ఈ చేపను అస్సలు వదలొద్దు!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా? ఏంటి ఈ చిన్నూ కోసం మీరూ ఎదురు చూస్తున్నారా? నా కోసం కాకపోయినా.. నేను తెచ్చే వింతలు, విశేషాల కోసమైనా ఆశగా, ఆసక్తిగా చూస్తారని నాకు తెలుసోచ్‌. ఈ రోజు మీకు కాస్త విస్మయం కలిగించే విషయాన్ని మోసుకొచ్చాను.. ఇంతకీ అది ఏంటంటే...

Updated : 23 Jul 2021 05:24 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా? ఏంటి ఈ చిన్నూ కోసం మీరూ ఎదురు చూస్తున్నారా? నా కోసం కాకపోయినా.. నేను తెచ్చే వింతలు, విశేషాల కోసమైనా ఆశగా, ఆసక్తిగా చూస్తారని నాకు తెలుసోచ్‌. ఈ రోజు మీకు కాస్త విస్మయం కలిగించే విషయాన్ని మోసుకొచ్చాను.. ఇంతకీ అది ఏంటంటే...
మీ అందరికీ అక్వేరియం అంటే తెలుసు కదా! కొందరి ఇళ్లలో ఉండి ఉంటుంది కూడా! వీటిల్లో ఎక్కువగా గోల్డ్‌ఫిష్‌లను పెంచుతుంటారు. ఆ బుజ్జి చేపలే ఇప్పుడు ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నాయి. 

పే..ద్ద సమస్యే!

తిప్పి కొడితే రెండు అంగుళాలు కూడా ఉండని ఈ గోల్డ్‌ఫిష్‌ ఇప్పుడు అమెరికాను హడలెత్తిస్తోంది. నిజానికి ఇవి అక్వేరియాల్లో పెంచుకోవడానికే అనువైనవి. కానీ కొన్ని చెరువులు, సరస్సుల్లో పెద్ద సంఖ్యలో దొరుకుతున్నాయి. మాములుగా దొరికితే ఏ సమస్యాలేదు. కానీ ఏకంగా ఫుట్‌బాల్‌ అంత పరిమాణంలో కిలోలకు కిలోల బరువు పెరిగి కనిపిస్తున్నాయి. విషయమేంటా..? అని శాస్త్రవేత్తలు ఆరాతీస్తే అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

రౌడీల్లా మారిపోతున్నాయి..

అక్వేరియాల్లో బుద్ధిగా ఉండే ఈ బంగారు చేపలు బాహ్య ప్రపంచంలోని చెరువులు, సరస్సుల్లోకి వెళ్లగానే రౌడీల్లా మారిపోతున్నాయి. మిగతా చేపలు పద్ధతిగా దోమల లార్వాలు, చిన్న చిన్న పురుగులు, నత్తల్ని తిని కడుపు నింపుకుంటాయి. కానీ ఇవేమో ఏకంగా ఇతర చేపల గుడ్లను హాంఫట్‌ చేసేస్తున్నాయి. దీంతో మిగతా చేపల సంతతి తగ్గిపోతోంది. అదే సమయంలో ఈ గోల్డ్‌ఫిష్‌లు తమ సంఖ్యను వేగంగా పెంచుకుంటున్నాయి. నీటిని కూడా విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా చాలా నీటిమొక్కల వేర్లను తినేసి.. వాటికీ నష్టం కలిగిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల్లోనే చాలా రకాల చేపల జాతులు నశించిపోయే ప్రమాదం ఉందంట. ఇది జీవ వైవిధ్యానికి అంత మంచిది కాదని, ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘దయచేసి మా మాట వినండి...’

దీంతో అమెరికాలోని పాలకులు, అధికారులు అప్రమత్తమయ్యారు. దయచేసి ఎవ్వరూ అక్వేరియాల్లో పెరగాల్సిన గోల్డ్‌ఫిష్‌లను జలాశయాలు, సరస్సులు, చెరువుల్లో వదలొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ఎవరైనా చేస్తే నేరంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు కూడా! మొత్తానికి ఇవీ ఫ్రెండ్స్‌.. అమెరికాను హడలెత్తిస్తున్న గోల్డ్‌ఫిష్‌ సంగతులు.

ఇక ఉంటామరి. అదిగో అప్పుడే మా అమ్మ కూడా ‘చిన్నూ.. చిన్నూ..’ అని పిలుస్తోంది. వెళ్లొస్తా.. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని