హా... స్ట్రేలియా! ..అంతా మీ వల్లే!

ఆస్ట్రేలియా విస్తరిస్తున్న కార్చిచ్చు గురించి వింటూనే ఉన్నారుగా... ఎకరాలెకరాల అడవుల్ని మింగేస్తుంది.. కోట్ల జీవుల్ని పొట్టనపెట్టుకుంటోంది.. ఆ మంటల్లో కాలిపోతామేమోనని భయం భయంగా బతికేస్తున్నాయి అక్కడుంటే జీవులు... ఆ మంటలు లేని ఓ పార్కుకు వెళ్లాడు మన కిట్టూ.. అందులో ఒక కంగారుగా కనిపించింది...దాన్ని ఊరడించి చాలాసేపు మాట్లాడేశాడు... ఇంతకీ ఆ సంగతులేంటో మనమూ వినేద్దామా?...

Published : 10 Jan 2020 00:59 IST

ఆస్ట్రేలియా విస్తరిస్తున్న కార్చిచ్చు గురించి వింటూనే ఉన్నారుగా... ఎకరాలెకరాల అడవుల్ని మింగేస్తుంది.. కోట్ల జీవుల్ని పొట్టనపెట్టుకుంటోంది.. ఆ మంటల్లో కాలిపోతామేమోనని భయం భయంగా బతికేస్తున్నాయి అక్కడుంటే జీవులు... ఆ మంటలు లేని ఓ పార్కుకు వెళ్లాడు మన కిట్టూ.. అందులో ఒక కంగారుగా కనిపించింది...దాన్ని ఊరడించి చాలాసేపు మాట్లాడేశాడు... ఇంతకీ ఆ సంగతులేంటో మనమూ వినేద్దామా?

కిట్టూ: హాయ్‌... కంగారూ! నా పేరు కిట్టూ. మీ రూపమంటే నాకు భలే ఇష్టం. అందుకే మిమ్మల్ని చూడ్డానికి ఎంతో దూరం నుంచి వచ్చా?

కంగారూ: థాంక్యూ కిట్టూ. కానీ నువ్వు మళ్లీ వచ్చేసరికి మేమంటూ ఇక్కడ ఉంటామో లేదో మరి.

కిట్టూ: ఎందుకలా అంటున్నావు?

కంగారూ: నీకు తెలిసే ఉంటుందిగా. ఇదిగో పోయిన ఏడాది నవంబరు నుంచి మమ్మల్ని కష్టాలు చుట్టుముట్టాయి. అప్పటి నుంచే బుష్‌ఫైర్‌ మమ్మల్ని బూడిద చేస్తోంది. ఎలాగోలా నేను తప్పించుకున్నా. కానీ అది నా వరకూ వచ్చేట్టే అనిపిస్తోంది.

కిట్టూ: నాకూ బాధగా ఉంది...

కంగారూ: మేమున్న ఆస్ట్రేలియాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ మనుషుల జనాభా కన్నా మా సంఖ్యే ఎక్కువ. ఆస్ట్రేలియా అనగానే మీకు మేమే గుర్తుకు వస్తాం. కానీ కోలా, ప్లాటిపస్‌, వోమ్‌బ్యాట్‌, మాకోట్రిస్‌, వాలబీ, సుగర్‌గ్లైడర్‌, టైగర్‌క్యూల్‌, కేన్‌టోడ్‌, ఇన్‌లాన్డ్‌ తైపన్‌, టాస్మేనియన్‌ డెవిల్‌, గోఅన్నా, డింగో.. ఇవన్నీ కేవలం మా ఆస్ట్రేలియాలో మాత్రమే ఉండే జంతువులు. ప్రపంచంలో మరెక్కడా ఉండవ్‌. కానీ పోనుపోను మా ఉనికి ఇక్కడా కనుమరుగయ్యేట్లు ఉంది.

కిట్టూ: ప్ఛ్‌. ధైర్యంగా ఉండండి...

కంగారూ: ధైర్యంగా ఎలా ఉండగలను? కిట్టూ! మీకైతే ఇప్పుడు చలికాలం కదా! కానీ మాకు ఇక్కడ వేసవి. ఎండాకాలం రాగానే మొదలైన ఈ కార్చిచ్చు ఆగకుండా పెరుగుతూనే ఉంది. ఇది ఎంత పెద్ద విపత్తు అంటే... ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కోటీ ఇరవైలక్షల ఎకరాలకు పైనే అడవులు, ఊర్లు, పట్టణాలు కాలిబూడిదైపోయాయి.

కిట్టూ: హా! విన్నా...

కంగారూ: అంతేనా? ఒకటి కాదు.. రెండు కాదు.ఏకంగా దాదాపు 50 కోట్ల జంతువులు మంటల్లో కాలిపోయాయి. న్యూసౌత్‌వేల్స్‌, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ కార్చిచ్చు క్షణాల్లో విస్తరిస్తోంది. అడవుల్లో అయితే గంటకు దాదాపు 10 కిలోమీటర్ల వేగంతో, మైదానాల్లో 20 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తూ అన్నింటినీ నాశనం చేసేస్తోంది. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో! తలుచుకుంటేనే భయమేస్తోంది.

కిట్టూ: అవును. నాకూ అలాగే అనిపిస్తోంది. చాలా వేగంగా గాలులు వీయడం... అవీ చాలా వేడిగా ఉండటంతో ఎంత ప్రయత్నిస్తున్నా.. మంటలు అదుపులోకి రావడం లేదట. ఏకంగా 70 అడుగుల ఎత్తుతో అగ్నికీలలు వేగంగా విస్తరిస్తున్నాయట. అసలే వేసవికాలం.. వాతావరణం అంతా పొడిగా ఉండటంతో ఫైరింజన్లతో ఎంత ప్రయత్నించినా మంటలు ఆరడం లేదట. ఏకంగా విమానాలనే రంగంలోకి దించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు.

కంగారూ: ఇప్పుడు ఏం చేసి ఏం లాభం కానీ ఒక్కమాట చెబుతా. ఏమీ అనుకోకు...

కిట్టూ: ఏమిటది?

కంగారూ: మీ మానవుల వల్లే ఇదంతా. మీరు చేసిన తప్పులతో గ్లోబల్‌ వార్మింగ్‌ పెరిగిపోతోంది. అదే ఈ కార్చిచ్చు ఎక్కువవ్వడానికి కారణమవుతోంది. ప్రతి ఏడాది వందలాది కార్చిచ్చులు వస్తాయి. కానీ ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఎప్పటికన్నా ఒక డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగిందట. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలుల వల్ల మరింత ఎక్కువయ్యాయి.

కిట్టూ: అవునవును. ఆ సంగతి మా శాస్త్రవేత్తలూ తెలుసుకున్నారనుకోండి. కానీ ఏం చేస్తాం?

కంగారూ: అదేంటీ కిట్టూ అలా అంటావ్‌? భూతాపం పెరగకుండా మీరే చూడాలి మరి. భూమి వేడెక్కడానికి మీరు ఏర్పాటు చేసే కర్మాగారాలు, రసాయనిక పరిశ్రమలు కారణం. రిఫ్రిజరేటర్ల నుంచి విడుదలయ్యే క్లోరో ఫ్లోర్‌ కార్బన్లు, టైర్లు, ప్లాస్టిక్‌ కవర్ల వంటి చెత్త తగలబెట్టడం వల్ల విడుదలయ్యే వాయువులూ భూతాపానికి కారణమవుతున్నాయి. ఇంకా ఇలా చెబితే చాలా ఉన్నాయి. అయినా ఇవన్నీ మీకు తెలియనివి కాదు. అందుకే వీటి వాడకం తగ్గిస్తే మీరు మాకు సాయం చేసినట్టే. మాకే కాదు! అప్పుడైతే మనమంతా హాయిగా ఉండొచ్ఛు..

కిట్టూ: అలాగే. తప్పకుండా చేస్తాం. ఇంకా చెట్లు పెంచడంపైనా దృష్టి పెడతాం. మీ మాటగా నా స్నేహితులకీ చెబుతా...

కంగారూ: థాంక్యూ కిట్టూ! ఎలాగైనా ఆ పనిలో ఉండు.

కిట్టూ: సరే. వెళ్లే టైం అయ్యింది. ఇక ఉంటా.. బైబై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని