సిరల ఉబ్బు పూర్తిగా పోతుందా?

నా రెండు కాళ్లకు చాలాకాలంగా సిరలు ఉబ్బి (వెరికోజ్‌ వీన్స్‌) ఉన్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే లేజర్‌ శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. దీంతో సమస్య పూర్తిగా తగ్గుతుందా? లేదా?

Updated : 06 Feb 2024 03:30 IST

సమస్యసలహా

సమస్య: నా రెండు కాళ్లకు చాలాకాలంగా సిరలు ఉబ్బి (వెరికోజ్‌ వీన్స్‌) ఉన్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే లేజర్‌ శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. దీంతో సమస్య పూర్తిగా తగ్గుతుందా? లేదా?

 - బి.పాపారావు, విజయనగరం

సలహా: కాలి సిరల్లో రక్తాన్ని పైకి మాత్రమే ప్రవహించేలా చేసే ప్రత్యేక కవాటాలుంటాయి. అందువల్ల రక్తం కిందికి జారదు. ఇవి బలహీనపడితే రక్తం అక్కడే పోగుపడుతుంది. దీంతో సిరలు ఉబ్బిపోయి, నల్లగా పాము మెలి తిరిగినట్టుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు రక్తం కిందికీ ప్రవహించొచ్చు. వెరికోజ్‌ వీన్స్‌ను లేజర్‌ శస్త్రచికిత్సతో సరిచేయొచ్చు. ఇందులో చర్మానికి చిన్న కోత పెట్టి తీగను, దీని ద్వారా లేజర్‌ ఫైబర్‌ను సిరలోకి పంపిస్తారు. ఈ ఫైబర్‌ ద్వారా బలహీన పడిన కవాట భాగంలో ఉష్ణాన్ని వెలువరిస్తారు. దీంతో అక్కడున్న ప్రొటీన్లు గడ్డకడతాయి. ఫలితంగా దెబ్బతిన్న, బలహీన పడిన కవాట ప్రాంతం మూసుకుపోతుంది. రక్తం వెనక్కి మళ్లటం ఆగుతుంది. లోపల పీడనం తగ్గి సిరలు ఉబ్బటం ఆగిపోతుంది. కాళ్లలో నొప్పులు, చిరచిర వంటి ఇబ్బందులు తగ్గుతాయి. నల్లగా అవటం, ఉబ్బు, పుండ్లు పడటం వంటివేవీ ఉండవు. అయితే సమస్య పూర్తిగా తగ్గుతుందా? తిరిగి వస్తుందా? అనేది వెరికోజ్‌ వీన్స్‌ రావటానికి దోహదం చేసే అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. నూటికి 98% మందికి కవాటాలు బలహీనపడటం తప్ప వేరే కారణాలేవీ కనిపించవు. కానీ కొందరికి లోపలి సిరల్లో అడ్డంకులు (డీవీటీ).. సిరలు, ధమనులు కలిసిపోవటం.. పొట్టలో బాగా ఒత్తిడి ఉండటం వంటి ఇతరత్రా కారణాలతోనూ వెరికోజ్‌ వీన్స్‌ రావొచ్చు. ఇలాంటివి గలవారిలో సమస్య తిరగబెట్టే అవకాశముంది. ఒక్కోసారి లేజర్‌ చికిత్స చేసినప్పుడు తగినంత ఉష్ణోగ్రత వెలువడకపోయినా మళ్లీ రావొచ్చు. చికిత్స చేయించుకున్నాక జీవనశైలిని మార్చుకోవటమూ ముఖ్యమే. గంటల కొద్దీ నిలబడటం, బిగుతైన దుస్తులు వేసుకోవటం, పెద్ద బరువులు ఎత్తటం వంటివి మానెయ్యాలి. వీటితో కడుపులో ఒత్తిడి పెరిగి, మళ్లీ వెరికోజ్‌ వీన్స్‌ వచ్చే అవకాశముంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చికిత్సను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

డా।। పింజల రామకృష్ణ, వాస్క్యులర్‌ సర్జన్‌


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మా ఈమెయిల్‌ sukhi@eenadu.in  కు పంపొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని