టెన్నిస్‌ ఎల్బో తగ్గాలంటే ?

మీరు సమస్య గురించి చెప్పారు గానీ మిగతా వివరాలు తెలియజేయలేదు. టెన్నిస్‌ ఎల్బోను అర్థం చేసుకోవటం ఇతరత్రా వివరాలు చాలా కీలకం. పేరులో టెన్నిస్‌ ఉండటం వల్ల ఇది క్రీడాకారులకే వస్తుందని చాలామంది భావిస్తుంటారు

Published : 21 Jun 2022 01:03 IST

సమస్య: నాకు 42 ఏళ్లు. నెల నుంచి మోచేయి నొప్పి (టెన్నిస్‌ ఎల్బో) వేధిస్తోంది. ఇదేం సమస్య? పూర్తిగా తగ్గటానికి ఏం చెయ్యాలి?

- పి.లక్ష్మి, కాకినాడ

సలహా: మీరు సమస్య గురించి చెప్పారు గానీ మిగతా వివరాలు తెలియజేయలేదు. టెన్నిస్‌ ఎల్బోను అర్థం చేసుకోవటం ఇతరత్రా వివరాలు చాలా కీలకం. పేరులో టెన్నిస్‌ ఉండటం వల్ల ఇది క్రీడాకారులకే వస్తుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి ఎవరికైనా రావొచ్చు. మోచేయి నుంచి అరచేతి వైపు సాగే కండర బంధనాలు (టెండన్స్‌) మోచేయి చివరి భాగంలోనే మొదలవుతాయి. ఇవి విపరీతమైన ఒత్తిడికి గురై, వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తటం సమస్యకు దారితీస్తుంది. గట్టిగా ఏదైనా పట్టుకున్నప్పుడు మోచేయి వెలుపలి భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ నొప్పి ముంజేయి, మణికట్టుకూ విస్తరించొచ్చు. టెన్నిస్‌ ఎల్బో మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువ. దీనికి కచ్చితమైన కారణమేంటనేది తెలియదు. అయితే థైరాయిడ్‌ జబ్బు, యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండటం, మధుమేహం గలవారిలో ఎక్కువగా చూస్తుంటాం. కొందరిలో కీళ్లవాతం రాబోయే ముందూ టెన్నిస్‌ ఎల్బో మొదలవ్వచ్చు. అదేపనిగా చేత్తో గట్టిగా పట్టుకొని పనులు చేసేవారిలో (ఉదా: ప్లంబర్లు, పెయింటర్లు).. బ్యాట్‌ను పట్టుకొనే టెన్నిస్‌, షటిల్‌, క్రికెట్‌ వంటి ఆటలు ఆడేవారిలో ఈ సమస్య తరచూ కనిపిస్తుంది. ఇటీవల ఐటీ ఉద్యోగుల్లోనూ ఎక్కువగా చూస్తున్నాం. టెన్నిస్‌ ఎల్బోకు లక్షణాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. నొప్పి స్వల్పంగా ఉండి, కండర పోచలు కొద్దిగానే చీరుకుపోయినట్టయితే చేతికి విశ్రాంతి ఇస్తే చాలావరకు కుదురుకుంటుంది. పారాసిటమాల్‌, నొప్పి నివారణ మాత్రలు అవసరపడొచ్చు. నొప్పి ఉన్నచోట వేడి కాపు లేదా ఐస్‌ అద్దటం మేలు చేస్తాయి. నొప్పి తగ్గటానికి కొన్ని ఫిజియోథెరపీ పద్ధతులూ తోడ్పడతాయి. ప్రస్తుతం నొప్పి తగ్గటానికి అన్‌డీనేచర్డ్‌ కొలాజెన్‌ టైప్‌-2 రకం మందులూ అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ పనిచేయకపోతే నొప్పి ఉన్నచోట స్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ ఫలితం లేకపోతే సొంత రక్తాన్ని తీసుకొని, దీనిలోంచి ప్లేట్‌లెట్‌ కణాలతో నిండిన ప్లాస్మాను వేరు చేసి.. నొప్పి ఉన్నచోట ఇవ్వాల్సి ఉంటుంది. అయినా కూడా ఉపశమనం కలగకపోతే శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇందులో ఒత్తిడికి గురవుతున్న కండర పోచలను పాక్షికంగా విడదీస్తారు. దీంతో నొప్పి తగ్గుతుంది. మీరు చేతి శస్త్రచికిత్స నిపుణులను గానీ ఎముకల నిపుణులను గానీ సంప్రదించండి. మీరు చేసే ఉద్యోగం, పనులు, ఇతరత్రా జబ్బుల వంటి వాటిని పరిశీలించి చికిత్స సూచిస్తారు.

డా।। వి.వెంకటరమణ హ్యాండ్‌ సర్జన్‌, హైదరాబాద్‌


మీ ఆరోగ్య సమస్యలు, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని