ఈ రెండు లక్షణాలతో జాగ్రత్త!

కొవిడ్‌-19 బారినపడి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నప్పుడు నిరంతరం మనసులో ఆందోళన తొలుస్తూనే ఉంటుంది. జబ్బు తగ్గుతోందా, ముదురుతోందా.. తెలుసుకోవటమెలా? ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? ఇలాంటి సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

Published : 29 Jun 2021 01:20 IST

కొవిడ్‌-19 బారినపడి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నప్పుడు నిరంతరం మనసులో ఆందోళన తొలుస్తూనే ఉంటుంది. జబ్బు తగ్గుతోందా, ముదురుతోందా.. తెలుసుకోవటమెలా? ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? ఇలాంటి సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. మరి ప్రమాదకర పరిస్థితిని గుర్తించటమెలా? ఇందుకు తేలికైన రెండు లక్షణాలు ఎంతగానో ఉపయోగపడగలవని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తోంది. అవి  1. శ్వాస త్వరత్వరగా తీసుకోవటం. 2. ఆక్సిజన్‌ 91 శాతం కన్నా పడిపోవటం. ఇవి రెండూ ప్రాణాపాయ స్థితిని అంచనా వేయటానికి తోడ్పడే సూచికలుగా గుర్తించాలని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ నీల్‌ ఛటర్జీ పేర్కొంటున్నారు. కొవిడ్‌ తొలిదశలో ఆయాసమేమీ ఉండకపోవచ్చు. ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయినా లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. అంతమాత్రాన తక్కువ అంచనా వేయటానికి లేదు. ఆయాసం, ఛాతీలో విడవకుండా నొప్పి లేదా ఏదో నొక్కుతున్నట్టు అనిపించటం వంటి తీవ్ర లక్షణాలేవీ లేకపోయినా శ్వాస వేగం పెరగటం, రక్తంలో ఆక్సిజన్‌ ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదని నీల్‌ ఛటర్జీ చెబుతున్నారు. పరిస్థితి ముదిరి చివరికి ఆసుపత్రికి వచ్చేసరికే చికిత్స ఆరంభించాల్సిన విలువైన సమయం గడిచిపోతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు. ఆక్సిజన్‌ పడిపోయినవారికి బయటి నుంచి ఆక్సిజన్‌ ఇవ్వటం తప్పనిసరి. ఇలా ఆక్సిజన్‌ తీసుకుంటున్నవారిలోనే స్టిరాయిడ్ల ప్రాణరక్షణ ప్రభావాలు బాగా కనిపిస్తాయన్న సంగతిని గుర్తించాలని చెబుతున్నారు. అత్యవసరంగా ఆసుపత్రికి వస్తున్న చాలామందిలో ఆక్సిజన్‌ సగటున 91 శాతంగా ఉంటోందని, వీరిలో ఎంతోమందికి అప్పటికే ప్రాణరక్షణ చికిత్స ఆరంభించాల్సిన తరుణం మించిపోతోందనే విషయాన్ని ఇది పట్టి చూపుతోందంటున్నారు. కాబట్టి ఇంట్లో ఉండి కొవిడ్‌ చికిత్స తీసుకునేవారు.. ముఖ్యంగా వయసు మీద పడ్డవారు, ఊబకాయుల వంటి తీవ్ర ముప్పు గలవారు ఆక్సిమీటరుతో ఆక్సిజన్‌ మోతాదులను పరీక్షించుకోవటం చాలా ముఖ్యం. ఆక్సిజన్‌ శాతం 94 కన్నా తగ్గితే అప్రమత్తం కావాలి. అంతకన్నా తగ్గుతుంటే ఆసుపత్రికి వెళ్లాలి. అలాగే వేగంగా.. నిమిషానికి 23 సార్లు శ్వాస తీసుకుంటున్నా ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నారని గుర్తించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు