వెలలేని వజ్రాల హారం!

అవంతిపుర రాజ్యాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. తన సామంత రాజైన భువనగిరి పాలకుడు చంద్రసేనుడి కుమార్తె వివాహానికి వెళ్లాడు. చంద్రసేనుడు చేసిన గౌరవ మర్యాదలు, తనకు రావాల్సిన కప్పం స్వీకరించి తిరుగు ప్రయాణంలో

Published : 26 Aug 2021 00:37 IST

అవంతిపుర రాజ్యాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. తన సామంత రాజైన భువనగిరి పాలకుడు చంద్రసేనుడి కుమార్తె వివాహానికి వెళ్లాడు. చంద్రసేనుడు చేసిన గౌరవ మర్యాదలు, తనకు రావాల్సిన కప్పం స్వీకరించి తిరుగు ప్రయాణంలో అడవి మార్గాన వస్తున్నాడు. ఎండవేడికి పల్లకీమోసే వాళ్లు అలసిపోవడం గమనించాడు వీరసింహుడు. ‘ఇక్కడ ఆగండి.. పల్లకీ మోసేవాళ్లు అలసిపోయినట్లున్నారు. భోజన ఏర్పాట్లు చేయండి. తర్వాత బయలుదేరదాం’ అన్నాడు వీరసింహుడు.

చెట్టు కింద తన పరివారం ఏర్పాటు చేసిన ఆసనంలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు మహారాజు. అదే బాటలో గుర్రంపై వెళుతున్న వ్యక్తి, వీరసింహుణ్ని చూడగానే గుర్రం దిగి.. వినయంగా ‘ప్రభువులకు నమస్కారం’ అన్నాడు. ‘ఎవరు నువ్వు?’ అన్నాడు వీరసింహుడు.

‘ప్రభూ.. నా పేరు రత్నభానుడు. నేను అమరావతివాసిని. నగల వ్యాపారిని. చంపారాజ్యంలోని వ్యాపారులకు నగలు అమ్మి ఇంటికి వెళుతున్నాను. ఇలా దారిలో తమరి దర్శన భాగ్యం కలిగింది’ అన్నాడు చేతులు కట్టుకుని.

‘ఇప్పుడు మీ వద్ద మేం ధరించగల స్థాయి ఉన్న నగలు ఏమైనా ఉన్నాయా?’ అన్నాడు వీరసేనుడు. ‘చిత్తం.. చంపానగర వ్యాపారులు అన్ని నగలు కొనేశారు. కానీ ఈ వజ్రాల హారం వెల వారికి అందుబాటులో లేక కొనలేకపోయారు. నిజానికి ఇది తమ వంటి మహారాజులు ధరించాల్సిన వెలలేని వజ్రాలహారం’ అంటూ తన చేతిసంచిలోని వజ్రాలహారాన్ని వీరసింహుడికి అందించాడు.

మూడు వరుసల ముత్యాలతో మధ్యమధ్యలో చిన్న వజ్రాలు, మధ్య భాగాన అందమైన నగిషీతో ఉన్న పతకంలో పెద్ద వజ్రం పొదిగి ఉంది. వజ్రాలహారం ఎంతో నచ్చిన వీరసింహుడు ‘వెల ఎంత?’ అన్నాడు. ‘ప్రభువులకు నచ్చింది. అదే నా భాగ్యం. వంద బంగారు నాణేలు ఇప్పించండి’ అన్నాడు రత్నభానుడు.

ఆ పక్కనే ఉన్న మంత్రిని పిలిచిన వీరసింహుడు ‘ఈ నగల వ్యాపారికి వంద బంగారు నాణేలు ఇవ్వండి’ అన్నాడు వజ్రాలహారాన్ని మెడలో వేసుకుంటూ వీరసింహుడు. ఈలోగా మంత్రి ఏదో చెప్పబోతే.. రాజు వినిపించుకోలేదు. కాసేపటికి ధనం తీసుకుని రత్నభానుడు వెళ్లిపోయాడు. వీరసింహుడు రాజధానికి బయలుదేరాడు.

కొన్ని రోజుల తర్వాత తన పరివారంతో వేటకు వెళ్లాడు వీరసింహుడు. జంతువులను తరుముతూ అడవిలోకి తనవారితో కలసి చాలాదూరం వెళ్లాడు మహారాజు. ఒక్కసారిగా వర్షం రావడంతో.. ‘ఎవ్వరూ చెట్లకిందకు వెళ్లకండి. పిడుగులు పడతాయి’ అంటూ తమకు కొద్ది దూరంలో ఉన్న కొండ గుహకు వెళ్లారు అందరూ. అప్పటికే వారంతా పూర్తిగా తడిచిపోయారు. మహారాజు తన తలపాగా తీసి ముఖం తుడుచుకుంటూ, తన వజ్రాలహారాన్ని గమనించాడు. అందులోని పెద్ద వజ్రం కనిపించకపోవడంతో ‘మంత్రివర్యా! నా హారంలో పొదిగిన పెద్ద వజ్రం ఎక్కడో జారిపోయింది’ అన్నాడు.

హారాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షించి, పతకంలోని గూడులో ఉన్న నీటి చుక్కను నాలుకపై వేసుకున్న మంత్రి నవ్వాడు. ‘ఏమిటి ఈ పరిహాసం’ అన్నాడు రాజు కోపంగా.. ‘మన్నించండి ప్రభూ..! అది వజ్రం కాదు. పటికబెల్లం. బాగా సానబెట్టి తెలివిగా హారంలో అమర్చాడు ఆ మోసకారి వజ్రాల వ్యాపారి. మనం ఏదైనా విలువైన వస్తువు కొనేటప్పుడు నమ్మకమైన వ్యాపారి దగ్గర కొనాలి. అనుభవజ్ఞుల పర్యవేక్షణలో తీసుకోవాలి. లేకపోతే ఇలానే మోసపోతాం’ అన్నాడు మంత్రి వినయంగా. వజ్రాలహారంలో మిగిలి ఉన్నవి కూడా వజ్రాలు కావని రాజు తెలుసుకున్నాడు. ‘ఈ హారం ఆ వ్యాపారి చెప్పినట్లు వెలలేని వజ్రాలహారమే..’ అన్నాడు. ఆ మోసకారి వ్యాపారిని ఎలాగైనా పట్టుకుని తన ముందు హాజరు పరచాలని సైన్యాధికారిని ఆదేశించాడు వీరసింహుడు.

- బెల్లంకొండ నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని