం ఏంటో వివరంగా చెప్పండి’ అంది. ‘మహారాజా..! ఆ దుష్ట నక్క ఆగడాలు రోజురోజుకూ శృతి మించి పోతున్నాయి. మా మీద కోపంతో అవసరానికి మించి మమ్మల్ని వేటాడి చంపుతోంది. ఇలాగే కొనసాగితే ఈ అడవిలో మా జాతి అంతరించి పోయే ప్రమాదం ఉంది’ అని తమ బాధ చెప్పుకున్నాయి.
సింహం నక్క వంక చూసి ‘కుందేళ్లు చెప్పేదంతా నిజమేనా?’ అని అడిగింది. నక్క దొంగ ఏడుపు ఏడుస్తూ.. ‘మహారాజా! నేను చేసింది తప్పు ఎలా అవుతుంది? ఆకలితో ఉన్న నేను నా కడుపు నింపుకోవడం కోసం వేటాడుతున్నాను.. అంతే!’ అంది.
సింహం కోపంగా.. ‘చూడు.. నువ్వు ఆకలి తీర్చుకోవడం కోసం ఒక జంతువును వేటాడటం ప్రకృతి ధర్మమే కానీ, నీ కడుపు నిండిన తర్వాత కూడా నువ్వు అనవసరంగా వాటిమీద పగతో ఇష్టారీతిన చంపడం ధర్మం కాదు’ అని అంది. తన గుట్టు అంతా తెలిసిపోయిందని నక్క గ్రహించింది. ఇక ఏం చెప్పినా సింహం నమ్మే స్థితిలో లేదనుకుంది. ఎలాగైనా తన మిత్రుడైన కోతిని కూడా ఇందులో ఇరికించాలనుకుంది. ‘మృగరాజా.. ఇందులో నా తప్పేం లేదు. నా మిత్రుడు కోతి చెప్పడం వల్లే నేను ఇలా చేశాను. కుందేళ్ల గుండెకాయను తింటే చాలా మంచిదని వాళ్ల తాత ఎప్పుడో చెప్పాడట. అందుకని ఇద్దరం కలిసే ఈ పని చేశాం’ అని చెప్పింది.
అప్పటిదాకా నక్క గురించి ఏమీ తెలియని కోతి.. తన స్నేహితుడు అనవసరంగా ఆపదలో పడ్డాడని తెలిసి ఎంతో బాధపడింది. నక్క తన తప్పును ఒప్పుకొని అందులో తనకూ భాగం ఉందని చెప్పడం చూసి కోతి నివ్వెరపోయింది. భయంతో వణికిపోతూ ‘మహారాజా! నేను ఏమీ తప్పు చేయలేదు. అప్పటికీ మా అమ్మ నా మంచి కోరి చెబుతూనే ఉంది.. ఆ నక్క మంచిది కాదు. దాంతో స్నేహం వద్దని.. కానీ నేనే వినలేదు’ అని ఏడుస్తూ చెప్పింది.
‘సరే.. నువ్వు చెప్పేది ఏమిటి.. ఇద్దరూ కలిసే ఈ పని చేశారా?’ అని నక్కను సింహం మళ్లీ అడిగింది. ‘అవును మహారాజా!’ అని గట్టిగా చెప్పింది నక్క. ‘లేదు మృగరాజా! నేనే పాపం ఎరుగను’ అని కోతి వాదించింది.
ఇద్దరి వాదనలు విన్న తర్వాత సింహం నక్క వంక కోపంగా చూస్తూ ‘ఇక చాల్లే నీ అబద్ధపు మాటలు. నిన్ను నమ్మి నీతో స్నేహం చేసిన కోతిని నువ్వు చేసిన దుర్మార్గపు పనిలో భాగం ఉందని చెప్పి ఇరికించాలని చూస్తున్నావు. కోతి శాకాహారి.. అది మాంసం ముట్టదు’ అంది. నక్క బిక్కచచ్చిపోయింది. ఇక చెప్పడానికి ఏమీ లేక అందరి ముందూ తలదించుకుంది.
సింహం కోపంగా తన పంజాతో నక్కను ఒక దెబ్బ వేసేసరికి అది దూరంగా ఎగిరి పడింది. దాని కాలు విరిగింది. ఇక నువ్వు ఈ అడవిలో మాతోపాటు ఉండే అర్హత కోల్పోయావు. తక్షణం ఇక్కడ నుంచి వెళ్లిపో. మళ్లీ కనిపించావంటే నీకు చావు తప్పదు’ అని గట్టిగా హెచ్చరించింది. నక్క కుయ్యో.. మొర్రో అంటూ కుంటుకుంటూ వెళ్లిపోయింది. పిల్లకోతి ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్లింది. ‘చెడ్డవారితో స్నేహం చెయ్యడం ఎంత ప్రమాదమో నాకు ఇప్పుడు తెలిసింది’ అని క్షమాపణ వేడుకుంది.  

- గెడ్డం సుశీలరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని