అరచేతుల్లో ఒకటే చెమట?

నా వయసు 24 సంవత్సరాలు. నాకు చిన్నప్పట్నుంచీ అరచేతుల్లో విపరీతంగా చెమట పోస్తుంది. ఏదైనా రాస్తున్నప్పుడు కాగితం తడిచిపోతుంది. కంప్యూటర్‌ మీద పనిచేస్తున్నప్పుడు కీబోర్డు కూడా తడిగా అవుతుంది. ఇప్పటివరకూ ఎలాంటి మందులు వాడలేదు.

Published : 02 Apr 2019 00:22 IST

సమస్య-సలహా

సమస్య: నా వయసు 24 సంవత్సరాలు. నాకు చిన్నప్పట్నుంచీ అరచేతుల్లో విపరీతంగా చెమట పోస్తుంది. ఏదైనా రాస్తున్నప్పుడు కాగితం తడిచిపోతుంది. కంప్యూటర్‌ మీద పనిచేస్తున్నప్పుడు కీబోర్డు కూడా తడిగా అవుతుంది. ఇప్పటివరకూ ఎలాంటి మందులు వాడలేదు. దీనికి ఏదైనా పరిష్కారముందా?

- రవి సారథి (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే ఇది హైపర్‌హైడ్రోసిస్‌ సమస్యగా అనిపిస్తోంది. ఇందులో అనవసరంగా అత్యధికంగా చెమట పోస్తుంటుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడో, జ్వరం వచ్చినపుడో, పనులు చేసినపుడో, వ్యాయామం చేసినపుడో, ఆందోళనకు గురైనప్పుడో మనకు చెమట పోయటం మామూలే. ఇది శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతుంది. నాడుల నుంచి సంకేతాలు అందగానే చెమట గ్రంథులు పని చేయటం మానేస్తాయి. దీంతో చెమట రావటం ఆగిపోతుంది. కానీ హైపర్‌హైడ్రోసిస్‌లో చెమట గ్రంథులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. దీంతో అవసరం లేకపోయినా చెమట ఎక్కువగా వస్తుంటుంది. కూచున్నా, టీవీ చూస్తున్నా, ఎయిర్‌ కండిషన్‌ గదుల్లో ఉన్నా కూడా చెమట పోస్తుంది. కొందరికి ఈత కొడుతున్నప్పుడూ చెమట పోయటం విచిత్రం. దీని బారినపడ్డవారిలో కొందరికి శరీరంలో ఒకట్రెండు భాగాల్లో చెమట ఎక్కువగా పోస్తే.. కొందరికి ఒళ్లంతా చెమటలు పోయొచ్చు. అరచేతుల్లో చెమట ఎక్కువగా పోయటాన్ని పామర్‌ హైపర్‌హైడ్రోసిస్‌ అంటారు. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. ఆందోళన, ఒత్తిడిలో ఉన్నప్పుడు మరింత ఎక్కువవుతుంది. దీనికి చెమట పట్టకుండా చూసే మందులు బాగా ఉపయోగపడతాయి. ఫార్మాల్డీహైడ్‌ పూత మందును చేతులకు రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఇది క్రమంగా చెమట తగ్గటానికి తోడ్పడుతుంది. అల్యూమినియం క్లోరైడ్‌ పూత మందు కూడా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు మరికొన్ని మందులూ అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఆందోళన, ఒత్తిడితోనూ చెమట పట్టే అవకాశముంది కాబట్టి అవసరమైతే ఆందోళనను తగ్గించే మందులు వేసుకోవాల్సి ఉంటుంది. నాడులు అతిగా స్పందించటం వల్ల చెమట ఎక్కువగా వస్తుంటే సర్జరీ చేసి సరిదిద్దాల్సి ఉంటుంది కూడా. అలాగే ఇతరత్రా కారణాలతో చెమట పోస్తోందా అనేదీ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్‌ సమస్యలు, మధుమేహంలోనూ చెమట ఎక్కువగా రావొచ్చు. గుండె వైఫల్యంలోనూ కొందరికి అరచేతుల్లో, అరికాళ్లలో చెమటలు వస్తుంటాయి. కొన్నిరకాల క్యాన్సర్లలోనూ ఇదొక లక్షణంగా కనబడుతుంటుంది కూడా. అందువల్ల మీరు ఒకసారి చర్మ నిపుణులను సంప్రతించటం మంచిది. ఇది మామూలు హైపర్‌హైడ్రోసిస్‌ సమస్యనా? ఇతరత్రా కారణాలతో వస్తున్నదా? అనేది తెలుసుకొని తగు చికిత్సలు సూచిస్తారు.


మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య - సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,  రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email:sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని