టైప్‌ 1 మధుమేహం నివారణ దిశగా..

జీవనశైలిలో ముడిపడిన టైప్‌ 2 మధుమేహాన్ని నివారించుకోవచ్చు. దీని బారినపడ్డవారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుంటుంది గానీ కణాలు దీనికి అంతగా స్పందించవు.

Published : 08 Aug 2023 00:13 IST

జీవనశైలిలో ముడిపడిన టైప్‌ 2 మధుమేహాన్ని నివారించుకోవచ్చు. దీని బారినపడ్డవారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుంటుంది గానీ కణాలు దీనికి అంతగా స్పందించవు. ఫలితంగా గ్లూకోజు కణాల్లోకి చేరుకోదు. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగిపోతాయి. ఇక టైప్‌ 1 మధుమేహుల్లో ఇన్సులిన్‌ ఉత్పత్తి కాదు. వీరిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథి మీద దాడి చేసి (ఆటోఇమ్యూన్‌) ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ఐలెట్‌ కణాలను దెబ్బతీస్తుంది. ఈ రకం మధుమేహం చాలావరకు చిన్న వయసులోనే మొదలవుతుంటుంది. ప్రస్తుతానికి దీన్ని నివారించుకునే మార్గమేదీ లేదు. అయితే స్క్రిప్స్‌ రీసెర్చ్‌ సంస్థ అధ్యయనం ఈ విషయంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రక్తంలోని టి కణాలను విశ్లేషించటం ద్వారా టైప్‌ 1 మధుమేహం ముప్పు గలవారిని గుర్తించే అవకాశముందని పరిశోధకులు గుర్తించటం విశేషం. తదుపరి అధ్యయనాల్లో ఇది ప్రామాణికమని తేలితే ఆటోఇమ్యూన్‌ ప్రక్రియను ఆపే చికిత్సకు సరిపోయిన వారిని గుర్తించటానికి దీన్ని వాడుకోవచ్చని, టైప్‌ 1 మధుమేహాన్ని నివారించదగినదిగా మార్చొచ్చని ఆశిస్తున్నారు. పరిశోధకులు ఈ రకం మధుమేహానికి కారణమయ్యే సీడీ4 టి కణాలను ఎలుకలు, మనుషుల రక్తం నుంచి సంగ్రహించి, విశ్లేషించారు. దీని ద్వారా ఆటోఇమ్యూనిటీ ప్రక్రియ చురుకుగా ఉండటాన్ని, లేకపోవటాన్ని నూటికి నూరు శాతం వేరు చేయగలిగారు. టైప్‌ 1 మధుమేహం విషయంలో దీన్ని గొప్ప ముందడుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పరీక్షతో మధుమేహాన్ని నివారించుకోవటానికి లేదా చాలాకాలం ఆలస్యం చేయటానికి అవకాశం లభిస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన లుక్‌ టీటన్‌ చెబుతున్నారు. టైప్‌ 1 మధుమేహానికి కారణమయ్యే ఆటోఇమ్యూన్‌ ప్రక్రియ దీర్ఘకాలంగా సాగుతూ వస్తుంటుంది. ఇది చాలాసార్లు ఆగుతూ, కొనసాగుతూ వస్తుంది. అయితే ఇదెలా మొదలవుతుందనేది కచ్చితంగా తెలియదు. జన్యుపరమైన అంశాలు, తరచూ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేయటం దీనికి కారణం కావొచ్చని అనుకుంటున్నారు. టైప్‌ 1 మధుమేహం గలవారు జీవితాంతం ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఐలెట్‌ కణాలు దెబ్బతినకుండా రోగనిరోధక శక్తిని అణచివేసే చికిత్సకు గత సంవత్సరం అమెరికా ఎఫ్‌డీఏ అనుమతించింది. అయితే ఈ చికిత్స ఎవరికి ఉపయోగపడుతుందో గుర్తించటం అంత తేలిక కాదు. యాంటీ ఐలెట్‌ యాంటీబాడీల మోతాదులను గుర్తించటం ద్వారా ఇలాంటి వారిని ఎంచుకుంటున్నారు. కానీ ఆటోఇమ్యూన్‌ ప్రక్రియ పురోగతిని గుర్తించటానికి ఈ యాంటీబాడీ ప్రతిస్పందన అంత కచ్చితమైంది కాదు. ప్రాథమికంగా చూస్తే టైప్‌ 1 మధుమేహం టి కణాలతోనే ప్రేరేపితమవుతుంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని