కిడ్నీలు పదిలం!

రక్తంలోంచి వ్యర్థాలను, విషతుల్యాలను వడపోస్తాయి. మూత్రం రూపంలో వాటిని బయటకు వెళ్లగొడతాయి. అందుకే కిడ్నీలకు అంత ప్రాధాన్యం.

Updated : 03 Oct 2023 07:20 IST

రక్తంలోంచి వ్యర్థాలను, విషతుల్యాలను వడపోస్తాయి. మూత్రం రూపంలో వాటిని బయటకు వెళ్లగొడతాయి. అందుకే కిడ్నీలకు అంత ప్రాధాన్యం. ఇవి లేకపోతే శరీరం చెత్త కుప్పలా తయారవుతుంది. వీటిని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని మందులతో చిక్కు: ఐబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులు కిడ్నీలను దెబ్బతీయొచ్చు. వీటిని ఒకేసారి పెద్దమొత్తంలో వేసుకున్నా, తరచూ వేసుకుంటున్నా ప్రమాదమే. జీర్ణాశయంలో పుండ్లు, ఛాతీలో మంట తగ్గటానికి వేసుకునే ఒమిప్రజోల్‌ వంటి పీపీఐ రకం మందులను దీర్ఘకాలం వాడినా కిడ్నీ జబ్బు ముప్పు పెరగొచ్చు. యాంటీబయాటిక్‌ మందులను తరచూ వాడినా ఇబ్బందే. ఆరోగ్యంగా ఉన్నవారిలో చిక్కులు తెచ్చిపెట్టటమే కాదు.. అప్పటికే కిడ్నీలు సరిగా పనిచేయనివారికి మరింత తీవ్రంగా పరిణమిస్తాయి. ముఖ్యంగా పెన్సిలిన్‌, సల్ఫోనమైడ్స్‌, సెఫలోస్పారిన్స్‌ వంటి యాంటీబయాటిక్‌ మందులు చిక్కులు తెచ్చి పెట్టొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. డాక్టర్‌ సలహా లేకుండా, అనవసరంగా మందులు వాడొద్దు.

మంచి ఆహారం:  మనం తినే పదార్థాలు, తాగే పానీయాలన్నీ జీర్ణమయ్యాక రక్తం ద్వారా కిడ్నీలకు చేరుకుంటాయి. శరీరానికి హాని కలిగించే కొవ్వు, ఉప్పు, చక్కెరలనూ ఇవి శుద్ధి చేస్తాయి. వీటిని ఎక్కువగా తింటే అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకూ దారితీస్తుంది. ఇవి కిడ్నీలకూ చేటు చేస్తాయి. కాబట్టి కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలతో కూడిన మంచి ఆహారం ఎక్కువగా తినాలి.

తగినంత నీరు: ముఖ్యమైన పోషకాలు కిడ్నీలకు చేరుకునేలా, మూత్రం రూపంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోయేలా చేయటానికి నీరు తోడ్పడుతుంది. తగినంత నీరు తాగకపోతే కిడ్నీల్లో రక్తాన్ని శుద్ధిచేసే నెఫ్రాన్లు పనిచేయటం మానేస్తాయి. ఒంట్లో నీటిశాతం తరచూ తగ్గుతుంటే కిడ్నీలు దెబ్బతినొచ్చు. కాబట్టి దాహం వేసినంతవరకూ ఆగకుండా మధ్యమధ్యలో నీళ్లు తాగటం మంచిది. ఒకవేళ వేడి వాతావరణంలో ఉంటే ఇంకాస్త ఎక్కువగానూ తాగాలి.

వ్యాయామం మేలు: మంచి ఆహారం మాదిరిగానే వ్యాయామమూ గుండె జబ్బు, మధుమేహం నివారణకు తోడ్పడుతుంది. పరోక్షంగా కిడ్నీ జబ్బు ముప్పూ తగ్గుతుంది. అలాగని వెంటనే జిమ్‌లకు వెళ్లి, భారీ కసరత్తులు చేస్తారేమో. ఇది తగదు. శక్తికి మించిన.. ముఖ్యంగా ఉన్నట్టుండి అతిగా వ్యాయామం చేయటమూ కిడ్నీలను దెబ్బతీయొచ్చు. కాబట్టి నెమ్మదిగా వ్యాయామాలు ఆరంభించాలి. రోజుకు కనీసం అరగంట సేపైనా నడవటం, సైకిల్‌ తొక్కటం, ఈత కొట్టటం వంటివి చేయాలి.

పరీక్షలు ముఖ్యం: కిడ్నీ జబ్బు ముప్పును తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇంట్లో ఎవరైనా గుండెజబ్బు, అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వైఫల్యం గలవారుంటే ఇది మరింత ప్రధానం. కిడ్నీ పనితీరును తెలిపే పరీక్షలతో జబ్బులను ముందుగానే పట్టుకోవచ్చు. పరిస్థితి చేజారకుండా చూసుకోవచ్చు.

పొగ తాగొద్దు: పొగ తాగటం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. అధిక రక్తపోటు గలవారికైతే పొగ తాగటం మరింత చేటు చేస్తుంది. ఇది మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణలో లేకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువవుతుంది. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. మద్యం ఒంట్లో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా కిడ్నీల మీద విపరీత ప్రభావం పడుతుంది. మద్యంతో తలెత్తే సమస్యలూ కిడ్నీలను దెబ్బతీస్తాయి.

ఉప్పు మీద కన్ను: ఉప్పు ఒక్కొక్కరి మీద ఒక్కోలా ప్రభావం చూపుతుంది. కొందరిలో మూత్రంలో సుద్ద ఎక్కువయ్యేలా చేయొచ్చు. కిడ్నీల పనితీరు తగ్గటానికిది పెద్ద కారణం. అప్పటికే కిడ్నీ జబ్బుంటే పరిస్థితి ఇంకాస్త విషమిస్తుంది కూడా. ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు పెరగొచ్చు. ఇదీ కిడ్నీల మీద మరింత భారం పడేలా చేస్తుంది. కిడ్నీల్లో రక్తాన్ని శుద్ధిచేసే భాగాలు దెబ్బతినొచ్చు. దీంతో ద్రవాల నియంత్రణ అస్తవ్యస్తమై రక్తపోటు మరింత ఎక్కువవుతుంది. ఇలా ఉప్పు రెండిందాలా చేటు చేస్తుంది. కాబట్టి మితిమీరకుండా చూసుకోవటం ముఖ్యం.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని