Cucumber: దోస మేలు

ఎండాకాలం అనగానే కీర దోసకాయలు గుర్తుకొస్తాయి. నీటితో కూడిన ఇవి దాహం తీరటానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.

Published : 18 Apr 2023 00:23 IST

ఎండాకాలం అనగానే కీర దోసకాయలు గుర్తుకొస్తాయి. నీటితో కూడిన ఇవి దాహం తీరటానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. జబ్బుల నివారణకు, బరువు అదుపులో ఉండటానికి, జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఎప్పుడంటే అప్పుడు తినటానికి అనువుగా ఉండటం వల్ల దోసకాయ ప్రయోజనాలను ఎవరైనా, ఎక్కడైనా పొందొచ్చు.

ఎన్నో పోషకాలు

గుమ్మడి, పుచ్చకాయ జాతికి చెందిన దోసకాయల్లో కేలరీలు తక్కువ. పీచు, విటమిన్‌ ఎ, విటమిన్‌ కె, విటమిన్‌ సి, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలెన్నో ఉంటాయి. 100 గ్రాముల దోసకాయలో- 15 కేలరీలు, 0.1 గ్రాముల కొవ్వు, 3.6 గ్రాముల పిండి పదార్థాలు, 0.5 గ్రాముల పీచు, 1.7 గ్రాముల చక్కెర, 0.7 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అత్యవసర పోషకాల విషయానికి వస్తే- 16.4 మైక్రోగ్రాముల విటమిన్‌ కె, 147 మిల్లీగ్రాముల పొటాషియం, 2.8 మిల్లీగ్రాముల విటమిన్‌ సి, 16 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తాయి.

నీటి భర్తీ

దోసకాయలను పచ్చిగా తినొచ్చు. వండుకొనీ తినొచ్చు. ఎలా తిన్నా వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా, దీర్ఘకాల జబ్బుల బారినపడకుండా కాపాడతాయి. వీటిల్లో 96% వరకు నీరే ఉంటుంది. అందువల్ల ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూస్తాయి. అజీర్ణం, మోకాళ్ల నొప్పులు తగ్గటానికి నీరు అత్యవసరం. కిడ్నీలు, మెదడు సరిగా పని చేయటానికీ నీరు ఉపయోగపడుతుంది. శరీరంలో ఉష్ణోగ్రతలనూ నియంత్రిస్తుంది. ఎప్పుడైనా వెంట నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లటానికి వీల్లేని సమయాల్లో సంచీలో రెండు మూడు దోసకాయలను వేసుకుంటే సరి. దాహం వేసినప్పుడు నమలొచ్చు.

ఎముకలకు బలం

ఎముక సాంద్రత తగ్గితే విరిగే ముప్పు పెరుగుతుంది. దీన్ని తగ్గించుకోవటానికి దోసకాయ ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్‌ కె ఎముకలు బలంగా ఉండటానికి, సాంద్రత పెరగటానికి తోడ్పడుతుంది. క్యాల్షియం కూడా లభించటం మరో ప్రయోజనం. శరీరం క్యాల్షియంను గ్రహించుకోవటానికి విటమిన్‌ కె దోహదం చేస్తుంది.

పేగులకు ఆరోగ్యం

దోసకాయలోని నీరు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఆహారం విచ్ఛిన్నం కావటానికి, పోషకాలను శరీరం గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది. ఇక దీనిలోని పీచు పేగుల కదలికలను మెరుగు పరుస్తుంది. మలబద్ధకం దరిజేరకుండా చూస్తుంది. దోసకాయ పచ్చళ్లకు మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే గుణమూ ఉంది. అయితే పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మితంగానే వాడుకోవాలి.

బరువు అదుపు

కేలరీలు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉండటం వల్ల దోసకాయ బరువు అదుపులో ఉండటానికీ తోడ్పడుతుంది. పీచు దండిగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. ఇలా బరువు పెరగకుండా చూస్తూ మధుమేహం ముప్పు తగ్గిస్తుంది. ఇప్పటికే మధుమేహం గలవారికీ మేలు చేస్తుంది. ఎందుకంటే దోసకాయ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేస్తుందన్నమాట. దోసలోని యాంటీఆక్సిడెంట్లు మధుమేహం త్వరగా ముదరకుండా, మధుమేహంతో ముంచుకొచ్చే దుష్ప్రభావాలు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాన్సర్‌ నివారణ

దోసకాయల్లో కుకుర్‌బిటాసిన్‌ బి (సీయూబీ) అనే వృక్ష రసాయనం దండిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండానే కాదు, క్యాన్సర్‌ కణాల నిర్మూలనకూ ఉపయోగపడుతుంది. కాలేయం, రొమ్ము, ఊపిరితిత్తి, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో సీయూబీ పోరాడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి సూచిస్తోంది. దోసకాయను పొట్టుతో తింటే ఇంకా మంచిది. ఎందుకంటే పొట్టు సైతం క్యాన్సర్‌ రాకుండా కాపాడగలదు. దీనిలోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తూ పెద్దపేగు క్యాన్సర్‌ నివారణకు సాయం చేస్తుంది.

గుండె బలంగా

సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది. దోసకాయలో సోడియం తక్కువగా ఉండటం, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రెండు రకాలుగా మేలు చేస్తుంది. దోసలోని సీయూబీ రక్తనాళాల్లో కొవ్వు పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది కూడా. అంతేకాదు.. పీచు కొలెస్ట్రాల్‌ మోతాదులనూ తగ్గిస్తుంది. ఇలా ఏ విధంగా చూసినా దోసకాయ గుండెకు ఎంతో మేలు చేస్తుందనే చెప్పుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని