కొవిడ్‌కు పాల ప్రొటీన్‌

కొవిడ్‌-19కు చికిత్స ఎప్పుడు వస్తుంది? అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నది దీని కోసమే...

Updated : 31 Aug 2021 06:42 IST

కొవిడ్‌-19కు చికిత్స ఎప్పుడు వస్తుంది? అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నది దీని కోసమే. నిజానికి కొత్త మందులు కనిపెట్టటం అంత తేలికైన పని కాదు. కనీసం పదేళ్లయినా పడుతుంది. అందుకే ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులను కొవిడ్‌-19 చికిత్సలో వాడుకోవటం మీద పరిశోధకులు, నిపుణులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం కొత్త ఆశలు రేపుతోంది. దీని ప్రకారం చూస్తే- కొవిడ్‌-19 ఔషధం ఇప్పటికే మందుల దుకాణాల్లో అందుబాటులో ఉందనే చెప్పుకోవచ్చు. ప్రయోగశాలలో మొత్తం 17 మందుల ప్రభావాలను పరిశీలించగా 9 మందులు సార్స్‌-కొవీ-2ను సమర్థంగా అడ్డుకుంటున్నట్టు బయటపడింది. వీటిల్లో ఒకటి ల్యాక్టోఫెరిన్‌ అనే ప్రొటీన్‌. ఇది చనుబాలలో, ఆవు పాలలో ఉంటుంది. తొలినాళ్లలో వచ్చే ముర్రుపాలలోనైతే ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మిగతా మందులతో పోలిస్తే ఇది ఇన్‌ఫెక్షన్‌ను మరింత సమర్థంగా నివారిస్తున్నట్టు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది అత్యధిక వేగంతో వ్యాపించే డెల్టా రకం వైరస్‌ ఇన్‌ఫెక్షన్లనూ అడ్డుకుంటుండటం గమనార్హం. ల్యాక్టోఫెరిన్‌ను మందు రూపంలో చాలాకాలంగా వాడుకుంటున్నారు. నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో రక్త ఇన్‌ఫెక్షన్‌ను నివారించటానికి ఇస్తున్నారు. ఐరన్‌తో జతకూడే ప్రొటీన్‌ కావటం వల్ల వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచీ కాపాడగలదని భావిస్తున్నారు. ఇది సురక్షితమని ఇప్పటికే తెలిసినందున త్వరలోనే దీన్ని కొవిడ్‌-19 బాధితులపై ప్రయోగించి, పరీక్షించాలని భావిస్తున్నారు. ఇది బాగా పనిచేస్తున్నట్టు తేలితే కరోనా మహమ్మారి కోరలు అణచటానికి మందు దొరికినట్టే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని