అమ్మాయికి నెలసరిగా రావటం లేదేం?

మా పాప వయసు 16 సంవత్సరాలు. తను 14 ఏళ్లకు రజస్వల అయ్యింది. అప్పట్నుంచి నెలసరి సక్రమంగా రావటం లేదు. మందులు వాడితే నెలసరి అవుతుంది.

Published : 29 Jun 2021 01:27 IST

సమస్య: మా పాప వయసు 16 సంవత్సరాలు. తను 14 ఏళ్లకు రజస్వల అయ్యింది. అప్పట్నుంచి నెలసరి సక్రమంగా రావటం లేదు. మందులు వాడితే నెలసరి అవుతుంది. ఆపితే రావటం లేదు. పీసీఓఎస్‌ గానీ హార్మోన్ల సమస్యలు గానీ లేవు. కొన్నిరోజులు ఆగితే ఇది కుదురుకుంటుందా? లేకపోతే చికిత్స తీసుకోవాలా?

- సాజిదా, నరసారావుపేట

సలహా: యుక్తవయసులో నెలసరి కాస్త అటూఇటూగా రావటం మామూలే. వయసు పెరుగుతున్నకొద్దీ ఇది కుదురుకుంటుంది. దీనికి పెద్దగా గాబరా పడాల్సిన పనిలేదు. అయితే కొన్నిసార్లు బరువు మరీ ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నా.. తిండి సరిగా తినకపోయినా నెలసరి సమయానికి రాకపోవచ్చు. కొన్నిసార్లు హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటమూ కారణం కావొచ్చు. ఉదాహరణకు- థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులు పెరిగినా, తగ్గినా నెలసరి అస్తవ్యస్తం కావొచ్చు. కొందరు అమ్మాయిలకు టెస్టోస్టిరాన్‌ వంటి పురుష హార్మోన్ల మోతాదులు పెరిగినా సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. దీంతో బరువు పెరిగి నెలసరి మీద ప్రభావం చూపొచ్చు. ముఖం, బుగ్గలు, ఛాతీ మీద అవాంఛిత వెంట్రుకలు మొలవచ్చు. మీరు హార్మోన్ల సమస్యలు లేవని అంటున్నారు గానీ ఎలాంటి పరీక్షలు చేశారో తెలియజేయలేదు. నెలసరి వచ్చిన రెండో రోజున లేదా మూడో రోజున పరగడుపున కొన్ని హార్మోన్‌ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా మధుమేహంతో బాధపడుతున్నారా అనేదీ చూడాల్సి ఉంటుంది. మీ అమ్మాయి బరువెంతో తెలియజేయలేదు. సన్నగా ఉన్నా కూడా మన భారతీయుల్లో అవయవాల చుట్టూ పేరుకొనే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో పీసీఓఎస్‌లాంటి సమస్యలు రావొచ్చు. మీరు పీసీఓఎస్‌ లేదంటున్నారు గానీ దీన్ని రకరకాల పరీక్షలతో నిర్ధరించాల్సి ఉంటుంది. వీటన్నింటిని బట్టి అవసరమైన చికిత్సను నిర్ణయించాల్సి ఉంటుంది. మీరు ఒకసారి దగ్గర్లోని ఎండోక్రైనాలజిస్టును సంప్రదించండి. ఏవైనా హార్మోన్ల సమస్యలుంటే చికిత్స చేస్తారు. దీంతో పరిస్థితి కుదురుకుంటుంది. ఏదేమైనా మీ అమ్మాయికి మూడు నెలలకు ఒకసారైనా నెలసరి వచ్చేలా చూసుకోవటం ముఖ్యం. లేకపోతే ఇతరత్రా సమస్యలు చుట్టుముట్టొచ్చు.

చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌-501 512    

email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని