పీఆర్‌పీతో నడుంనొప్పి తగ్గుతుందా?

నాకు 50 ఏళ్లు. నడుం నొప్పితో బాధపడుతున్నాను. దీనికి పీఆర్‌పీ చికిత్స ఉందని తెలిసింది. దీన్ని తీసుకోవచ్చా? నాకు ఉపయోగపడుతుందా? దుష్ప్రభావాలేవైనా ఉంటాయా?

Updated : 13 Feb 2024 04:08 IST

 సమస్య: నాకు 50 ఏళ్లు. నడుం నొప్పితో బాధపడుతున్నాను. దీనికి పీఆర్‌పీ చికిత్స ఉందని తెలిసింది. దీన్ని తీసుకోవచ్చా? నాకు ఉపయోగపడుతుందా? దుష్ప్రభావాలేవైనా ఉంటాయా?

 - ఎన్‌. సత్య (ఈమెయిల్‌)
సలహా: నడుంనొప్పికి వెన్ను పూసలు అరగటం, పూసల మధ్యలోని డిస్కు జారి నాడులను నొక్కటం, కండరాల ఇబ్బందుల వంటి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. అందువల్ల ముందుగా కారణమేంటన్నది తెలుసుకోవటం ముఖ్యం. డిస్కు నాడులను నొక్కటం వల్ల నొప్పితో పాటు కాళ్లలో తిమ్మిర్లు, చెప్పులు జారటం వంటివి ఉన్నట్టయితే వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చాలాకాలంగా నడుం నొప్పి వేధిస్తుంటే ఆ భాగంలో స్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇస్తే ఉపశమనం కలుగుతుంది. ఇవి 8 వారాల నుంచి 3 నెలల వరకు పనిచేస్తాయి. ఇటీవల ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్‌పీ) చికిత్స అందుబాటులోకి వచ్చింది. రక్తం నుంచి ప్లేట్‌లెట్లతో కూడిన ప్లాస్మా ద్రవాన్ని వేరుచేసి, సిరంజి ద్వారా ఆయా భాగాల్లోకి ఇవ్వటం దీనిలోని కీలకాంశం. ఇందులో వృద్ధి కారకాలు దండిగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న భాగం త్వరగా మరమ్మత్తు కావటానికి తోడ్పడతాయి. డిస్కు నొక్కుకోవటమూ గాయం వంటిదే కాబట్టి పీఆర్‌పీ దీన్ని మరమ్మతు చేయటం ద్వారా నొప్పిని తగ్గించొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ చికిత్స ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. డిస్కు అరుగుతున్న తొలిదశలో ఇస్తే పనిచేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలేమీ ఫలితం ఉండటం లేదని మరికొన్ని అధ్యయనాలూ వివరిస్తున్నాయి. కాబట్టి మీరు వెంటనే నొప్పి తగ్గాలంటే ఇతర చికిత్సలను తీసుకోవటం మంచిది. ఒకవేళ పరిశోధనల్లో భాగంగా పీఆర్‌పీ చికిత్స తీసుకుంటున్నానని భావిస్తే మాత్రం ప్రయత్నించొచ్చు. ఇది పనిచేస్తుందా? లేదా? అనేది కచ్చితంగా చెప్పలేం. పెద్దఎత్తున నిర్వహించే ప్రయోగాల్లోనే దీని సామర్థ్యం బయటపడుతుంది. ఆ తర్వాతే మార్గదర్శకాలు రూపొందించి, అవసరమైనవారికి ఇవ్వటానికి అనుమతిస్తారని తెలుసుకోవాలి.


-డా।। కొల్లా సాకేత్‌, ఆర్థోపెడిక్‌ సర్జన్‌, గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మా ఈమెయిల్‌ sukhi@eenadu.in  కు పంపొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని