కొవిడ్‌ తగ్గాక స్టెంట్‌.. జాగ్రత్తలేంటి?

నాకు ఇటీవల కొవిడ్‌ వచ్చి తగ్గింది. తర్వాత గుండె సమస్య తగ్గటానికి స్టెంటు అమర్చారు. ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?...

Published : 10 May 2022 01:10 IST

సమస్యసలహా

సమస్య: నాకు ఇటీవల కొవిడ్‌ వచ్చి తగ్గింది. తర్వాత గుండె సమస్య తగ్గటానికి స్టెంటు అమర్చారు. ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- వెంకట్‌, హైదరాబాద్‌

సలహా: యాంజియోప్లాస్టీలో రక్తనాళంలో పూడిక ఏర్పడిన చోట బెలూన్‌తో ఉబ్బించి, స్టెంట్‌ అమరుస్తారు. దీన్ని అమర్చిన తర్వాత క్రమం తప్పకుండా మందులు.. ముఖ్యంగా రక్తాన్ని పలుచగా ఉంచే మందులు వేసుకోవాలి. ఏడాది వరకు రెండు రకాల మందులు, ఆ తర్వాత ఒక మందును జీవితాంతం వాడుకోవటం తప్పనిసరి. కొవిడ్‌ వచ్చి, తగ్గినవారికిది మరింత ముఖ్యం. ఎందుకంటే కొవిడ్‌ వచ్చిన కొందరిలో రక్తం గడ్డకట్టే స్వభావం పెరుగుతోంది. మీరు మందులు వేసుకోవటంతో పాటు రక్తనాళంలో పూడికలు ఏర్పడటానికి దోహదం చేసే అంశాలనూ అదుపులో ఉంచుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం వంటివి ఉన్నట్టయితే కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. పొగ తాగే అలవాటుంటే మానెయ్యాలి. సాధారణంగా గుండెజబ్బుల బారినపడ్డవారికి వ్యాయామాలు చేయాలని చెబుతుంటాం. కానీ కొవిడ్‌ తగ్గిన తర్వాత బలహీనత వంటివి వేధిస్తుంటాయి. కాబట్టి కొవిడ్‌ తగ్గాక నెల, రెండు నెలల వరకు కఠినమైన వ్యాయామాలు చేయటం తగదు. నడక వంటి తేలికైనవి చేసుకోవచ్చు.


తరచూ ఆయాసం వస్తోందేం?

సమస్య: నాకు 80 ఏళ్లు, తరచూ ఆయాసంతో ఇబ్బంది పడుతున్నాను. బీపీ, షుగర్‌ లేవు. ఏం చెయ్యాలి?

- భిక్షపతి, హైదరాబాద్‌

సలహా: గుండె రక్తనాళాల్లో పూడికలున్నా, గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గినా ఆయాసం రావొచ్చు. ఊపిరితిత్తుల సమస్యతోనూ వస్తుండొచ్చు. గుండె, ఊపిరితిత్తులు బాగున్నా హిమోగ్లోబిన్‌ తగ్గటం, థైరాయిడ్‌ సమస్యల వంటి ఇతరత్రా కారణాలూ ఉండొచ్చు. అందువల్ల ఇంతకు ముందు లేకుండా కొత్తగా ఆయాసం వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించి, కారణాన్ని తెలుసు కోవటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని