ఆ మందులు వేసుకుంటున్నారా?

గుండెపోటు, పక్షవాతం ముప్పు గలవారు రక్తాన్ని పలుచగా చేసే మందులు వేసుకుంటుంటారు. ఇవి రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడకుండా చూస్తాయి. వీటిని వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated : 20 Jun 2023 11:03 IST

గుండెపోటు, పక్షవాతం ముప్పు గలవారు రక్తాన్ని పలుచగా చేసే మందులు వేసుకుంటుంటారు. ఇవి రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడకుండా చూస్తాయి. వీటిని వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


దెబ్బలు తగిలించుకోవద్దు

రక్తాన్ని పలుచగా చేసే మందుల మూలంగా రక్తస్రావం త్వరగా ఆగదు. దీంతో చిన్న దెబ్బలైనా తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి ఒకరితో ఒకరు ఢీకొనే ఆటల వంటివి ఆడొద్దు. దెబ్బలు తగిలించుకోవద్దు. నడక, ఈత వంటి సురక్షితమైన వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా తలను జాగ్రత్తగా చూసుకోవాలి. బైక్‌ మీద ప్రయాణం చేసేటప్పుడు విధిగా హెల్మెట్‌ ధరించాలి.


రోజూ ఒకే వేళకు

రోజూ ఒకే సమయానికి మందు వేసుకోవాలి. ఎందుకంటే వేళకు వేసుకోకపోతే కొన్నిరకాల మందులు సరిగా పనిచేయవు. ఒకవేళ మరచిపోతే గుర్తుకొచ్చినప్పుడు వీలైనంత త్వరగా వేసుకోవాలి. మర్నాటి వరకూ గుర్తుకు రాకపోతే ఏం చేయాలో డాక్టర్‌ను అడగాలి. ఒకేసారి రెండు మాత్రలు వేసుకోవద్దు.


కోసేటప్పుడు జాగ్రత్త

కత్తితో కూరగాయలు, పండ్ల వంటివి కోసేటప్పుడు జాగ్రత్త. చిన్నగా గీసుకున్నా ఎక్కువ రక్తస్రావం కావొచ్చు. కాబట్టి కత్తితో కోసేటప్పుడు చేతులకు గ్లవుజులు వేసుకోవాలి. షేవింగ్‌ చేసుకునేప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వీలైతే ట్రిమ్మర్‌ వాడుకోవాలి. గోళ్లను మరీ దగ్గరకు కత్తిరించుకోవద్దు. ఎప్పుడైనా కోసుకుపోతే రక్తం ఆగేంతవరకు గట్టిగా అదిమి పట్టాలి. అప్పటికీ ఆగకపోతే ఆసుపత్రికి వెళ్లాలి.


విటమిన్‌ కె మీద కన్ను

పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్‌ కె దండిగా ఉంటుంది. ఇది మరీ ఎక్కువైతే వార్‌ఫారిన్‌ లాంటి మందులు సమర్థంగా పనిచేయవు. అందువల్ల విటమిన్‌ కె లభించే పదార్థాలను ఎంతవరకు తినాలో డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి.


తరచూ రక్తపరీక్ష

రక్తాన్ని పలుచబరచే మందులు వేసుకునేటప్పుడు ఎంత త్వరగా రక్తం గడ్డ కడుతుందో తెలుసుకోవటానికి తరచూ పరీక్ష చేయించుకోవాలి. దీని ఆధారంగా డాక్టర్‌ అవసరమైతే మందు మోతాదు మారుస్తారు. లేదా వేరే మందు సూచిస్తారు.


ముందే చెప్పాలి

ఏ డాక్టర్‌ దగ్గరికి వెళ్లినా రక్తాన్ని పలుచబరచే మందులు వేసుకుంటున్నామని ముందే చెప్పాలి. దీంతో మందులు రాసేటప్పుడు, చికిత్సలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు. మందు పేరును రాసుకొని జేబులో పెట్టుకోవాలి. అత్యవసర సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది.


దంతధావన సున్నితంగా

చిగుళ్లు చాలా మృదువుగా ఉంటాయి. తేలికగా రక్తస్రావయ్యే ప్రమాదముంది. కాబట్టి పళ్లను సున్నితంగా తోముకోవాలి. మృదువైన బ్రష్‌ వాడుకోవాలి. గట్టిగా రుద్దొద్దు. పళ్ల డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు మీరు వాడుతున్న మందుల గురించి చెప్పాలి. అవసరమైతే చికిత్స చేసేటప్పుడు రక్తస్రావాన్ని తగ్గించే మందులు ఇస్తారు.


దుష్ప్రభావాలు గమనించాలి

రక్తాన్ని పలుచబరచే మందులతో కొన్నిసార్లు చిగుళ్ల నుంచి రక్తం రావటం, చర్మం కమలటం, మగత, మామూలుగా కన్నా రుతుస్రావం ఎక్కువగా అవటం, మలంలో లేదా మూత్రంలో రక్తం ఆనవాళ్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. ఇలాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు