Updated : 21 Nov 2022 16:38 IST

మట్టు గుట్టు

తొలి ఏడుపు. బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకునేలా చేసి, ఊపిరితిత్తుల పనిని ఆరంభిస్తుంది. తొలి పోషణ. ముర్రుపాలు బిడ్డకు అవసరమైన పోషకాలన్నింటినీ సమకూరుస్తాయి. రోగనిరోధకశక్తినీ పెంపొందిస్తాయి. అలాగే  తొలి విరేచనమూ. ముఖం చిట్లించుకోవాల్సిన పనిలేదు. పిండం ఎదుగుదల క్రమంలో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా విసర్జితం కావాల్సిందే. లేకపోతే లోపలేదో సమస్య ఉన్నట్టే.
పుట్టిన తొలినాళ్లలో బిడ్డ ప్రతి కదలికా అబ్బురంగానే ఉంటుంది. తల్లి స్పర్శ కోసం ఏడవటం దగ్గర్నుంచి లేలేత పెదాలతో చనుబాలు తాగటం వరకూ అన్నీ ప్రత్యేకమే. మట్టు.. అదే తొలి విరేచనం కూడా అలాగే ఆశ్చర్యం గొలుపుతుంది. ముదురు ఆకుపచ్చ రంగులో.. ఒకింత నలుపుతో కూడిన దీన్నే మెకోనియం అంటారు. మెకాన్‌ అంటే గంజాయి విత్తనాలని అర్థం. మట్టు రంగు అచ్చం గంజాయి విత్తనాల పొడినే తలపిస్తుంది. అందుకే ఆ పేరు. పిండం ఆహారమే తీసుకోదు కదా. మలం ఎక్కడ్నుంచి తయారవుతుంది? ఇది ఆహార వ్యర్థాలతో తయారయ్యేది కాదు. బిడ్డ కడుపులో సహజంగా ఏర్పడేది. పుట్టిన తర్వాత తల్లి పాలు తాగటానికి సన్నద్ధం కావటానికి గర్భస్థ శిశువు ఉమ్మనీటిని మింగుతూ ఉంటుంది. ఉమ్మనీరు బిడ్డకు పోషకాలను అందించటంతో పాటు ఎదుగుదలనూ ప్రేరేపిస్తుంది. మట్టు దీని నుంచే పుట్టుకొస్తుంది. పిండం పేగుల్లోని పైపొర కణాలు ఎప్పటికప్పుడు ఊడిపోతూ, కొత్తవి పుట్టుకొస్తుంటాయి. పేగుల్లో కొన్ని ద్రవాలు ఊరుతుంటాయి. పైత్యరస లవణాలు, పైత్యరస ఆమ్లాల వంటివీ పోగుపడుతుంటాయి. అంతేకాదు, పిండం శరీరం మీద మొలిచే నూగులాంటి సన్నటి, మెత్తటి వెంట్రుకలూ వీటికి తోడవుతాయి. ఈ వెంట్రుకలు పుట్టటానికి ముందే ఊడిపోయి, ఉమ్మనీటిలో కలుస్తాయి. ఉమ్మనీటిని మింగినప్పుడు ఇవీ పేగుల్లోకి చేరుకుంటాయి. ఇవన్నీ కలిసిపోయి మట్టుగా ఏర్పడతాయి. ఇది నాలుగో నెల నుంచి ఇది ఏర్పడటం మొదలై, పెద్దపేగులో పోగుపడుతూ వస్తుంది. ఇలా పెద్ద పేగు మూసుకుపోకుండానూ కాపాడుతుంది.
తల్లి గర్భంలోనే విసర్జన కావటం
కొన్నిసార్లు తల్లి కడుపులో ఉండగానే మట్టు పడిపోవచ్చు. బిడ్డ ఒత్తిడి, షాక్‌ వంటి వాటికి గురైనప్పుడు కండర బంధనాలు వదులై, మట్టు బయటకు రావొచ్చు. పిండం తగినంత బరువు పెరగకపోవటం, 40 వారాలు దాటినా కాన్పు కాకపోవటం, గర్భిణి మధుమేహం, తల్లికి అధిక రక్తపోటు, పొగ అలవాటు వంటివీ దీనికి కారణం కావొచ్చు. కాన్పుకు కొన్ని వారాల ముందు మట్టు విడుదలైతే ఉమ్మనీరు ఆకుపచ్చగా అవుతుంది. కాసేపట్లో కాన్పు అవుతుందనగా విడుదలైతే ఉమ్మనీటిలో మట్టు ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. ఉమ్మనీటిలోనే మట్టు విడుదలైతే మరకలు (మెకోనియం స్టెయినింగ్‌) ఏర్పడొచ్చు. దీంతో బిడ్డ చర్మం, గోళ్లు రంగు మారిపోవచ్చు. ఇదేమీ హాని కలిగించదు. కానీ మట్టు ఊపిరితిత్తులోకి వెళ్తే (మెకోనియం ఆస్పిరేషన్‌) శ్వాస తీసుకోవటం కష్టం కావొచ్చు. అందువల్ల వీరికి పుట్టిన వెంటనే సకర్‌తో శ్వాసకోశం పైభాగాన్ని శుభ్రం చేయాలి. లేకపోతే మట్టు గాలిగదుల వరకూ చేరుకోవచ్చు.  
చికిత్స: మట్టు మింగినా చాలావరకు పెద్దగా సమస్యలు సృష్టించదు. శ్వాస కాస్త కష్టం కావొచ్చు. ఆక్సిజన్‌ ఇస్తే కుదురుకుంటుంది. ఓ 10% మందిలో తీవ్రమవ్వచ్చు. వీరికి  వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించటానికి తోడ్పడే సర్ఫెక్టెంటెట్‌ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కొన్నిసార్లు కృత్రిమ ఊపిరితిత్తిలా పనిచేసే ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) చికిత్స అవసరమవ్వచ్చు. సమస్య మరీ ముదిరితే ప్రాణాపాయమూ సంభవించొచ్చు.

పిండం పొట్టలో లీకవటం
కొన్నిసార్లు మెకోనియం బిడ్డ శరీరం లోపలే విడుదల కావొచ్చు. దీనికి మూలం పేగు గోడలకు రంధ్రాలు పడటం. పేగులు మెలి దిరిగిపోవటం (వాల్వ్‌లస్‌), పేగులో కొంతభాగం మరో భాగంలోకి చొచ్చుకెళ్లటం (ఇంటససెప్షన్‌), పేగులకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతినటం, పేగులో కొంత భాగం ఏర్పడకపోవటం వంటివన్నీ ఇందుకు కారణం కావొచ్చు. దీంతో మట్టు పేగులోంచి బయటకు వచ్చి, పొట్టలోకి చేరుకుంటుంది. ఇది కడుపులోని పెరిటోనియం పొర వాపునకు దారితీస్తుంది (మెకోనియం పెరిటొనైటిస్‌). దీంతో పేగులు అతుక్కుపోవచ్చు. పేగుల్లో అడ్డంకులు తలెత్తొచ్చు. బిడ్డ పొట్టలోకి మట్టు విడుదలైతే అక్కడక్కడా క్యాల్షియం ముద్దలు (కాల్సిఫికేషన్‌) ఏర్పడతాయి. దీన్ని గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్‌ పరీక్షతో గుర్తించొచ్చు. మెకోనియం పెరిటొనైటిస్‌ గలవారికి పుట్టిన వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.
24 గంటల్లోనే తొలి విసర్జన
మట్టు ఆకుపచ్చ రంగులో ఉండటానికి ప్రధాన కారణం పైత్యరసం. దీని రంగు క్రమంగా ముదురుతూ వస్తుంది. చివరికి ఒకింత నల్లగానూ మారుతుంది. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో మట్టు బయటకు వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. బిడ్డ తల్లి శరీరాన్ని తాకేలా చూసుకోవటం, వీలైనంత త్వరగా పాలు పట్టించటం ద్వారా త్వరగా మట్టు బయటకు వచ్చేలా చూసుకోవచ్చు. ఇది చాలా జిగటగా, తారు మాదిరిగా ఉంటుంది. అందుకే బిడ్డ ఒంటికి అంటుకుంటే ఒక పట్టాన వదలదు. విరేచనం అనగానే చెడు వాసన వస్తుందని అనుకుంటాం గానీ మట్టు అలా కాదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు పేగుల్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. అందువల్ల చెడు వాసనేమీ వేయదు. తొలి 3 రోజుల్లో పేగుల్లో పేరుకుపోయిన మట్టు అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత రెండు రోజుల వరకు ఆకుపచ్చ రంగులో విరేచనం అవుతుంటుంది. అనంతరం తల్లిపాలు తాగే పిల్లల్లో పసుపు రంగు, పోతపాలు తాగే పిల్లల్లో గోధుమ రంగులోకి మారుతుంది.

మట్టు ఆలస్యమైతే?
కొందరికి మట్టు విసర్జన ఆలస్యం కావొచ్చు. పుట్టిన తర్వాత 48 గంటలు దాటినా మట్టు రాకపోతే బిడ్డకు కామెర్లు తలెత్తొచ్చు. అందువల్ల మట్టు ఆలస్యం కావటానికి కారణమేంటన్నది జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కొన్ని మామూలువైతే, మరికొన్నింటికి శస్త్రచికిత్స అవసరమవుతుంది.


మామూలు కారణాలు

నెలలు నిండక ముందే,  తక్కువ బరువుతో పుట్టిన వారిలో, మధుమేహ తల్లులకు జన్మించినవారిలో పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. తల్లికి థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గితే ఆ ప్రభావం బిడ్డ మీదా పడుతుంది. ఇదీ పేగుల కదలికలను నెమ్మదింపజేస్తుంది. బిడ్డకు సెప్సిన్‌తోనూ పేగుల కదలికలు తగ్గుతాయి. దీంతో మట్టు విసర్జన ఆలస్యమవుతుంది.
చికిత్స
* నెలలు నిండక ముందే, తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో మట్టు విసర్జన ఆలస్యమైతే- మలద్వారం గుండా సన్నటి గొట్టాన్ని పంపించి, సెలైన్‌ ద్రవంతో కడగాల్సి ఉంటుంది. సమస్య కుదురుకునేవరకు.. ఓ వారం, పది రోజుల పాటు శుభ్రం చేయాల్సి ఉంటుంది. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ అయితే యాంటీబయోటిక్‌ చికిత్స చేస్తారు. తల్లికి హైపోథైరాయిడిజమ్‌ ఉంటే బిడ్డలోనూ సమస్య ఉందేమో చూసి, తగు మోతాదులో థైరాయిడ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చికిత్సను దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుంది.


తీవ్ర కారణాలు
కొందరికి మలద్వారం పుట్టుకతోనే మూసుకుపోవటం వల్ల విసర్జన సాధ్యం కాదు. హిస్‌ప్రన్స్‌ డిసీజ్‌ గలవారిలో పేగులో నాడీ కణాలు (గాంగ్లియన్‌ కణాలు) ఉండవు. ఫలితంగా పేగుల కదలికలు, సరిగా సాగక మట్టు ఆలస్యమవుతుంది. కొందరిలో మట్టు చాలా జిగటగా ఉండి, చిన్నపేగు చివరి భాగంలో కదలకుండా ఉండిపోతుంది (మెకోనియం ఐలియస్‌). పేగుల్లో జిగురుద్రవం అడ్డుపడటం మూలంగానూ మెకోనియం బయటకు రాకపోవచ్చు (మెకోనియం ప్లగ్‌ సిండ్రోమ్‌). కొందరికి పేగు చివరి భాగం నుంచి చర్మం మీదకు సన్నటి మార్గాల ద్వారా మట్టు బయటకు వచ్చి, పొక్కుల మాదిరిగా కనిపించొచ్చు (మెకోనియం పెరల్స్‌).
కారణాన్ని బట్టి చికిత్స
* పెద్దపేగు మలద్వారం చర్మం వరకూ వచ్చి ఆగిపోతే- చర్మాన్ని కత్తిరించి మలద్వారాన్ని ఏర్పాటు చేస్తారు (యానోప్లాస్టీ). పైభాగాన లోపముంటే- ముందు పొట్టకు ఒకవైపున తాత్కాలికంగా రంధ్రం చేసి, పేగులోకి గొట్టాన్ని అమరుస్తారు (కొలాస్టమీ). ఆర్నెల్ల తర్వాత పెద్దపేగును కింది వరకూ తీసుకొచ్చి మలద్వారానికి కలుపుతారు (ఫుల్‌ త్రూ సర్జరీ).
* హిస్‌ప్రన్స్‌ డిసీజ్‌ గలవారిలో పేగు కుంచించుకుపోయిన భాగాన్ని ఆపరేషన్‌ చేసి, తొలగిస్తారు. నాడీ కణాలతో కూడిన పేగు భాగాన్ని కిందికి తీసుకొచ్చి, కలుపుతారు.
* చిన్నపేగులో మట్టు గట్టిపడితే ముందు ఎనీమా ద్వారా మందు లిస్తారు. ఫలితం కనిపించకపోతే చిన్నపేగు భాగాన్ని కత్తిరించి, పొట్టకు రంధ్రం చేసి కలుపుతారు (ఐలియాస్టమీ). ఎనిమిది వారాల తర్వాత పేగును తిరిగి జతచేస్తారు.  
* జిగురుద్రవం అడ్డుపడినవారిలో పెద్దపేగు భాగాన్ని శుభ్రం చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు