ఏంటీ ఎక్కిళ్ల బాధ?

అవటానికి ఎక్కిళ్లు తాత్కాలిక సమస్యే అయినా కొందరిని మాత్రం దీర్ఘకాలం వేధిస్తుంటాయి. నిజానికి ఎక్కిళ్లు ప్రాణాంతక సమస్య కాదు గానీ బాగా ఇబ్బంది పెడుతుంది.

Published : 03 Nov 2020 00:33 IST

సమస్య సలహా

సమస్య: నాకు రెండేళ్ల నుంచి ఎక్కిళ్లు వస్తున్నాయి. పూర్తిగా తగ్గటం లేదు. దీనికి కారణమేంటి? పరిష్కార మార్గం సూచించండి.

- ఎం.వెంకటరామయ్య (ఇ-మెయిల్‌ ద్వారా)

సలహా: అవటానికి ఎక్కిళ్లు తాత్కాలిక సమస్యే అయినా కొందరిని మాత్రం దీర్ఘకాలం వేధిస్తుంటాయి. నిజానికి ఎక్కిళ్లు ప్రాణాంతక సమస్య కాదు గానీ బాగా ఇబ్బంది పెడుతుంది. మీరు రెండేళ్ల నుంచి ఎక్కిళ్లు వస్తున్నాయని రాశారు గానీ ఇతరత్రా విషయాలు వివరించలేదు. తినేప్పుడు, మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? ఆయాసం వస్తోందా? మానసిక సమస్యల వంటి జబ్బులేవైనా ఉన్నాయా? ఎలాంటి మందులు వాడుతున్నారు? వంటి వివరాలు తెలియజేస్తే సమస్య గురించి లోతుగా విశ్లేషించటానికి అవకాశముండేది. కారణాన్ని గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. ఎక్కిళ్లకు కారణం- ఛాతీని, కడుపును వేరు చేసే డయాఫ్రం పొర హఠాత్తుగా సంకోచించటం. దీంతో స్వరపేటిక కొద్దిసేపు మూసుకుపోయి ఒక రకమైన చప్పుడు వస్తుంది. ఇవే ఎక్కిళ్లు. వీటికి మూలం డయాఫ్రం చికాకుకు గురవటం లేదా డయాఫ్రం పొరకు నాడీ సంకేతాలు అందకపోవటం. చాలావరకు ఎక్కిళ్లు కొద్దిసేపటికి వాటంతటవే తగ్గిపోతాయి. రెండు రోజుల్లోపు తగ్గిపోయే ఎక్కిళ్లను తాత్కాలిక సమస్యగానే భావిస్తారు. వేగంగా నీళ్లు గుటక వేయటం, చల్లటి నీరు తాగటం, గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించటం, నిమ్మకాయ ముక్క చప్పరించటం, చక్కెర తినటం, కాసేపు శ్వాస బిగపట్టటం, మోకాళ్లను ఛాతీ దగ్గరకు బిగ్గరగా లాక్కోవటం వంటి చిట్కాలు ఎక్కిళ్లు తగ్గటానికి తోడ్పడతాయి. అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు బాక్లోఫెన్‌, మెటాక్లోప్రమైడ్‌ వంటి మందులూ వాడుకోవచ్ఛు కొందరిలో జీర్ణరసాలు పైకి ఎగదన్నుకొని రావటం మూలంగానూ ఎక్కిళ్లు రావొచ్ఛు ఇలాంటివారికి 15 రోజుల పాటు ఒమిప్రొజాల్‌ వంటి పీపీఐ రకం మందులు ఉపయోగపడతాయి.

రెండు రోజులు దాటిన తర్వాతా.. అంటే దీర్ఘకాలంగా ఎక్కిళ్లు వేధిస్తుంటే అన్నవాహిక పూత, కాలేయంలో, మూత్రంలో ఇన్‌ఫెక్షన్లు, క్రియాటినైన్‌ మోతాదులు పెరగటం, సోడియం తగ్గిపోవటం వంటివేవైనా కారణమవుతున్నాయేమో పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే, గాస్ట్రోస్కోపీ, కడుపు అల్ట్రాసౌండ్‌ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సమస్యను గుర్తించి చికిత్స చేస్తే ఎక్కిళ్లూ తగ్గిపోతాయి. మరికొందరికి సుదీర్ఘంగా, నెలల తరబడి విడవకుండా ఎక్కిళ్లు వస్తుంటాయి. పక్షవాతం, కిడ్నీ, కాలేయ జబ్బుల వంటి సమస్యల మూలంగా ఇలాంటి రకం ఎక్కిళ్లు రావొచ్ఛు వీటికి న్యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, గ్యాస్ట్రోఎంటెరాలజిస్టు వంటి నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. కారణాన్ని గుర్తించి, ఆయా జబ్బులకు చికిత్స చేయించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని