మోకాళ్ల నొప్పి తగ్గడం లేదేం?

సమస్య: నా వయసు 45. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ సమస్యలేవీ లేవు. నెలసరి నిలిచిన తర్వాత బరువు పెరిగింది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మృదులాస్థి (కార్టిలేజ్‌) తగ్గిందన్నారు. మందులు వాడితే నొప్పి తగ్గుతోంది. ఆపేస్తే మళ్లీ వస్తోంది.

Updated : 19 Jul 2021 23:19 IST

సమస్య సలహా

సమస్య: నా వయసు 45. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ సమస్యలేవీ లేవు. నెలసరి నిలిచిన తర్వాత బరువు పెరిగింది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మృదులాస్థి (కార్టిలేజ్‌) తగ్గిందన్నారు. మందులు వాడితే నొప్పి తగ్గుతోంది. ఆపేస్తే మళ్లీ వస్తోంది. డాక్టర్‌ సూచించిన వ్యాయామాలు చేస్తుంటే నొప్పి ఇంకా పెరుగుతోంది. వ్యాయామం అంటేనే భయమేస్తోంది. ఏంచేస్తే ఈ బాధ తగ్గుతుందో చెప్పగలరు.

- లక్ష్మీఛాయ, హైదరాబాద్‌
 

సలహా: మీరు ముందుగా గ్రహించాల్సింది- వ్యాయామం నొప్పికి పరిష్కారమే గానీ కారణం కాదు. మోకాళ్ల నొప్పులకు మందులు కొంతవరకు పనిచేయొచ్చు గానీ ఫిజియోథెరపీయే కీలకం. బలహీనంగా, బద్ధకంగా ఉన్న కండరాలు వ్యాయామంతో ఉత్తేజితమవుతాయి. కాబట్టి మొదట్లో నొప్పి కాస్త ఎక్కువగా ఉండొచ్చు. దీనికి భయపడాల్సిన పనిలేదు. వ్యాయామాలను ఆపటానికి లేదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటే కండరాల నొప్పులేవీ వేధించవు. వ్యాయామాలతో మోకాళ్లకు దన్నుగా ఉండే కండరాలు బలోపేతమవుతాయి. ఇవి కీళ్లు త్వరగా అరగకుండా కాపాడతాయి. మోకాళ్ల కింద దిండు పెట్టుకొని చేసే వ్యాయామాల వంటివి బాగా ఉపయోగపడతాయి. ఇవి తొడ కండరాలను బలోపేతం చేస్తాయి. దీంతో మోకీళ్ల మీద భారం పడటం తగ్గుతుంది. మీకు ఇప్పటికే మృదులాస్థి తగ్గిపోయింది కాబట్టి వ్యాయామం మరింత ముఖ్యమని తెలుసుకోవాలి. నొప్పులకు భయపడి వ్యాయామం ఆపేస్తే మరింత బరువు పెరుగుతారు. బరువు పెరిగితే మోకీళ్ల మీద భారమూ ఎక్కువవుతుంది. దీంతో మృదులాస్థి ఇంకాస్త త్వరగానూ అరుగుతుంది. వ్యాయామాలు చేయటంతో పాటు కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. మెట్లు ఎక్కటం, కింద కూర్చోవటం తగదు. మీది చిన్న వయసే కాబట్టి మోకాళ్ల మార్పిడి అవసరం లేదు. ఎక్స్‌రేలో మృదులాస్థి బాగా అరిగిపోయినట్టు, ఆర్థ్రయిటిస్‌ నాలుగో దశలో ఉన్నట్టు తేలితే మాత్రం ఆపరేషన్‌ తప్ప మరో మార్గం లేదు. మీ వయసు, తెలియజేసిన వివరాల ప్రకారం పరిస్థితి అంతవరకూ రాలేదనే అనిపిస్తోంది. ఇప్పటికైనా జాగ్రత్త పడటం మంచిది. లేకపోతే పరిస్థితి దిగజారొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని