అలర్జీకి కొత్త చికిత్స

పుప్పొడి, పెంపుడు జంతువుల నూగు, తవిటి పురుగులు, చెమ్మ వంటివి కొందరికి పడవు. వీటితో కూడిన గాలిని పీల్చుకున్నప్పుడు అలర్జీ ప్రేరేపితమవుతుంది.

Published : 21 Feb 2023 00:27 IST

పుప్పొడి, పెంపుడు జంతువుల నూగు, తవిటి పురుగులు, చెమ్మ వంటివి కొందరికి పడవు. వీటితో కూడిన గాలిని పీల్చుకున్నప్పుడు అలర్జీ ప్రేరేపితమవుతుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, ముక్కు దురద, తుమ్ములు మొదలవుతాయి. దీనికి కారణం రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రేరేపితం కావటం. దీంతో బాధపడేవారిలో కొందరికి అలర్జీ సూదిమందు ఇస్తుంటారు. వీటి ద్వారా అలర్జీ కారకాలను పెద్ద మోతాదులో ఇస్తారు. దీంతో రోగనిరోధక వ్యవస్థ క్రమంగా వీటికి ప్రతిస్పందించకుండా ఉండటం నేర్చుకుంటుంది. దురదృష్టవశాత్తూ అలర్జీ ఇంజెక్షన్లు అందరికీ పనిచేయవు. పైగా వీటిని కనీసం మూడేళ్లయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు కొత్తరకం చికిత్సను రూపొందించారు. అలర్జీ ఇంజెక్షన్లతో పాటు పరిశోధనశాలలో తయారుచేసిన ఔషధాన్ని కలిపి ఇవ్వటం దీనిలోని కీలకాంశం. ఇది శరీరంలో అలర్జీ ప్రతిస్పందనలను ప్రేరేపించే పదార్థాలను అడ్డుకుంటుంది. ఈ కొత్త చికిత్సను పిల్లి అలర్జీతో బాధపడేవారిపై పరీక్షించి చూశారు. అలర్జీ ఇంజెక్షన్లు మాత్రమే తీసుకున్నవారితో పోలిస్తే.. రెండింటినీ కలిపి తీసుకున్నవారిలో మరింత మంచి ఫలితం కనిపించింది. పిల్లికి సంబంధించిన ప్రొటీన్లకు గురైనా కూడా వీరిలో తక్కువ లక్షణాలు పొడసూపాయి. చికిత్సలు ఆపిన ఏడాది తర్వాత అలర్జీ ఇంజెక్షన్ల ప్రభావం క్షీణిస్తూ వచ్చింది. ప్రయోగాత్మక చికిత్స అయితే ఇంకా పనిచేస్తుండటం, లక్షణాలు తగ్గుముఖం పట్టటం గమనార్హం. ఈ కొత్త పద్ధతిని ఆహార అలర్జీల మీదా ప్రయోగించి చూడాలని పరిశోధకులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని