జ్ఞాపకాలకు కొవ్వు అండ

జ్ఞాపకాలు ఏర్పడటంలో మెదడులోని కొవ్వు ఆమ్లాలు, వీటిని నియంత్రించే జన్యువులు కీలకపాత్ర పోషిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌ పరిశోధకులు తొలిసారి గుర్తించారు

Published : 13 Feb 2024 03:52 IST

జ్ఞాపకాలు ఏర్పడటంలో మెదడులోని కొవ్వు ఆమ్లాలు, వీటిని నియంత్రించే జన్యువులు కీలకపాత్ర పోషిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌ పరిశోధకులు తొలిసారి గుర్తించారు. ఇది జ్ఞాపకాలు ఏర్పడే తీరును అర్థం చేసుకోవటానికే కాకుండా నాడీ సమస్యలకు కొత్త చికిత్సల తయారీకి తోడ్పడగలదని భావిస్తున్నారు. నాడుల మధ్య సమాచారం మార్పిడి అయ్యే సమయంలో మెదడులో సంతృప్త కొవ్వుల మోతాదులు పెరుగుతున్నట్టు పరిశోధకులు గతంలోనే నిరూపించారు. కానీ దీనికి కారణమేంటన్నది అప్పట్లో తెలియరాలేదు. నాడులు జ్ఞాపకాలను విడమరచుకునేటప్పుడు మెదడు కొవ్వు ఆమ్లాల తీరుతెన్నుల్లో మార్పులు సంభవిస్తున్నట్టు తాజాగా గుర్తించారు. ఎస్‌టీఎక్స్‌బీపీ1 అనే నాడీ సంధి వద్ద ఫాస్ఫోలైపేజ్‌ ఏ1 (పీఎల్‌ఏ1) అనే ఎంజైమ్‌ మరో ప్రొటీన్‌తో చర్య జరపటం వల్ల సంతృప్త కొవ్వులు ఏర్పడుతున్నట్టు కనుగొన్నారు. మెదడు బరువులో 60% వరకూ కొవ్వు ఆమ్లాలే ఉంటాయి. ఇవి ఫాస్ఫోలిపిడ్స్‌ అనే కొవ్వు తయారీకి తోడ్పడతాయి. జ్ఞాపకాల విషయంలో ఇవే కీలకం. పీఎల్‌ఏ1, ఎస్‌టీఎక్స్‌బీపీ1 జన్యువుల్లో తలెత్తే మార్పుల మూలంగా ఈ కొవ్వు ఆమ్లాల మోతాదులు తగ్గుతున్నాయని, ఇవి అల్జీమర్స్‌ వంటి నాడీ సమస్యలకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని గుర్తించటానికి పీఎల్‌ఏ1 జన్యువును తొలగించిన ఎలుకల మీదా ప్రయోగాలు చేశారు. జ్ఞాపకాలు దెబ్బతినటం ఆరంభం కావటాని కన్నా ముందే వీటిల్లో కొవ్వు ఆమ్లాల మోతాదులు పడిపోతున్నట్టు తేలటం గమనార్హం. జ్ఞాపకాలు కుదురుకోవటంలో పీఎల్‌ఏ1 జన్యువు, కొవ్వు ఆమ్లాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు ఇది సూచిస్తోంది. అల్జీమర్స్‌ వంటి జబ్బులకు కొత్త చికిత్సల రూపకల్పనకిది దారితీయగలదని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని