ఇదేం కడుపునొప్పి?

నాకు దాదాపు ఏడాది నుంచి కడుపు పైభాగాన రెండు వైపులా నొప్పి, మంట వస్తున్నాయి. ఎలాంటి ఆహారం తిన్నా ఇవి వేధిస్తున్నాయి. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే కొలనోస్కోపీ చేసి మలాశయం వద్ద రెండు చిన్న పాలిప్స్‌ను తొలగించారు.

Published : 02 May 2023 00:39 IST

సమస్య: నాకు దాదాపు ఏడాది నుంచి కడుపు పైభాగాన రెండు వైపులా నొప్పి, మంట వస్తున్నాయి. ఎలాంటి ఆహారం తిన్నా ఇవి వేధిస్తున్నాయి. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే కొలనోస్కోపీ చేసి మలాశయం వద్ద రెండు చిన్న పాలిప్స్‌ను తొలగించారు. కడుపునొప్పికి వీటికి సంబంధం లేదన్నారు. తర్వాత ఎండోస్కోపీ చేశారు. అన్నవాహికలో కొద్దిగా రిఫ్లక్స్‌, చిన్న డ్యుయోడినల్‌ అల్సర్‌ ఉన్నాయన్నారు. మూడు నెలలుగా ఉదయం, రాత్రి ఓమిప్రొజోల్‌ మాత్రలు వేసుకుంటున్నాను. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఇదేం నొప్పి? దీనికి పరిష్కారం చూపించగలరు.

కుమార్‌ టి.

సలహా: మీరు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ  చేయించుకున్నారు. పెద్దగా సమస్యలేమీ బయటపడలేదు. కాబట్టి ప్రమాదకరమైన జబ్బేదీ లేకపోవచ్చు. మీరు వాడుతున్న మందులతో అన్నవాహికలోకి జీర్ణరసాలు ఎగదన్నుకొని రావటం (రిఫ్లక్స్‌), డ్యుయోడినమ్‌ అల్సర్‌ సమస్యలు ఇప్పటికే తగ్గిపోయి ఉండాలి. అయినా నొప్పి, మంట తగ్గలేదంటే ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. మీరు తెలిపిన లక్షణాలను బట్టి ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) లేదా నాన్‌ అల్సర్‌ డిస్‌పెప్సియాలో ఏదో ఒకటి ఉండొచ్చని అనిపిస్తోంది. ఐబీఎస్‌లో రకరకాల లక్షణాలుంటాయి. వీటిల్లో ఒకటి తరచూ నొప్పి రావటం. విరేచనాలు, మలబద్ధకం కూడా ఉండొచ్చు. కొందరిలో ఇవి రెండూ కలిసి ఉండొచ్చు. నాన్‌ అల్సర్‌ డిస్‌పెప్సియాలో పుండు లేకపోయినా అజీర్ణం, మంట వంటివి వేధిస్తుంటాయి. కాబట్టి ఆయా లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. నొప్పి, మంట తగ్గటానికి ఒమిప్రొజోల్‌ ఒక్కటే కాదు.. ఇతరత్రా మందులూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రొకైనటిక్స్‌ రకం మందులు మేలు చేస్తాయి. ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ అయితే పేగుల కదలికలను నియంత్రించే మందులు ఉపయోగపడతాయి. వీటిని వైద్యుల పర్యవేక్షణలో ఆరంభించాల్సి ఉంటుంది. ముందుగా ఏ మందు పనిచేస్తుందో గుర్తించి, వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడితోనూ నొప్పి, మంట వంటివి తలెత్తొచ్చు. కాబట్టి యోగా, ధ్యానం వంటి వాటితో మానసిక ప్రశాంతత సాధించేందుకు ప్రయత్నించాలి. ఏవైనా పదార్థాలు తిన్నప్పుడు ప్రత్యేకించి నొప్పి, మంట వస్తున్నట్టు గుర్తిస్తే ఆపెయ్యాలి. ఐబీఎస్‌ గలవారికి త్వరగా జీర్ణం కాని పిండి పదార్థాలు తక్కువగా ఉండే లో ఫాడ్‌మ్యాప్‌ ఆహార పద్ధతి ఉపయోగపడుతుంది. దీని గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి. కొన్ని జబ్బులు పరీక్ష చేసినప్పుడు చిన్నగా ఉండటం వల్ల కనిపించకపోవచ్చు. కొంతకాలం తర్వాత బయటపడొచ్చు. కాబట్టి మీరు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదిస్తూ ఉండటం మంచిది.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని