అంగం చిన్నగా ఉంది.. గట్టిపడటం లేదు.. ఎందుకు?

నా అంగం చాలా చిన్నగా ఉంటుంది. అయినా ఇంతకాలం శృంగారపరంగా ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. కానీ ఒక నెల నుంచి స్తంభన సరిగా జరగటం లేదు. అంగం గట్టిపడినా మునుపటిలా బలంగా ఉండటం లేదు. దీంతో శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నాను.

Updated : 19 Mar 2019 00:43 IST

సమస్య - సలహా

సమస్య: నా అంగం చాలా చిన్నగా ఉంటుంది. అయినా ఇంతకాలం శృంగారపరంగా ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. కానీ ఒక నెల నుంచి స్తంభన సరిగా జరగటం లేదు. అంగం గట్టిపడినా మునుపటిలా బలంగా ఉండటం లేదు. దీంతో శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నాను. దీనికి కారణమేంటి? పరిష్కారమేదైనా ఉందా?

- వినోద్‌ (ఈ మెయిల్‌ ద్వారా)

సలహా: మీరు అంగం చిన్నగా ఉండటం వల్ల సరిగా గట్టిపడటం లేదని భావిస్తున్నట్టు అనిపిస్తోంది. అంగం చిన్నగా ఉండటానికీ స్తంభించటానికీ ఎలాంటి సంబంధమూ లేదు. టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ స్థాయులు బాగా ఉండి, రక్త ప్రసరణ సాఫీగా సాగుతూ.. నాడుల సమస్యల వంటివేవీ లేకపోతే అంగం చిన్నగా ఉన్నా వచ్చిన ఇబ్బందేమీ లేదు. శృంగార భావనలు కలిగినపుడు మామూలుగానే గట్టిపడుతుంది. కాబట్టి సైజు ఎంతన్నది ముఖ్యం కాదు. కొందరు అంగం చిన్నగా అయ్యిందనీ అంటుంటారు. ఇది పూర్తిగా అపోహే. రక్తప్రసరణ జరిగినపుడు పెద్దగా, తగ్గినపుడు చిన్నగా కనిపిస్తుంది. అంతే తప్ప మధ్యలో సైజు చిన్నగా అవటమనేది ఉండదు. అందువల్ల అంగం చిన్నగా ఉందనే భయాలేవీ పెట్టుకోవద్దు. మీ వయసెంత? మధుమేహం వంటి సమస్యలేవైనా ఉన్నాయా? అనే వివరాలేవీ తెలియజేయలేదు. స్తంభన విషయంలో వయసుతో పాటు మధుమేహం వంటి సమస్యలు కూడా ప్రభావం చూపుతాయని గుర్తించాలి. కొందరికి వయసుతో పాటు రక్తనాళాల్లో పూడికలు (అథెరోస్కెర్లోసిస్‌) ఏర్పడుతుంటాయి. అంగానికి రక్తాన్ని సరఫరా చేసే సూక్ష్మ రక్తనాళాల్లో ఇలాంటివేవైనా ఏర్పడితే.. రక్తనాళాల మార్గం సన్నబడుతుంది. దీంతో రక్తప్రసరణ సరిగా జరగక స్తంభించటం తగ్గుతుంది. కొందరికి మధుమేహం మూలంగానూ రక్తనాళాల మార్గం సన్నబడి సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. మధుమేహంతో నాడులు దెబ్బతినటం వల్ల కూడా స్తంభనలోపం తలెత్తొచ్చు. అలాగే వయసు పెరిగేకొద్దీ టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ మోతాదులూ తగ్గుతూ వస్తుంటాయి. దీంతోనూ అంగం అంతగా గట్టిపడకపోవచ్చు. అందువల్ల మీరు ఒకసారి మంచి యూరాలజిస్టును గానీ ఆండ్రాలజిస్టును గానీ సంప్రతించటం మంచిది. కారణమేంటన్నది కచ్చితంగా తెలుసుకుంటే చికిత్స సులువవుతుంది. స్తంభనలోపంతో బాధపడేవారికి ముందుగా టెస్టోస్టీరాన్‌ పరీక్ష చేస్తారు. దీంతో టెస్టోస్టీరాన్‌ స్థాయులు ఎలా ఉన్నాయన్నది బయటపడుతుంది. అవసరమైతే రక్తనాళాల తీరుతెన్నులను తెలుసుకోవటానికి పినైల్‌ డాప్లర్‌ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో అంగానికి రక్తం సరిగా సరఫరా అవుతోందా? రక్తనాళాల సమస్యలేవైనా ఉన్నాయా? అనేది బయటపడుతుంది. టెస్టోస్టీరాన్‌ స్థాయులు తక్కువగా ఉంటే టెస్టోస్టీరాన్‌ ఇంజెక్షన్లు గానీ మాత్రలు గానీ చర్మానికి అంటించుకునే ప్లాస్టర్లు గానీ ఇస్తారు. దీంతో టెస్టోస్టీరాన్‌ స్థాయులు మెరుగుపడి స్తంభనలోపం తగ్గుతుంది. ఒకవేళ రక్త ప్రసరణ సరిగా లేకపోతే సిల్డినాఫిల్‌ (వయాగ్రా వంటివి) లేదా టెడలాఫిల్‌ మాత్రలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇవి రక్తనాళాలు విప్పారేలా చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. దీంతో స్తంభన మెరుగవుతుంది. సిల్డినాఫిల్‌ మందు 4 గంటలు.. టెడలాఫిల్‌ మందు 36 గంటల పాటు పనిచేస్తాయి. వీటితో మంచి ఫలితం కనబడుతుంటే వారానికి ఒకట్రెండు సార్ల చొప్పున ఎంత కాలమైనా వాడుకోవచ్చు. అయితే గుండె జబ్బులు, గుండెనొప్పి వంటి సమస్యలు గలవారికి మాత్రం ఇవి శ్రేయస్కరం కాదు. మిగతావాళ్లు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. కొందరికి తలనొప్పి, కళ్లు ఎర్రబడటం వంటి ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. ఈ మాత్రలతో ఫలితం కనబడకపోతే శస్త్రచికిత్స ద్వారా అంగంలో కృత్రిమ పరికరాన్ని అమర్చే అవకాశమూ ఉంది. కావాల్సినప్పుడు పైకీ కిందికీ వంచుకోగలిగిన పరికరం, అవసరమైనప్పుడు ఉబ్బేలా చేసే పరికరం.. ఇలా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో శృంగారానుభూతి బాగానే కలుగుతుంది. టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ మోతాదులు బాగా ఉంటే కోరికలు కూడా మామూలుగానే ఉంటాయి. కొందరికి మానసిక కారణాలతోనూ స్తంభన సరిగా జరగకపోవచ్చు. ఎప్పుడైనా అంగం గట్టిపడకపోతే, భాగస్వామిని సంతృప్తి పరచలేకపోతే.. ఆ తర్వాత కూడా అలాగే జరుగుతుందేమోనని భయపడుతుంటారు. అతిగా ఆందోళన చెందుతుంటారు. ఇది మానసికంగా కుంగదీసి సమస్యను మరింత జటిలం చేస్తుంది. కాబట్టి మానసిక సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా అంతా బాగానే ఉండి.. మానసికంగా ఇబ్బంది పడుతుంటే సైక్రియాటిస్టు సలహా తీసుకోవటం మంచిది. కౌన్సెలింగ్‌తో మంచి ఫలితం కనబడుతుంది.


మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని