అసలైన అర్హత ఎవరిది?

శౌర్యపురి యువరాజు రాజ్యాధికారం చేపట్టే సమయానికి రాజ్యంలో అవినీతి పేరుకుపోయింది. ఏ పని జరగాలన్నా లంచం, పలుకుబడి లేనిది కుదిరేది కాదు. దాంతో ప్రజల్లో రాజు మీద విశ్వాసం తగ్గిపోసాగింది. తన పాలన మీద నమ్మకం పెంచుకోవడానికి, అవినీతిని నిరోధించడానికి మంచి తెలివితేటలున్న, నిజాయతీ పరుడిని అధికారిగా నియమించి

Updated : 13 Apr 2021 01:33 IST

శౌర్యపురి యువరాజు రాజ్యాధికారం చేపట్టే సమయానికి రాజ్యంలో అవినీతి పేరుకుపోయింది. ఏ పని జరగాలన్నా లంచం, పలుకుబడి లేనిది కుదిరేది కాదు. దాంతో ప్రజల్లో రాజు మీద విశ్వాసం తగ్గిపోసాగింది. తన పాలన మీద నమ్మకం పెంచుకోవడానికి, అవినీతిని నిరోధించడానికి మంచి తెలివితేటలున్న, నిజాయతీ పరుడిని అధికారిగా నియమించి అవినీతి పరులను కఠినంగా శిక్షించాలనుకున్నాడు. అలా చేస్తే తప్ప రాజ్యంలో ప్రజల మన్నన పొందలేమని గ్రహించి ఆ పదవి కోసం అర్హులైన వ్యక్తుల కోసం రాజ్యంలో మంత్రి వివేక వర్థనుడితో మాట్లాడి చాటింపు వేయించాడు.
చాలామంది పోటీలో పాల్గొనగా వారిలో చివరికి ముగ్గురు మిగిలారు. తెలివి, ధైర్యసాహసాలు, నిజాయతీలోనూ సమ ఉజ్జీలుగా ఉన్నట్లు కనబడ్డారు. వారిలో ఎవరికి పదవి ఇవ్వాలనేది యువరాజు, మంత్రికి సమస్యగా మారింది. యువరాజు ముగ్గురిని అధికారులుగా నియమించి.. సమాన అధికారాలు ఇవ్వడం మంచిదని సూచించాడు. కానీ అందువల్ల వారిలో వారికి అపోహలేర్పడి తమ విధిని సరిగా నిర్వర్తించలేరని, వారి ముగ్గురిలో ఒకర్ని అవినీతి నియంత్రణ అధికారిగా ఎన్నుకునేందుకు తన దగ్గర తగిన ఉపాయం ఉందని మంత్రి చెప్పాడు. మరుసటి రోజు ఆ ముగ్గురిని తన దగ్గరికి రమ్మని విడివిడిగా వర్తమానం పంపాడు.
మంత్రి కోసం ఎదురు చూస్తున్న మొదటివాణ్ని మంత్రి అనుచరుడు పక్కకు పిలిచి.. ‘అవినీతి నియంత్రణ అధికారి స్థానానికి ఎంపికయ్యే అర్హత నీతోపాటు మిగతా ఇద్దరికీ ఉంది. కానీ నువ్వే అధికారి కావాలంటే ఒక మార్గముంది. నువ్వు ఎవ్వరికీ తెలియకుండా నాకు ఓ వెయ్యి వరహాలు ఇచ్చావంటే మంత్రికి నీ గురించి మంచిగా చెప్పి నిన్ను అధికారిని చేసే బాధ్యత నాది’ అన్నాడు. దానికి అతడు ‘అవినీతి నియంత్రణ అధికారి కావడానికి నేను లంచమివ్వాలా.. ఆ ఉద్యోగం చేయడం కన్నా చావడం మేలు’ అని విసురుగా వెళ్లిపోయాడు.
రెండోవాడికి కూడా అలానే చెప్పాడు. రెండో వాడు రహస్యంగా.. ‘చూడు.. వెయ్యి వరహాలు ఇవ్వలేను కానీ ఓ రెండు వందల వరహాలు తగ్గించి ఇస్తా. నాకు ఆ పదవి వచ్చేలా చేయి. అప్పుడప్పుడు నీకు ఖర్చులకూ  వరహాలు ఇస్తుంటా’ అని బేరమాడసాగాడు. దానికి అనుచరుడు ‘సరే.. నాకిష్టమే. నువ్వు ముందు వెళ్లి వరహాలు తీసుకురాపో’ అని చెప్పి పంపాడు.
మూడోవాడి దగ్గర కూడా మంత్రి అనుచరుడు అవే మాటలు చెప్పాడు. మూడో వాడు కాసేపు ఏదో ఆలోచించాడు. తర్వాత.. ‘ఇంత పెద్ద పదవికి అంత తక్కువ మొత్తమా! నేను నీకు రెండు వేల వరహాలు ఇస్తాను. నాకు ఈ పదవి వచ్చేలా చూడు. మరో మాట ఇలాంటి వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా చేయాలి. అందుకే నేను రేపు వరహాలతో సిద్ధంగా ఇక్కడికి వస్తాను. మంత్రిని కలిసే అవకాశం కల్పించు’ అని చెప్పాడు.
తర్వాత నేరుగా యువరాజు దగ్గరకు వెళ్లి ‘రాజా.. మీ రాజ్యంలో మంత్రి అనుచరుడే పెద్ద అవినీతిపరుడు. ముందు అతణ్ని శిక్షించండి. ఈ విషయం తెలుసుకోలేకపోయిన మంత్రినీ మందలించండి’ అంటుండగానే.. మంత్రి, అతని వెంట అనుచరుడూ నవ్వుతూ వచ్చారు. వారిని చూసి మూడోవాడు ఆశ్చర్యపోయాడు. వెంటనే యువరాజు.. ‘శభాష్‌.. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. మొదటివాడు నిజాయతీపరుడైనా.. అవినీతిని ధైర్యంగా బట్టబయలు చేయలేకపోయిన పిరికివాడు. రెండోవాడు అవినీతిపరుడు. ‘నీలాంటి నిజాయతీ పరుడు, ధైర్యవంతుడే ఈ  పదవికి అర్హుడు’ అంటూ మూడోవాణ్ని భుజం తట్టి మెచ్చుకున్నాడు.

- శేషచంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని