మొటిమల గుంతలు పోతాయా?

సమస్య: నాకు 24 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ముఖం మీద రెండు పెద్ద మొటిమలు వచ్చి, తగ్గాయి. కానీ అక్కడ గుంతలు పడ్డాయి. వీటిని లేజర్‌ చికిత్సతో సగం వరకు తగ్గించొచ్చని ఒక డాక్టర్‌ చెప్పారు. ఇది నిజమేనా? చికిత్స ఫలితాలు శాశ్వతంగా ఉంటాయా? లేజర్‌ చికిత్సతో ఇతర సమస్యలేవైనా వస్తాయా? ఇంకా ఏమైనా చికిత్సలున్నాయా?

Updated : 15 Mar 2022 06:14 IST

సమస్య: నాకు 24 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ముఖం మీద రెండు పెద్ద మొటిమలు వచ్చి, తగ్గాయి. కానీ అక్కడ గుంతలు పడ్డాయి. వీటిని లేజర్‌ చికిత్సతో సగం వరకు తగ్గించొచ్చని ఒక డాక్టర్‌ చెప్పారు. ఇది నిజమేనా? చికిత్స ఫలితాలు శాశ్వతంగా ఉంటాయా? లేజర్‌ చికిత్సతో ఇతర సమస్యలేవైనా వస్తాయా? ఇంకా ఏమైనా చికిత్సలున్నాయా?

- వి.శివశ్రీ (ఈమెయిల్‌)

సలహా: పెద్ద మొటిమలను గిల్లినప్పుడు ఇలాంటి గుంతలు ఏర్పడటం చూస్తుంటాం. వీటిని లేజర్‌ చికిత్సతో తగ్గించొచ్చు. ఇందులో గుంతలకు చుట్టుపక్కల చర్మాన్ని కొద్దిగా సవరిస్తారు. దీంతో పైపొర మందం తగ్గి, చర్మం చదునుగా అవుతుంది. గుంతల లోతు తగ్గినట్టు కనిపిస్తుంది. కొన్ని లేజర్లు గుంతల అడుగున కండర పోచలు (కొలాజెన్‌) కుచించుకుపోయేలా చేస్తాయి. దీంతో కొలాజెన్‌ పైకి లేచి గుంత లోతు తగ్గుతుంది. లేజర్‌ చికిత్సలతో సుమారు 30% వరకు గుంతలు తగ్గే అవకాశముంది. ఫలితం శాశ్వతంగానే ఉంటుంది. అయితే లేజర్‌ చికిత్స ఒక్కసారితో పూర్తవదు. కొందరికి ఏడెనిమిది సార్లయినా చేయాల్సి రావచ్చు. ఎక్కువ సమయం పడుతుంది. ఖర్చూ ఎక్కువే. ప్రస్తుతం లేజర్‌తో సమానంగా పనిచేసే నానో ఫ్యాట్‌ గ్రాఫ్టింగ్‌ చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఆయా వ్యక్తుల కొవ్వునే గ్రహించి, ద్రవంగా మార్చి గుంతల కింద సూదితో ఇంజెక్ట్‌ చేస్తారు. ఇది గుంతల అడుగున కొలాజెన్‌ను కుంచించుకుపోయేలా చేసి, దాన్ని పునరుత్తేజితం చేస్తుంది. ఈ చికిత్సను ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మరీ అవసరమైతే డెర్మబ్రేషన్‌ చికిత్స చేయించుకోవచ్చు. ఇందులో ప్రత్యేకమైన పరికరంతో చర్మం పైపొరను చెక్కి, తొలగిస్తారు. ఇది కొంతవరకు లేజర్‌ మాదిరిగానే పనిచేస్తుంది. కాకపోతే కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. కనీసం 10 రోజులైనా ఇంటి పట్టునే ఉండాల్సి రావచ్చు. దీంతో దాదాపు 50% వరకు గుంతలు తగ్గుతాయి. మీరు కాస్మెటిక్‌, చర్మ నిపుణులను సంప్రదిస్తే అవసరమైన చికిత్స చేస్తారు.


చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ,  ఈనాడు కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని