స్టెంట్‌ జారిపోతుందా?

సమస్య: నా వయసు 55 సంవత్సరాలు. ఇటీవలే గుండె రక్తనాళంలో స్టెంటు అమర్చారు. ఇది అక్కడే ఉంటుందా? అటూఇటూ ఏమైనా కదులుతుందా? కిందికి జారిపోతుందా? అలాగే స్టెంటు అమర్చుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చెప్పండి.

Published : 08 Oct 2019 00:58 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 55 సంవత్సరాలు. ఇటీవలే గుండె రక్తనాళంలో స్టెంటు అమర్చారు. ఇది అక్కడే ఉంటుందా? అటూఇటూ ఏమైనా కదులుతుందా? కిందికి జారిపోతుందా? అలాగే స్టెంటు అమర్చుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చెప్పండి.

 - శ్రీనివాస్‌, హైదరాబాద్‌

 

సలహా: మీలాగే చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. ఒకసారి స్టెంటు అమర్చిన తర్వాత అది అక్కడ్నుంచి కదలటమనేది ఉండదు. రక్తనాళం పరిమాణాన్ని బట్టి అంతే సైజు స్టెంటును ఎంచుకుంటారు. దీన్ని రక్తనాళంలో పూడిక ఉన్నచోట బెలూన్‌తో ఉబ్బించి వెడల్పు చేస్తారు. దీంతో అది రక్తనాళం గోడలకు నొక్కుకుపోయి గట్టిగా పట్టుకొని ఉంటుంది. క్రమంగా దీని మీద రక్తనాళం గోడ కణాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా స్టెంటు అక్కడే స్థిరపడిపోతుంది. జారిపోవటం, కదలటమనేవి ఉండవు. భయపడాల్సిన పనిలేదు. స్టెంటు అమర్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. రక్తాన్ని పలుచగా చేసే ఆస్ప్రిన్‌, క్లోపిడోగ్రెల్‌ వంటి మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఏడాది తర్వాత ఒకటే మందు వాడుకున్నా సరిపోతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులూ వేసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలుంటే మందుల ద్వారా గానీ జీవనశైలి మార్పులతో గానీ కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. మరో ముఖ్య విషయం- స్టెంటు వేసినంత మాత్రాన సమస్య పూర్తిగా తగ్గినట్టు కాదు. పూడిక ఉన్న చోట స్టెంటు వేసి సరిచేసినా కొత్తగా వేరే చోట పూడికలు ఏర్పడకూడదనేమీ లేదు. అందువల్ల జీవనశైలి మార్పులు కీలకం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన వైద్య పరీక్షలు సమయానికి చేయించుకోవాలి. వీటితో పాటు మందులు వేసుకుంటుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. గుండె పనితీరు, పంపింగ్‌ సామర్థ్యం బాగుంటే స్టెంటు అమర్చిన వారం తర్వాత అన్ని పనులు మామూలుగానే చేసుకోవచ్చు. శృంగార జీవితాన్నీ ఆస్వాదించొచ్చు. ఒకవేళ స్టెంటు అమర్చటానికి ముందే గుండె పోటు రావటం వల్ల గుండె బలహీన పడినవారు మాత్రం నాలుగు వారాల వరకూ వేచి ఉండాలి. ఇలాంటివారికి స్టెంటు అమర్చిన నెల తర్వాత గుండె సామర్థ్యం మెరుగుపడొచ్చు. ఇది మామూలు స్థాయికి వస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ అప్పటికీ గుండె ఇంకా బలహీనంగానే ఉన్నట్టయితే కఠినమైన వ్యాయామాలు, బరువైన పనులు చేయకపోవటం మంచిది. రోజువారీ పనులు హాయిగా చేసుకోవచ్చు. ఎలాంటి వ్యాయామాలు చేయాలన్నది డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా 
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,  రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email:  sukhi@eenadu.in

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని