పళ్లు కరకర.. గుర్‌గుర్‌ గురక?

మా అబ్బాయికి 26 సంవత్సరాలు. ఎత్తు ఐదున్నర అడుగులు. బరువు 75 కిలోలు. ఇంకా పెళ్లి కాలేదు. నిద్రపోతున్నంత సేపూ పళ్లు కొరుతుంటాడు.

Published : 17 Mar 2020 00:37 IST

సమస్య-సలహా

సమస్య: మా అబ్బాయికి 26 సంవత్సరాలు. ఎత్తు ఐదున్నర అడుగులు. బరువు 75 కిలోలు. ఇంకా పెళ్లి కాలేదు. నిద్రపోతున్నంత సేపూ పళ్లు కొరుతుంటాడు. కరకరమని చప్పుడు వస్తుంటుంది. గురక కూడా పెడతాడు. పక్కన పడుకునేవాళ్లకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి పరిష్కారం చెప్పగలరు?

- హేమలత ఇ. (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: ముందుగా గుర్తించాల్సింది మీ అబ్బాయి అధిక బరువు, ఊబకాయంతో ఉన్నాడని. ఊబకాయం గలవారికి ఒంట్లోనే కాదు, గొంతు చుట్టూ లోపలా కొవ్వు పేరుకుంటుంది. దీంతో శ్వాస తీసుకునే సమయంలో గాలి లోపలికి వెళ్లే మార్గాలు మూసుకుపోతాయి. ఇది గురకకు దారితీస్తుంది. అంతేకాదు, వెల్లకిలా పడుకున్నప్పుడు నాలుక వెనకకు జారి శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో గురక వస్తుంది. అందుకే పక్కకు తిరిగి పడుకుంటే గురక తగ్గుతుంది. మరొక ఇబ్బందికరమైన కారణం నిద్రపోతున్నప్పుడు శ్వాసకు అడ్డంకి తలెత్తటం. దీన్నే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా అంటారు. దీనికి మూలం రాత్రిపూట గొంతు కండరాల పటుత్వం (టోన్‌) తగ్గి, జారిపోవటం. ఫలితంగా శ్వాస మార్గం మూసుకుపోయి, గురక తలెత్తుతుంది. దీన్ని కొన్ని పరీక్షలతో నిర్ధారించాల్సి ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉంటే ఆపరేషన్‌ చేయటమో పడుకున్నప్పుడు నిరంతరాయంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసే సీ-ప్యాప్‌ పరికరాన్ని అమర్చుకోవటమో చేయాల్సి వస్తుంది. గురకను తగ్గించుకోవటానికి ముందుగా మీ అబ్బాయిని బరువు తగ్గించుకోమని చెప్పండి. మీ అబ్బాయి ఎత్తు, వయసును బట్టి చూస్తే ఉండాల్సిన దాని కన్నా 10 కిలోలు ఎక్కువ బరువు ఉన్నాడు. బరువు తగ్గటానికి ఆహార నియమాలు పాటించటం మంచిది. దీని కన్నా ఉదయం పూట నడక ముఖ్యం. అవసరమైతే జిమ్‌కీ వెళ్లాలి. ఆటలు ఆడే అలవాటుంటే బాగా చెమటలు పట్టేంతవరకూ ఆడుకోవాలని చెప్పండి. బరువు తగ్గితే గురక తగ్గుతుంది. ఇక పళ్లు కొరకటం గురించి. దీన్ని బ్రక్సిజమ్‌ అంటారు. కొందరు బాగా కోపం రావటం వంటి సందర్భాల్లో పళ్లు కరకరమని కొరుకుతుంటారు. ఇది తాత్కాలికం. రోజూ రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కొరుతున్నాడంటే జబ్బు కిందే భావించాలి. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుండొచ్ఛు పళ్ల వరసలు సరిగా లేకపోయినా, కొన్ని పళ్లు ఊడిపోయినా పళ్లు కొరుకుతుండొచ్ఛు పళ్లు కొరకటం తగ్గటానికి ఇప్పుడు స్పింట్లు, మౌత్‌ గార్డ్స్‌ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెట్టుకునే పై పళ్లు, కింది పళ్లు ఒకదాంతో మరోటి తాకవు. రాత్రిపూట ధరిస్తే పళ్లు కొరకడం తగ్గుతుంది. కొందరు ఆందోళన వంటి మానసిక సమస్యలతోనూ రాత్రిపూట పళ్లు కొరకొచ్ఛు ఇలా ఆయా సమస్యలను బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పళ్ల సమస్య అయితే డెంటిస్ట్‌కు, మానసిక సమస్యలైతే సైక్రియాటిస్ట్‌కు చూపించి, తగు చికిత్స చేయించాల్సి ఉంటుంది.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని