దారి చూపిన దెయ్యాలబావి!

వేసవి వచ్చిందంటే చాలు రాజ్య సరిహద్దు గ్రామాల్లో ప్రజలను క్రూరమృగాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జనం విన్నవించడంతో రాజ్యాధిపతైన రఘువర్మ వాటిని వేటాడాలనుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఆ సంవత్సరమూ దానికి ఏర్పాట్లు చేయమని పరివారాన్ని ఆదేశించాడు. ప్రభూ! ఏటా వేట పేరున ఎన్నో కొన్ని మృగాలు మీ చేతిలో మరణిస్తున్నాయి. అయినా సమస్య అలాగే ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కొంటే బాగుంటుందని సూచన చేశాడు మంత్రి...

Published : 20 Apr 2021 00:20 IST

వేసవి వచ్చిందంటే చాలు రాజ్య సరిహద్దు గ్రామాల్లో ప్రజలను క్రూరమృగాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జనం విన్నవించడంతో రాజ్యాధిపతైన రఘువర్మ వాటిని వేటాడాలనుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఆ సంవత్సరమూ దానికి ఏర్పాట్లు చేయమని పరివారాన్ని ఆదేశించాడు.
ప్రభూ! ఏటా వేట పేరున ఎన్నో కొన్ని మృగాలు మీ చేతిలో మరణిస్తున్నాయి. అయినా సమస్య అలాగే ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కొంటే బాగుంటుందని సూచన చేశాడు మంత్రి.
‘మొత్తం జంతువులన్నింటినీ వేటాడటమే శాశ్వత పరిష్కారమనేది నా అభిప్రాయం. ఈ సారి అడవుల్ని జల్లెడ పట్టేయాలి. ప్రజా సంక్షేమం కోసం ఈ పని తప్పదు’ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు రఘువర్మ. ‘ప్రభూ! రాజ్యంలో ప్రజల సంక్షేమం పర్యావరణంతో ముడిపడి ఉంటుంది. ప్రకృతిని పరిరక్షించుకుంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు’ అని వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేశాడు మంత్రి.

‘మంత్రి వర్యా! మానవులు మైదాన ప్రాంతంలో, క్రూర జంతువులు అడవుల్లో ఉండడం అనేది ప్రకృతి ధర్మం. క్రూర జంతువులు హద్దులు దాటి జనావాసాల్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉందిగా’ అని తన వాదనను వినిపించాడు రఘువర్మ.
మంత్రి ఇక చేసేది లేక రాజుతోపాటే వేటకు బయలుదేరాడు. గుర్రాల మీద చాలా దూరం వెళ్లాక ఒక గ్రామం వచ్చింది. అక్కడ కొంత మంది మహిళలు కుండలు పట్టుకుని నీటికోసం వెళుతూ కనిపించారు.
రఘువర్మ ఆగి గ్రామంలో మంచి నీటి సౌకర్యం గురించి ఆరా తీశాడు. రహదారి విస్తరణ, కలప కోసం చాలా చెట్లు నరికేశారు. చల్లని మా పల్లె వేడెక్కిపోయింది. అప్పటి నుంచి నీటి కొరత ప్రారంభమైంది. అందుకే దెయ్యాల బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం’ ఉసూరుమంటూ చెప్పింది ఓ మహిళ.
‘మరి ఆ దెయ్యాలబావి దగ్గరకు వెళ్లాలంటే మీకు భయమనిపించలేదా?’ అని మంత్రి ఆ స్త్రీని అడిగాడు. ‘నీటి కొరత మాలో తెగింపును తెచ్చింది’ ఆవేశంతో చెప్పింది ఇంకొక మహిళ. మీ ఐకమత్యం చూస్తుంటే ముచ్చటేస్తుందని ప్రశంసించాడు మంత్రి. ఇదే స్ఫూర్తితో మీ గ్రామంలో వన పెంపకం చేపట్టి సంరక్షించుకుంటే మీ కష్టాలు తీరిపోతాయి. ఈ విషయంలో రాజుగారి సహకారం సంపూర్ణంగా ఉంటుందని సలహా ఇచ్చాడు.
మహిళల కష్టాలను విని చలించిపోయిన రఘువర్మ తొందరలో నీటి కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.
అనంతరం మంత్రిని తనతోపాటు వెనుదిరగమని చెప్పాడు. మంత్రి ఆశ్చర్యపోయాడు. ‘ప్రభూ! మీ నిర్ణయంలో దాగిన రహస్యం ఏమిటో సెలవీయగలరా?’ టక్కున  అడిగాడు. ‘ఈ మహిళల ద్వారా రెండు విషయాలు తెలుసుకున్నాను. అడవిలో నీటి కొరత కారణంగా వేసవిలో జంతువులు జనావాసాల మధ్యకు రావడం జరుగుతుందనేది ఒకటి. అడవిలోనే నీరు లభిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. ఇక మనుషులు వెళ్లని చోట మాత్రమే చెట్టు, చేమ వృద్ధి చెందుతున్నాయి. అక్కడ మాత్రమే నీటి నిల్వలు పుష్కలంగా ఉంటాయన్న నిజం రెండోది. అడవుల్లో చెట్టు, చేమ వృద్ధి  చెందితేనే క్రూరమృగాలకు నీటి కొరత ఉండదు. లేని దెయ్యాల భయంతో దెయ్యాల బావి చుట్టూ చిట్టడవి పెరిగినప్పుడు ఉన్న క్రూర మృగాల సంచారమే మనుషుల భయానికి కారణమై అడవిలో పచ్చదనం పరుచుకుంటోంది. జంతువులను వేటాడటం కన్నా.. వాటి సంరక్షణే సమస్యకు అసలు పరిష్కారం. అందుకే వేటకు వెళ్లకుండా వెనుదిరుగుతున్నాం’ అని తన మనసులో మాట చెప్పాడు రఘువర్మ.
‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు’ అంటూ రఘువర్మను పొగడ్తలతో ముంచెత్తాడు మంత్రి.

- బి.వి పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని