రీకానలైజేషన్‌ చేసినా..

గర్భధారణలో ఫలోపియన్‌ ట్యూబులు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భసంచి, అండాశయానికి వారధిగా ఉపయోగపడతాయి.

Updated : 24 Aug 2021 05:51 IST

సమస్య: నా భార్యకు 2017లో రీకానలైజేషన్‌ ఆపరేషన్‌ అయ్యింది. గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ సంతానం కలగటం లేదు. అన్ని ట్యూబులు బాగున్నాయి. కానీ గర్భం ధరించటం లేదు. కారణమేంటి?

- కెఆర్‌సీ యాదవ్‌ (ఈమెయిల్‌)

సలహా: గర్భధారణలో ఫలోపియన్‌ ట్యూబులు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భసంచి, అండాశయానికి వారధిగా ఉపయోగపడతాయి. అండాశయంలో విడుదలైన అండం, వీర్యంలోని శుక్రకణం వీటిల్లోనే ఫలదీకరణ చెందుతాయి. ఇలా ఏర్పడిన పిండం గర్భసంచిలోకి ప్రవేశించి స్థిరపడుతుంది. ట్యూబెక్టమీ ఆపరేషన్‌లో ఈ ఫలోపియన్‌ ట్యూబులను కత్తిరించి వేరు చేస్తారు. దీంతో అండం విడుదలైనా శుక్రకణంతో కలవదు. అయితే ఏ కారణంతోనో తిరిగి పిల్లలను కనాలనుకునేవారికి రీకానలైజేషన్‌ ఆపరేషన్‌ ఉపయోగపడుతుంది. ఇందులో ట్యూబెక్టమీలో కత్తిరించిన గొట్టాలను తిరిగి కలుపుతారు. సాధారణంగా ట్యూబెక్టమీ అనంతరం గొట్టాల చివర్లు ముడుచుకుపోయి ఉంటాయి. వీటిని కత్తిరించి జాగ్రత్తగా జోడిస్తారు. అయితే ఇవి అన్నిసార్లూ సవ్యంగా అతుక్కుంటాయని చెప్పలేం. కొన్నిసార్లు మధ్యలో అడ్డంకులు ఏర్పడొచ్చు. మీ భార్యకు ఫలోపియన్‌ ట్యూబులు బాగున్నాయని చెబుతున్నారు గానీ మళ్లీ పరీక్షించారో లేదో తెలియజేయలేదు. హిస్టరోస్కాల్పింగో గ్రామ్‌ పరీక్ష ద్వారా ట్యూబులు ఎలా ఉన్నాయన్నది నిర్ధారణ చేసుకోవటం చాలా ముఖ్యం. ఇవి బాగున్నా కొన్నిసార్లు గర్భధారణ జరగకపోవచ్చు. గర్భధారణకు ఒక్క ఫలోపియన్‌ ట్యూబులు బాగున్నంత మాత్రాన సరిపోదు. మిగతావీ బాగుండాలి. ఇతరత్రా సమస్యలేవైనా ఆటంకం కలిగిస్తున్నాయేమో చూడాల్సి ఉంటుంది. అండం సరిగా విడుదలవుతోందా లేదా? గర్భసంచి దగ్గర ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉందా? తెలుసుకోవాలి. అలాగే మీ శుక్రకణాల సంఖ్య, వాటి కదలికల తీరుతెన్నులూ ముఖ్యమే. వయసు మీద పడుతున్న కొద్దీ ఆడవారిలో అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. మగవారిలో శుక్రకణాల సంఖ్య, నాణత్య దెబ్బతింటుంది. కాబట్టి వీటిన్నింటినీ నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది. రీకానలైజేషన్‌ తర్వాత కొన్నిసార్లు ట్యూబుల్లోనే గర్భధారణ జరిగే ప్రమాదమూ లేకపోలేదు. గొట్టాలను తిరిగి కలిపిన చోట లోపలి మార్గం సన్నగా ఉంటుంది. ఫలదీకరణ చెందిన అండం అక్కడే చిక్కుకుపోవచ్చు. దీంతో ట్యూబుల్లోనే గర్భధారణ జరగొచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చికిత్స చేయాల్సి ఉంటుంది. మీ భార్యను దగ్గర్లోని గైనకాలజిస్టును చూపించండి. అవసరమైన పరీక్షలు చేసి తగు సలహా ఇస్తారు.

సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా:
సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌-501 512
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని