సింహగర్జన..విద్యార్జన!

అదొక అడవి. దానికి స్వర్ణకేసరి అనే సింహం రాజుగా ఉండేది. చదువు వల్ల పిల్లలు జ్ఞానవంతులు, గుణవంతులు కాగలరని వింది. అడవిలో ఉన్న పిల్ల, యువ జంతువులకు విద్య అందించాలనుకుంది. గురుకులాలను స్థాపించి గురువులను నియమించింది. కొన్ని నెలలు గడిచాయి.

Published : 21 Apr 2021 00:49 IST

అదొక అడవి. దానికి స్వర్ణకేసరి అనే సింహం రాజుగా ఉండేది. చదువు వల్ల పిల్లలు జ్ఞానవంతులు, గుణవంతులు కాగలరని వింది. అడవిలో ఉన్న పిల్ల, యువ జంతువులకు విద్య అందించాలనుకుంది. గురుకులాలను స్థాపించి గురువులను నియమించింది. కొన్ని నెలలు గడిచాయి.
ఒక రోజు స్వర్ణకేసరి ఉన్న గుహకు ఒక జంతు సమూహం వచ్చింది. మృగరాజును దర్శించి ‘రాజా! మేము తూర్పు ప్రాంతం నుంచి వచ్చాం. మా పిల్లలకు విద్యనందించి మంచిపనే చేశారు. చదువుతో పాటు పిల్లలు మంచి నడవడిని పొందారు. క్రమశిక్షణ నేర్చుకున్నారు. ఒకరినొకరు గౌరవించడం తెలుసుకున్నారు. సహనం అలవర్చుకున్నారు. అడవిని బాధ్యతగా చూసుకుంటున్నారు’ అని ధన్యవాదాలు తెలిపి వెళ్లాయి. ఆ సమయంలో స్వర్ణకేసరి మిత్రుడు తామ్రకేసరి కూడా అక్కడే ఉంది.
తామ్రకేసరి మరో అడవికి రాజు. ‘పిల్లలకు, యువతకు విద్యనందించాలన్న మీ ఆలోచన ఆచరించదగింది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు తెలిపిన ఆ జంతువుల కళ్లలో ఆనందం చూశాను. నా రాజ్యంలో కూడా గురుకులాలను స్థాపిస్తాను’ అని మిత్రుడు చేసిన పనిని మెచ్చుకుంది.
మిత్రుడి పొగడ్తకు స్వర్ణకేసరి చాలా ఆనందించింది. అంతలోనే మరో జంతు సమూహం వచ్చింది. ఆ జంతువులు చాలా అసహనంగా ఉన్నాయి. మృగరాజును చూసి ‘మేం పడమర ప్రాంతం నుంచి వచ్చాం. ఏమి గురుకులాలు పెట్టారో గాని మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది. పిల్లలు, యువత చెడుదారి పడుతున్నారు. దుర్వ్యసనాలు అలవాటు చేసుకుంటున్నారు. వినయ విధేయతలు మరిచారు. కుట్రలూ కుతంత్రాలూ వారికి వెన్నతో పెట్టిన విద్యైంది. మంచి చేయని విద్య మాకు అక్కర్లేదు’ అని తెగేసి చెప్పి వెళ్లిపోయాయి. ‘కొన్ని గంటల కిందట ఒకరి నుంచి కృతజ్ఞతలు. ఇప్పుడు మరొకరి నుంచి ఛీత్కారాలు’ ఎందుకిలా జరిగిందని స్వర్ణకేసరి వాపోయింది.
తామ్రకేసరి మిత్రుడి అవస్థను అర్థం చేసుకుంది. ‘మిత్రమా! గురువుల ప్రవర్తన మీద నాకు అనుమానం కలుగుతోంది. పడమర ప్రాంతంలో విద్యాబోధన చేస్తున్న వారి గురించి తెలుసుకుంటే నీకు కారణం తెలుస్తుంది’ అంది. స్వర్ణకేసరి మిత్రుడి మాటలతో ఏకీభవించలేకపోయింది. ‘మిత్రమా! గురువులను నేను అనుమానించను. సజ్జనులు, ఆదర్శనీయులైన వారినే నేను అక్కడికి పంపాను’ అని తెలిపింది. ‘ఎందుకైనా మంచిది, వేగులను పంపించి వాస్తవం తెలుసుకోవడంలో తప్పు లేదు కదా’ అని సలహా ఇచ్చింది తామ్రకేసరి. మిత్రుడి సూచన పాటించింది స్వర్ణకేసరి.
వేగులుగా వెళ్లిన డేగలు మర్నాడు సాయంత్రానికి తిరిగొచ్చి ‘రాజా! ఈ రెండు రోజులు గురువుల ప్రవర్తన గమనించాం. పడమర ప్రాంతంలో ఉన్న గురువులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ‘తల్లి గట్టెక్కి మేస్తే.. పిల్ల గట్టు మీదున్న పుట్టెక్కి మేస్తుంది’ అన్న సామెత అక్కడ కనిపించింది. అందుకే అక్కడ విద్యార్థులు అలా తయారయ్యారని గమనించాం. కావాలనే గురువులక్కడ విద్యార్థులను చెడుదోవ పట్టిస్తున్నట్లు మాకు అనిపిస్తోంది’ అని విన్నవించాయి.
పరిస్థితిని అదుపు చేయడానికి స్వర్ణకేసరి, తామ్రకేసరి పడమరప్రాంతానికి వెళ్లాయి. అక్కడ అడవి బోసిపోయినట్లుంది. ఏ చెట్టూ నిండుగా కనిపించలేదు. గురువులను పిలిపించి తమ పద్ధతిలో ఆరా తీశాయి. అవి కావాలనే కాని పనులు చేస్తున్నట్లనిపించింది. అంతలో గూఢచారిగా ఉన్న గండభేరుండ పక్షి ఒకటి వచ్చి ‘మహారాజా! ఇవి మనం నియమించినవి కాదు. అసలైనవి ఒక లోయలో బందీలుగా ఉన్నాయి. మన శత్రువు లోహకేసరి మన గురువులకు బదులుగా వీటిని పంపించి.. పచ్చగా ఉన్న మన అడవిని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నింది’ అని జరిగిన విషయం చెప్పింది.
తామ్రకేసరి, స్వర్ణకేసరి అవాక్కయ్యాయి. మర్నాడే శత్రురాజ్యం మీద దండయాత్ర చేసి నిజమైన గురువులను విడిపించాయి. అప్పటి వరకు తమ ఆధీనంలో ఉన్న శత్రురాజ్య నకిలీ గురువుల తోకలు కత్తిరించి తరిమి కొట్టాయి. అసలైన గురువుల సారథ్యంలో పడమర ప్రాంత అరణ్యంలోని పిల్ల జంతువులు, యువ జంతువులు మంచి దారిలో పడ్డాయి. తన ఆశయం నెరవేరడంతో మృగరాజు స్వర్ణకేసరి చాలా ఆనందించింది.

 

- బెలగాం భీమేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని